Pro tem Speaker: లోకసభ ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపికపై వివాదం ఏంటి..?
Pro tem Speaker: మహతాబ్ ప్రోటెం స్పీకర్ గా ఎంపిక చేయడంపై ప్రతిపక్ష పార్టీల కూటమి వివాదానికి తెర తీసింది. మహతాబ్ ఎంపికను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎందుకు విభేదిస్తోంది ?
Pro tem Speaker: లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ బాధ్యతలు చేపట్టారు. సభలో అత్యంత సీనియర్ అయిన ఎంపీగా మహతాబ్ ఈ గౌరవం అందుకున్నారు. నూతన పార్లమెంటును నడిపేందుకు గానూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన నియామకం చేపట్టినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.సీనియర్ ఎంపీ మహతాబ్ లోక్ సభ స్పీకర్ ఎన్నిక పూర్తిగా అయ్యే వరకూ లోక్‌సభ ప్రిసైడింగ్ అధికారిగా కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు రిజిజు తెలిపారు.
ఇదిలా ఉంటే మహతాబ్ ప్రోటెం స్పీకర్ గా ఎంపిక చేయడంపై ప్రతిపక్ష పార్టీల కూటమి వివాదానికి తెర తీసింది. మహతాబ్ ఎంపిక పార్లమెంటు సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీకి చెందిన జయరాం రమేష్ తన ట్వీటర్ ఖాతాలో పేర్కొన్నారు.నిజానికి సభలో అత్యంత సీనియర్ నాయకుడికి ప్రోటెం స్పీకర్ గౌరవం దక్కుతుంది. ప్రొటెం స్పీకర్ లోక్ సభ సభ్యుల ప్రమాణ స్వీకారం కోసం ఎన్నుకుంటారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో లోక్ సభ స్పీకర్ ను ఎన్నుకుంటారు. అయితే ఈ ప్రక్రియను సాఫీగా సాగడానికి ప్రొటెం స్పీకర్ ఎంపిక జరుగుతుంది.అయితే మహతాబ్ ఎంపికపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విభేదిస్తోంది.దీనికి కారణం చెబుతూ సభలో అత్యంత సీనియర్ నాయకుడికి ప్రోటెం స్పీకర్ గౌరవం దక్కాలని కానీ బిజెపి సాంప్రదాయాలను పక్కనపెట్టి మహతాబ్ ను ఎన్నుకుందని జయరాం రమేష్ కాంగ్రెస్ పార్టీ తరపున తమ అభ్యంతరం వ్యక్తం చేశారు.నిజానికి సభలో అత్యంత సీనియర్ నాయకుడిగా ఎనిమిది సార్లు పార్లమెంటుకు ఎన్నికైన కొడికన్నీల్ సురేష్ ఉన్నారని, ఆయనతోపాటు బిజెపికి చెందిన వీరేంద్ర కుమార్ కూడా 8 సార్లు ఎన్నికయ్యారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.అయితే ఈ ఇద్దరు సభ్యులను పక్కన పెట్టి 7 సార్లు ఎంపిక అయిన మహతాబ్ ను ఎన్నుకోవడం దేనికి సంకేతం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
అయితే ఇటీవలే ఒడిశాలో తొలిసారిగా బిజెపి ప్రభుత్వం సొంతబలంపై ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని అందుకే ప్రొటెం స్పీకర్ గా ఒడిశాకు చెందిన మహతాబ్ ను ఎన్నుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మరోవైపు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ అన్ని రకాల అర్హతలు ఉన్నాయి కాబట్టి మహతాబ్ ను ప్రోటెం స్పీకర్ గా ఎన్నుకున్నట్లు ఆయన ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీ గతంలో పలుమార్లు పార్లమెంటరీ సాంప్రదాయాలను తుంగలో తొక్కిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.ఇదిలా ఉంటే భర్తృహరి మహతాబ్ లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజూ జనతాదళ్ వీడి బీజేపీలో చేరి ఇటీవల కటక్ నుంచి ఆయన ఏడోసారి విజయం సాధించారు.