Corona Virus: దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు: సుప్రీం కోర్టు
Corona Virus: దేశంలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
Corona Virus: దేశంలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం నేషనల్ ఎమర్జెన్సీ తరహా దేశం పరిస్థితులను ఎదుర్కొంటోంది చెప్పింది. కరోనా మహమ్మారి నానాటికీ ఉద్ధృతమవుతున్న వేళ దేశంలో కరోనా నియంత్రణ, నిర్వహణ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. వైరస్ కట్టడికి జాతీయ ప్రణాళిక అవసరమన్న ధర్మాసనం.... దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
దేశంలో ఆక్సిజన్ సరఫరా, రోగులకు అవసరమైన ఔషధాలు, వ్యాక్సినేషన్ పంపిణీ వంటి అంశాలపై విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది. అలాగే, లాక్‌డౌన్ విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, లాక్‌డౌన్ పై నిర్ణయం తీసుకునే అధికారం న్యాయవ్యవస్థకు లేదని స్పష్టం చేసింది. రేపటి నుంచి కరోనా నియంత్రణపై విచారణ జరపనున్నట్లు తెలిపింది.
మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతపై ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. పరిస్థితి జాతీయ అత్యవసర స్థితిని తలపిస్తోందని చీఫ్ జస్టిస్ బోబ్డే అన్నారు. కొవిడ్ నియంత్రణపై ప్రస్తుతం ఆరు హైకోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయి. అయితే దీనివల్ల గందరగోళం ఏర్పడుతున్న నేపథ్యంలో తాము విచారణకు సిద్ధమైనట్లు ధర్మాసనం వెల్లడించింది.