హాయిగా విమానం ఎక్కింది. చక్కగా నిద్రలోకి జారుకుంది. మెలుకువ వచ్చి చూస్తే.. ఒక్కసారిగా షాక్ అయింది. విమానం మొత్తం చీకటి. తలుపులు వేసేసి ఉన్నాయి. తను ఎక్కుడుందో కూడా అర్థం కాని అయోమయం. ఫోన్ స్విచాఫ్ అయిపోయింది. చిమ్మ చీకట్లో ఏం పాలుపోని పరిస్థితి.
కెనడాకు చెందిన టిఫానీ ఆడమ్స్ అనే మహిళ అవస్థలు ఇవి. క్యుబెక్ నుంచి టొరంటో వెళ్ళడానికి ఆమె ఎయిర్ కెనడా విమానం ఎక్కింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికి ఆమె నిద్రలోకి జారుకుంది. ఈ లోపు విమానం టొరంటో చేరుకుంది. అందులో ప్రయాణిస్తున్న వారు దిగిపోయారు. ఎవరూ ఆమెను గమనించలేదు. తరువాత విమానాన్ని పక్కకు పెట్టేశారు. గ్రౌండ్ సిబ్బంది కూడా విమానంలో ఎవరన్నా ఉన్నారేమో అని పరిశీలించలేదు. దాదాపు నాలుగు గంటలు గడిచిన తరువాత ఆమెకు మెలకువ వచ్చింది. చూసేసరికి తాను విమానంలో చిక్కుకున్నట్టు అర్థం అయింది. అందులోంచి బయటపడటం ఎలాగో ఆమెకు అర్థం కాలేదు. విమానం వెతికితే.. చివరకు ఓ టార్చ్ లైట్ కనిపించింది. దాని సహాయంతో విమానం తలుపు వద్దకు చేరుకొని శబ్దాలు చేస్తే.. గ్రౌండ్ లో ఉన్న ట్రక్కు డ్రైవర్ ఒకరు చూసి ఆమెను రక్షించారు.
ఈ విషయాన్ని ఆమె తన ఫేస్ బుక్ ఫ్రెండ్ డయన్న నోయల్ తో పంచుకుంది. దాంతో ఈ విషయం వైరలైంది. విషయం తెలుసుకున్న ఎయిర్ కెనడా టిఫానీ కి క్షమాపణలు చెప్పుకుంది.