దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. మళ్లీ లాక్‌డౌన్ వస్తుందేమోనని..
Coronavirus in India: రోజు రోజుకు కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి.
Coronavirus in India: రోజు రోజుకు కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మళ్లీ 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. పైగా చిన్నారులకు కరోనా సోకుతుండడం మృతుల సంఖ్య పెరగడంతో ప్రజల్లో టెన్షన్ మొదలయింది. ఫోర్త్ వేవ్ మప్పు జూన్ కంటే ముందే వస్తుందేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది. లక్షణాలు తక్కువగా ఉన్నాయని, ఆసుపత్రుల్లో చేరికలు కూడా అంతంత మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీ, యూపీ, హర్యానా, మహారాష్ట్ర, మిజోరాం రాష్ట్రాల్లో కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. తాజా పరిస్థితులతో మళ్లీ కరోనా ఆంక్షలు మొదలవుతాయేమోనన్న భయం ప్రజల్లో పెరుగుతోంది.
దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా పెరుగుతున్న కేసులు ప్రజలను టెన్షన్ పెడుతున్నాయి. థర్డ్‌వేవ్‌లో మృతుల సంఖ్య తగ్గడంతో అంత ఆందోళన చెందని ప్రజలకు ప్రస్తుత పరిస్థితులు భయాన్ని కలిగిస్తున్నాయి. తీవ్రత అంతగా లేదని ఆసుపత్రుల్లో చేరికలు తక్కువగా ఉన్నాయని భయపడాల్సిన పని లేదని నిపుణులు చెబుతున్నా పెరుగుతున్న మృతుల సంఖ్య ప్రజలను కలవరపెడుతోంది. మొన్న 2వేల కేసులకే 214 మంది చనిపోగా 24 గంటల్లో కొత్తగా 2వేల కేసులు నమోదుకాగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కేసులు అధికంగా వస్తున్న ఐదు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఢిల్లీ, యూపీ, హర్యానా, మహారాష్ట్ర, మిజోరాం రాష్ట్రాల్లో కోవిడ్ కట్టడికి ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైతే వైరస్ గుర్తించిన ప్రాంతాల్లో అత్యవసర చర్యలు తీసుకోవాలని ఐదు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ కోరారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వాక్సిన్ అనే ఐదు పద్ధతులను తప్పకుండా పాటించాలని ఆదేశించారు.
ఢిల్లీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదువుతున్నాయి. 24 గంటల్లో కొత్తగా 632 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 29 శాతం కేసులు పెరిగాయి. ఏప్రిల్ 11 నుంచి 18 మధ్య కాలంలో మూడు రెట్టు కొత్త ఇన్ఫెక్షన్లు పెరిగాయి. రానున్న రోజుల్లో దేశ రాజధానిలో కోవిడ్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక హర్యానాలో 24 గంటల్లో కొత్తగా 234 కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా 198 కేసులు గురుగ్రామ్‌లో, 21 కేసులు ఫరీదాబాద్‌లో వైద్యాధికారులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోనూ కొత్త కేసులు భారీగా నమోదువుతున్నాయి. 24 గంటల్లో 159 కేసులు నమోదవగా, వాటిలో 107 కేసులు గౌతమ్‌బుద్ధనగర్‌లోవే కావడం గమనార్హం. అందులోనూ 33 మంది చిన్నారులు వైరస్ బారిన పడినట్టు వైద్యశాఖ ప్రకటించింది. ఢిల్లీ సమీప జిల్లాలో మాస్క్ తప్పనిసరి చేస్తూ యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్రలో 137 కేసులు నమోదవగా, ముగ్గురు మృతి చెందారు. ఈశాన్య రాష్ట్రం మిజోరాంలోనూ 125 కేసులు గుర్తించగా ఒకరు మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్తగా కరోనా కేసులు వెలుగుచూశాయి. ఏపీలో ఐదుగురికి, తెలంగాణలో 22 మందికి వైరస్ సోకినట్టు ఇరు రాష్ట్రాల వైద్యశాఖలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది.
ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కేసులు నమోదు తక్కువే. కానీ.. మరణాల సంఖ్య మాత్రం బెంబేలెత్తిస్తోంది. దీంతో మళ్లీ లాక్‌డౌన్ వస్తుందేమోనని.. వణికిపోతున్నారు. గతంలో లాక్‌డౌన్‌తో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ఓవైపు ఉపాధిని కోల్పోయి మరోవైపు తినడానికి తిండి లేక అల్లాడిపోయారు. నాటి పరిస్థితులను గుర్తుతెచ్చుకుని భయభ్రాంతులకు గురవుతున్నారు. 2020 మార్చి తరువాత విధించిన లాక్‌డౌన్‌తో దేశంలోని అన్ని రంగాలు కుప్పకూలాయి. అప్పట్లో సరైన చికిత్సలు లేక వేలాది మంది ప్రజలు మృత్యవాత పడ్డారు. నాటి భయంకరమైన పరిస్థితులు ప్రజలు మదిలో నుంచి ఇంకా చెరిగిపోలేదు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ వస్తే.. తమ పరిస్థితి ఏమిటని పేద, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేసుల కట్టడికి వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, శానిటైజేషన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
మన దేశంలో రెండు వేల కేసులకే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కానీ దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్ చైనా దేశాల్లో వైరస్ విలయతాండవమాడుతోంది. దక్షిణ కొరియా, జర్మనీల్లో ఏకంగా 24 గంటల్లో లక్షకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఆస్ట్రేలియాలో 38వేల మంది వైరస్ బారిన పడగా, 21 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇక ఫ్రాన్స్, ఇటలీలో 25వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్‌లో 182 మంది, ఇటలీలో 127 మంది మృతి చెందారు. ఇక చైనాలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా మృతుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా 20వేల కేసులు నమోదవగా, అందులో లక్షనాలు ఉన్నవి 2వేల 761 కేసులు కాగా, మిగతావి లక్షణాలు లేని కేసులుగా బీజింగ్ వర్గాలు తెలిపాయి.
కరోనా ప్రమాదం ఇంకా అయిపోలేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ప్రతి నాలుగు నెలలకో వైరస్ పుట్టుకొస్తోందని ముందస్తు చర్యలు తీసుకోకపోతే ముప్పు తప్పదని చెబుతోంది. ప్రజలు తప్పనిసరి మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తోంది.