Top 6 News Of The Day: హైడ్రా ఇచ్చిన కొత్త నివేదికలో ఏముంది? మరో టాప్ 5 న్యూస్ హెడ్‌లైన్స్
1) హైడ్రా రంగంలోకి దిగితే.. కబ్జాదారులకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
చెరువులు, నాలాలు, కుంటల కబ్జాదారులకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చెరువులను కబ్జా చేసిన వాళ్లను వదిలి పెట్టబోమన్నారు. కబ్జా చేసిన వారు.. వారికి వారిగానే ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోరారు. లేకపోతే హైడ్రా రంగంలోకి దిగి నేలమట్టం చేస్తుందని హెచ్చరించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ దగ్గర కొందరు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఫామ్ హౌస్‌లలోని డ్రైనేజీ నీరు జంట జలాశయాల్లోకి కలుపుతున్నారని చెప్పారు. చెరువులు, కుంటల్ని ఆక్రమించి కట్టిన కట్టడాల వల్ల ఆకస్మిక వరదలు వస్తున్నాయన్నారు. ఆక్రమణదారులు ఎంతటివరైనా వదిలిపెట్టేది లేదన్న ఆయన ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసే బాధ్యత తమదే అని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కోర్టుల్లో కూడా పోరాడుతామని చెప్పుకొచ్చారు.
2) గుంటూర్ సబ్ జైలుకు వెళ్లిన మాజీ సీఎం జగన్
మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరులో పర్యటించారు. వైఎస్ జగన్ బుధవారం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు సబ్ జైలుకు చేరుకున్నారు. అక్కడ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించారు. నందిగం సురేష్‌కి తమ పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇంత దుర్మార్గపు పాలన ఏపీలో ఎన్నడూ లేదని.. చంద్రబాబు సర్కార్‌పై మండిపడ్డారు.
3) ఎన్నికల బరిలోకి దిగిన వినేశ్ ఫోగట్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన వినేశ్ ఫోగట్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ తరపున పోటీ చేస్తోంది. నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో వినేశ్‌కు వ్యతిరేకంగా.. బీజేపీ తరపు నుంచి కెప్టెన్ యోగేశ్ బైరాగీ పోటీపడనున్నారు. 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
4) 'కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు చీరలు, గాజులు వేసుకొని తిరగండి'
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 4 వారాల్లో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. హైకోర్టు ఆదేశాలను కాలయాపన చేయకుండా చర్యలు ప్రారంభించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు తీర్పుతో 10 మంది ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారని, రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం తధ్యమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు చీరలు, గాజులు వేసుకుని తిరగండంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గిఫ్ట్ కింద గాజులు, చీరలు పంపిస్తున్నా అంటూ వాటిని మీడియా ముందే ప్రదర్శించారు పాడి కౌశిక్ రెడ్డి. దానం నాగేందర్, కడియం శ్రీహరి చీటర్, మోసగాళ్లు అంటూ ఘాటుగా స్పందించారు.
5) సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ
సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందించారు పవన్ కల్యాణ్. ఇందుకు సంబంధించిన చెక్‌ను సీఎం రేవంత్‌కు డిప్యూటీ సీఎం పవన్ అందజేశారు. అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
6) హైడ్రా కొత్త నివేదిక.. మొత్తం ఎన్ని కూల్చేశారు.. ఎన్ని ఎకరాలు లెక్కతేల్చారంటే..
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతలపై రెండోసారి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 262 అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు రంగనాథ్ తెలిపారు. 23 ప్రాంతాలలో అక్రమ కట్టడాల కూల్చివేత అనంతరం మొత్తం 111.72 ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుండి స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. అందులో అత్యధికంగా అమీన్ పూర్ చెరువులో 24 అక్రమనిర్మాణాలు తొలగించి 51 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు రంగనాథ్ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.