Top 6 News Of The Day: భారీ రుణభారం తెలంగాణకు సవాల్‌గా మారిందన్న రేవంత్ రెడ్డి.. మరో 5 ముఖ్యాంశాలు
1) తెలంగాణలో వరద బాధితులకు భారీ ఊరట
తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎన్నో కుటుంబాలు రోడ్డు పడ్డాయి. ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. తీవ్ర వర్షాలకు ఎన్నో కుటుంబాలకు తమ వాళ్లను కోల్పోయాయి. ఈ క్రమంలోనే వారికి అండగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి కుటుంబానికి రూ. 16,500 చొప్పున సాయం అందించనున్నట్లు తెలిపింది. ఈ సాయం చివరి బాధితుడి వరకూ అందుతుందని రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వర్షాల వల్ల నష్టపోయామని ఏ ఒక్క కుటుంబం బాధపడాల్సిన అవసరం లేదన్నారు. భారీ వర్షాలపై సోమవారం సచివాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
2) హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనంపై హైకోర్టు తీర్పు
హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలను నిషేధించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ పిటిషన్‌పై మంగళవారం (సెప్టెంబరు 10) విచారణ జరిగింది. దీంతో హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
3) విశాఖలో రోడ్డెక్కిన ఉక్కు కార్మికులు.. ఉద్రిక్తత
విశాఖలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశాఖ ఉక్కు కార్మికులు రోడ్డెక్కారు. విశాఖపట్నంలోని కూర్మన్నపాలెం కూడలిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ, నిర్వాసితుల రాస్తారోకోతో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. హామీ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా… కేంద్రం నిర్ణయం తీసుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నేషనల్ హైవేను దిగ్భందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని నిలువరించారు. కూర్మన్నపాలెం జంక్షన్‌లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈరోజు ఉదయం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు స్టీల్ ప్లాంట్ కార్మికులంతా రాస్తారోకో నిర్వహించారు.
4) మోదీపై నాకేం కోపం.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత ప్రధాని మోడీపై ఎప్పుడూ విమర్శలు చేసే రాహుల్‌గాంధీ తొలిసారి మోడీపై పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. ప్రధాని మోడీ అంటే తనకు ద్వేషం లేదని రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. మోడీకి ఒక ప్రత్యేకమైన పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందని, దానిని మాత్రమే వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. తమ ఇద్దరి సైద్ధాంతిక అభిప్రాయాలు మాత్రమే వేరని అన్నారు. వ్యక్తిగతంగా ఆయనంటే తనకు ఎలాంటి కోపం, ద్వేషం కానీ లేదన్నారు రాహుల్‌గాంధీ.
5) భారీ రుణభారం తెలంగాణకు సవాల్‌గా మారిందన్న రేవంత్ రెడ్డి
ప్రజాభవన్‌లో 16వ ఆర్ధిక సంఘం సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని తెలంగాణను ది ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమన్నారు. దేశాభివృద్ధి లో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. భారీ రుణభారం తెలంగాణకు సవాల్‌గా మారిందని.. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణభారం 6.85 లక్షల కోట్లకు చేరుకుందని వివరించారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) ప్రకాశం బరాజ్‌పై పడవలతో భారీ కుట్ర?
విజయవాడ ప్రకాశం బరాజ్ వైపు అయిదు పడవలు కొట్టుకొచ్చిన ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. వీటిలో మూడు పెద్ద పడవలు బరాజ్ గేట్లను ఢీకొనడంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనను చంద్రబాబు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీని వెనుక వైసీపీ కుట్ర ఉందని స్వయంగా ముఖ్యమంత్రే ఆరోపించారు. అసలేం జరిగింది? గొల్లపూడి వైపు బోట్లు ఎందుకు వచ్చాయి? పడవలకు లంగరు వేయడంలో నిర్లక్ష్యమా? ప్రకాశం బరాజ్‌ను దెబ్బ తీసే కుట్ర జరిగిందా? డామేజీ ఏ స్థాయిలో ఉంది? పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.