ఆయన వయసు 100.. ఆమె వయసు 102.. ఇద్దరి మనసులూ కలిసాయి.. ఏడాది పాటు డేటింగ్ చేశారు. ఒకరికోసం ఒకరని నిర్ణయించుకున్నారు. ఇంకేముంది.. వివాహబంధంతో ఒకటయ్యారు. ఈ కథ అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జరిగింది.
జాన్ కుక్ వయసు 100 ఏళ్లు. బామ్మ ఫిల్లిస్ కుక్‌కు మరికొన్ని రోజుల్లో 103 నిండుతాయి. ఈ ఇద్దరూ ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. చివరకు పెళ్లి చేసుకున్నారు. ఈ వయసులో పెళ్ళేమిటి? అందరూ ఇలాగే అన్నారు. ఆఖరుకి వృద్ధాశ్రమం లోని సహచరులు కూడా.. కానీ, వారిద్దరూ మాత్రం తమ భాగస్వాములను కోల్పోయి ఇక్కడకు చేరామని, ఎందుకో ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడి పెళ్లి చేసుకోవాలనిపించిందని చెబుతున్నారు. అంతేనా..మిగతా వాళ్ల అభిప్రాయాలతో తమకు సంబంధం లేదని తమకు నచ్చిన జీవితాన్ని తాము గడుపుతున్నట్టు స్పష్టం చేస్తున్నారు. వీరిద్దరూ ఉదయాన్నే సూర్యోదయాన్ని కలసి చూస్తూ ఆహ్లాదకరంగా గడుపుతున్నారు. ఇద్దరూ కల్సి భోజనం చేస్తారు. ఒకరికి ఒకరు తోడూ నీడగా జీవిస్తున్నారు. వీరి వివాహ విషయం కొందరు ఫేస్ బుక్ లో ఉంచారు. దానికి నేతిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందరూ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుండడం విశేషం.