మేథోసంపత్తి దేశం దాటి ఎందుకు వెళ్లిపోతుందో చెప్పేందుకు ఇది ఓకే ఉదాహరణ. తమిళనాడుకు చెందిన ఓ ఇంజనీర్ నీటితో ఇంకా చేప్పాలంటే హైడ్రోజన్ తో నడిచే ఇంజన్ తయారు చేశాడు. తన సొంత ఖర్చులతో ఎన్నో ఏళ్లు కష్టపడి దీనిని సాధించాడు. ఈ ఇంజిన్ ను ఇక్కడే ఆవిష్కరించాలనుకున్నాడు. అయితే, ఇక్కడి అధికారులు మాత్రం అతడి అభ్యర్ధనను మన్నించలేదు. దాంతో ఆ ఇంజనీర్ జపాన్ దేశాన్ని సంప్రదించాడు. వారు ఆ ఇంజిన్ ఆవిష్కరణకు పచ్చ జెండా ఊపారు.
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన సౌంథిరాజన్ కుమారస్వామి అనే ఇంజినీర్ అద్భుతం చేశాడు. పరిశుద్ధమైన నీటి (డిస్టిల్లెడ్ వాటర్)తో పనిచేసే ఎకో-ఫ్రెండ్లీ ఇంజిన్‌ను తయారు చేశాడు. నీటితో పనిచేసే ఈ ఇంజిన్ ఆక్సిజన్‌ను విడుదల చేయడం ఇంకో విశేషం. మెకానికల్ ఇంజినీర్ అయిన కుమారస్వామి ఈ సందర్బంగా మాట్లాడుతూ హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగించుకునే ఈ ఇంజిన్ ప్రాణవాయువును విడుదల చేస్తుందని తెలిపాడు. ఈ ఇంజిన్‌ను అభివృద్ధి చేయడానికి తనకు పదేళ్లు పట్టిందన్నాడు. ప్రపంచంలోనే ఇది తొలి ఆవిష్కరణ అని పేర్కొన్నాడు. త్వరలోనే దీనిని జపాన్‌లో ఆవిష్కరించనున్నట్టు తెలిపాడు. భారత్‌లోనూ దీనిని ఆవిష్కరించనున్నట్టు చెప్పాడు. ఈ ఎకో-ఫ్రెండ్లీ ఇంజిన్‌ను భారత్‌లోనే తొలుత పరిచయం చేయాలని భావించానని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో జపాన్ ప్రభుత్వాన్ని సంప్రదించినట్టు కుమారస్వామి తెలిపాడు. వారి నుంచి తనకు సహకారం లభించిందని, త్వరలోనే అక్కడ ఈ ఇంజిన్‌ను ఆవిష్కరించనున్నట్టు వివరించాడు.