Sanjay Raut: పరువు నష్టం కేసులో శివసేన UBT నేత సంజయ్‌రౌత్‌కు 15 రోజులు జైలు శిక్ష
Sanjay Raut: బీజేపీ నేత కిరీట్ సోమయ్య భార్య మేధ సోమయ్య దాఖలు చేసిన కేసులో శిక్ష విధించిన కోర్ట్
Sanjay Raut: పరువు నష్టం కేసులో శివసేన-యూబీటీ కీలక నేత సంజయ్‌రౌత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ నేత కిరీట్ సోమయ్య భార్య మేధ సోమయ్య దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఆయనకు 15 రోజులు జైలు శిక్ష విధిస్తూ ముంబయి కోర్టు తీర్పు వెలువరించింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ IPC సెక్షన్ 500 కింద రౌత్‌ను దోషిగా నిర్ధారించింది. ఆయనకు రూ.25 వేలు జరిమానాతో పాటు 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మహారాష్ట్ర బీజేపీ నేత కిరీట్ సోమయ్య కుటుంబసభ్యులు ఓ స్వచ్ఛందసంస్థను నడుపుతున్నారు.
మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.100 కోట్ల టాయిలెట్ స్కామ్ జరిగిందని శివసేన యూబీటీ నేత సంజయ్‌రౌత్ ఆరోపించారు. దీనిపై మేధ సోమయ్య కోర్టును ఆశ్రయించారు.తన పరువుకు నష్టం కలిగించినందుకు క్షమాపణలు చెప్పడంతోపాటు వ్యక్తిగతంగా తనకు భంగం కలిగించే కథనాలను ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్ ద్వారా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే మేధ సోమయ్య 2022 ఏప్రిల్‌లో సంజయ్ రౌత్‌పై పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ముంబై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.