The Kerala Story: సుప్రీంకోర్టులో మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ
* సుప్రీంకోర్టు తీర్పుతో బెంగాల్ థియేటర్లలో ది కేరళ స్టోరీ ప్రదర్శనకు వీలు
The Kerala Story: ది కేరళ స్టోరీపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ సినిమాను నిషేధించవద్దని బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పశ్చిమ బెంగాల్ థియేటర్లలో ది కేరళ స్టోరీ ప్రదర్శనకు వీలు కలిగింది. సుప్రీంకోర్టు నిర్ణయం మమతా బెనర్జీకి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు. ది కేరళ స్టోరీని నిషేధించాలనుకుంటున్న మరికొన్ని రాష్ట్రాలకు కూడా శరాఘాతంగా మారింది.
కేరళ స్టోరీపై బెంగాల్ ప్రభుత్వ నిషేధాన్ని ప్రస్తావిస్తూ, కళ కాస్తంత రెచ్చగొట్టేదిగానే ఉంటుందని మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే అన్నారు. అదే సమయంలో.. శాంతి భద్రతలు కాపాడడం ప్రభుత్వ విధి అని కూడా చెప్పారు. శాంతి భద్రతలను సాకుగా చూపి సినిమాపై నిషేధం విధించడం సరి కాదన్నారు. ఒకసారి సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ తీసుకున్న తరువాత.. ఇక దానిపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోకూడదనే విధంగా గతంలో తీర్పులు ఉన్నాయని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సినిమా ప్రదర్శన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కల్పించాల్సిందిగా కూడా సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.