అమ్మ.. బిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవాలనుకుంటుంది. అమ్మ.. తనకెంత కష్టం వచ్చినా, తన పాపాయి మాత్రం సుఖంగా ఉండాలనుకుంటుంది. కానీ, విధి పేదరికం ఆ అమ్మకు కడుపుకోతను మిగిల్చాయి. బిడ్డ మరణించినా కాటికి చేర్చలేని నిస్సహాయత ఆ బిడ్డ మృతదేహంతో నడిరోడ్డుపై బొమ్మలు అమ్ముకునేలా చేసింది. అందరి హృదయాలను కదిలించిన ఈ సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.
ఒడిశాలోని కటక్ నగరంలో బక్షిబజార్ కు చెందిన భారతి, సుభాష్ నాయక్ లకు ముగ్గురు బిడ్డలు. సుభాష్ నాయక్ కుటుంబాన్ని పట్టించుకోకుండా వదిలేశాడు. దీంతో భారతి రోడ్డు పక్కన బొమ్మలు అమ్ముకుంటూ పిల్లలను పోషిస్తోంది. ఈ క్రమంలో ఆమె చిన్న బిడ్డ తీవ్ర అనారోగ్యం పాలైంది. ఆసుపత్రిలో చూపించే స్థోమత లేకపోవడం తో ఆ పాప మరణించింది. చనిపోయిన పాప అంత్యక్రియలు జరపడానికి కూడా డబ్బులేని స్థితిలో భారతి బొమ్మలు అమ్ముకుని ఆ డబ్బులతో కార్యక్రమాన్ని జరపాలని నిర్ణయించుకుంది. పాప మృతదేహాన్ని ఒడిలో ఉంచుకునే వ్యాపారాన్ని చేయడం మొదలు పెట్టింది. దీనిని గమనించిన స్థానికులు ఆమె పరిస్థితి చూసి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అంతే కాకుండా, అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. దీంతో అధికారులు అక్కడకు చేరుకొని శిశువు మృతదేహానికి అంత్యక్రియలు జరిపించారు. జిల్లా శిశు సంక్షేమాధికారులు మిగిలిన ఇద్దరు చిన్నారులను బసుంధర ఆశ్రమానికి తరలించారు.