పుణె పోర్షె కారు ఆక్సిడెంట్ కేసులో ఇప్పటిదాకా ఏం జరిగింది? ఎవరీ విశాల్ అగర్వాల్ ?
Pune Porsche Accident: పుణె పోర్షె కారు ప్రమాదం కేసులో ఇప్పటివరకు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Pune Porsche Accident: పుణె పోర్షె కారు ప్రమాదం కేసులో ఇప్పటివరకు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మే 17న తెల్లవారుజామున రెండు గంటల సమయంలో పోర్షె కారు అతివేగంగా బైక్ ను ఢీకొనడంతో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మరణించారు.
ప్రమాదానికి కారణమైన కారును మైనర్ బాలుడు నడిపినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో మైనర్ బాలుడు మద్యం సేవించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ తో పాటు రెండు పబ్ లకు చెందిన ఎగ్జిక్యూటివ్ లు ఉన్నారు. ఈ పబ్ లలో మైనర్ కు మద్యం సరఫరా చేసిన ఆరోపణలపై అరెస్ట్ చేశారు.
చనిపోయిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఎవరు?
పుణె పోర్షే కారు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మరణించారు. పుణె కళ్యాణి నగర్ ప్రాంతంలో పోర్షే కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అనీష్ అవదీయ, ఆశ్విని కోస్టా లు ఈప్రమాదంలో మరణించారు. మే 17న తమ స్నేహితులతో కలిసి డిన్నర్ చేసిన తర్వాత బైక్ పై ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పోర్షే కారు కళ్యాణి నగర్ ప్రాంతంలో అతివేగంగా ఢీకొట్టడంతో సంఘటనస్థలంలోనే వీరిద్దరూ మృత్యువాతపడ్డారు. వీరిద్దరూ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఉద్యోగరీత్యా పుణెలో ఉంటున్నారు.
ఎవరీ విశాల్ అగర్వాల్?
విశాల్ అగర్వాల్ పుణెలో ప్రముఖ రియల్ ఏస్టేట్ డెవలపర్. నిర్మాణ రంగంలో అగర్వాల్ కుటుంబం చాలా ఏళ్లుగా ఉంది. బ్రహ్మ కార్ప్ అనే సంస్థను విశాల్ అగర్వాల్ తండ్రి బ్రహ్మదత్ స్థాపించారు. 1982లో రామ్ కుమార్ అగర్వాల్ అతని కుటుంబ సభ్యులతో కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 2012 మార్చిలో ఈ సంస్థను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారు. 2013 అక్టోబర్ లో ఈ సంస్థ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది.
పుణెతో పాటు పరిసర ప్రాంతాల్లో నివాస గృహలు, కమర్షియల్ నిర్మాణాలను ఈ సంస్థ చేపడుతుంది. పుణెలో ఈ సంస్థ ఎనిమిది ప్రాజెక్టులను నిర్మిస్తుంది. భవిష్యత్తులో మరో మూడు ప్రాజెక్టులను చేపట్టనుంది. ఈ సంస్థను విశాల్ అగర్వాల్ నిర్వహిస్తున్నారు. ఈ కుటుంబానికి బ్రహ్మ మల్టిస్పేస్, బ్రహ్మ మల్టికాన్ పేరుతో సంస్థలను నిర్వహిస్తుంది. ఈ సంస్థలు పుణెలో ఫైవ్ స్టార్ హోటల్స్ ను నిర్మిస్తుంది.
పుణె పోర్షె కారు ప్రమాదంలో ఇప్పటివరకు ఏం జరిగింది?
మే 17న పుణె పోర్షె కారు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మృతి చెందారు. ఈ ప్రమాదం చేసిన డ్రైవర్ మైనర్ గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు కోర్టులో హజరుపర్చారు. అయితే కోర్టు నిందితుడికి రూ. 7,500 ష్యూరిటీతో బెయిల్ మంజూరు చేసింది. రోడ్డు ప్రమాదాలు, పరిష్కారాలపై 300 పదాలతో వ్యాసం రాయాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని కోర్టు కోరింది. రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేయాలని కూడ సూచించింది. ఇద్దరి మృతికి కారణమైన నిందితుడికి బెయిల్ రావడంపై మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ రియాక్షన్
పుణె పోర్షే కారు ప్రమాదంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. నిందితుడికి వెంటనే బెయిల్ రావడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేసు తీవ్రతను బట్టి మైనర్లను కూడా మేజర్లుగా పరిగణించవచ్చని ఫడ్నవీస్ గుర్తు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఫడ్నవీస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులతో ఫడ్నవీస్ సమీక్ష నిర్వహించారు.
మైనర్లకు లిక్కర్ సరఫరా... రెండు లిక్కర్ ఔట్ లెట్లు సీజ్
పుణె పోర్షె కారు ప్రమాదానికి ముందు కారు డ్రైవింగ్ చేసిన మైనర్ బాలుడు తన స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్టుగా పోలీసులు గుర్తించారు. పుణె నగరంలోని రెండు రెస్టారెంట్లలో మైనర్ బాలుడు అతని స్నేహితులు మద్యం సేవించినట్టుగా పోలీసులు గుర్తించారు. మే 16 రాత్రి 9:30 గంటల నుండి మే 17న తెల్లవారుజాము 1గంట వరకు రెస్టారెంట్లలో వీరంతా గడిపారని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. మైనర్లకు మద్యం సరఫరా చేసినందుకు గాను ఈ రెండు రెస్టారెంట్లను మహారాష్ట్ర ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. మహారాష్ట్రలో 25 ఏళ్లుంటేనే లిక్కర్ తాగేందుకు అనుమతి ఉంది.
పోర్షె కారు రిజిస్ట్రేషన్ పెండింగ్
పుణెలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన పోర్షె కార కారు రిజిస్ట్రేషన్ ఇంకా పూర్తి కాలేదు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ట్రాన్స్ పోర్ట్ శాఖ మంగళవారం నాడు స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చి నుండి రూ. 1,758 ఫీజు చెల్లించని కారణంగా పోర్షె కారు శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తి కాలేదని మహారాష్ట్ర ట్రాన్స్ పోర్ట్ అధికారులు ప్రకటించారు. బెంగుళూరు నుండి ఈ కారును మహారాష్ట్రకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ తో పంపిన విషయాన్ని అధికారులు గుర్తించారు.
రాహుల్ గాంధీ: చట్టం అందరికి ఒకేలా ఉండాలి
పుణె పోర్షే కారు ప్రమాదంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను ఆయన రిలీజ్ చేశారు. ఓలా డ్రైవర్, ఉబేర్ డ్రైవర్ , ట్రక్కు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ఆ ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే డ్రైవర్లకు 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారన్నారు. కానీ, పుణె ప్రమాదంలో మైనర్ బాలుడికి 15 గంటల్లోనే బెయిల్ రావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంపన్న కుటుంబానికి చెందిన మైనర్ బాలుడైతే రోడ్డు ప్రమాదంపై వ్యాసం రాయాలని అడుగుతారు... అదే బస్సు లేదా ట్రక్కు డ్రైవర్లను కూడా ఇలాగే వ్యాసం రాయమని సరిపెడతారా అని ఆయన ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయమని, ఈ వివక్షపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని రాహుల్ అన్నారు.
Also Read: పుణె పోర్షే కారు ప్రమాదంలో ఇద్దరి మృతి: మైనర్లు కార్లు నడపవచ్చా?