Parliament Session: పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసిన మణిపూర్ ఘటన.. ఉభయ సభలు రేపటికి వాయిదా
Parliament Session: చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపిన మంత్రి ప్రహ్లాద్ జోషి
Parliament Session: మణిపూర్ ఘటన పార్లమెంట్ ఉభయసభలను కుదిపేసింది. మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లు, మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనలపై మణిపూర్ అంశంపై విపక్షాలు 8 వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఈ విషయంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవగానే ఇటీవల మరణించిన ఎంపీలకు సంతాపం తెలిపారు. అనంతరం సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సమావేశం ప్రారంభం అవగా.. మణిపూర్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో మరోసారి ఉభయ సభలను వాయిదా వేశారు.
మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభ సమావేశం ప్రారంభం కాగా.. విపక్షాలు ఆందోళనకు దిగాయి. అయితే మణిపూర్ అంశంపై చర్చకు తాము సిద్ధమంటూ ప్రహ్లాద్ జోషి తెలిపారు. సభ్యులు సభను సజావుగా సాగేలా సహకరించాలని.. తాము మణిపూర్ అంశంపై చర్చిస్తామన్నారు. అయినా విపక్షాలు పట్టు వీడలేదు. దీంతో సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్.
అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విపక్ష ఎంపీలు మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాని మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో మాట్లాడాలని విపక్ష నేత ఖర్గే డిమాండ్ చేశారు. మరోవైపు విపక్ష ఎంపీలు చర్చకు పట్టుబట్టారు. దీంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు.