ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ జన్ సురాజ్ అభియాన్… గాంధీ జయంతిన ప్రారంభం

Prashant Kishor New Political Party: ఈబీసీలు తమ జీవితాలను మార్చుకోవడానికి రిజర్వేషన్లు సహాయపడవని ప్రశాంత్ కిశోర్ చెప్పారు.

Update: 2024-07-29 10:23 GMT

ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ జన్ సురాజ్ అభియాన్… గాంధీ జయంతిన ప్రారంభం

Prashant Kishor New Political Party: ప్రశాంత్ కిశోర్ ఈ ఏడాది అక్టోబర్ 2న జన్ సురాజ్ అభియాన్ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. జూలై 28న పట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ మనమరాలు జాగృతి ఠాకూర్ కూడా పాల్గొన్నారు. ఎన్నికల వ్యూహాకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని భావిస్తున్నారు.


 జన్ సురాజ్ అభియాన్ లో కోటి మంది సభ్యులు...

జన్ సురాజ్ అభియాన్ పార్టీ ఏర్పాటుకు ముందుగానే ఎనిమిది ప్రాంతాల్లో రాష్ట్రస్థాయి సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో పార్టీ రాజ్యాంగం, విధి విధానాలను నిర్ణయిస్తారు. రాజకీయ పార్టీని ప్రకటించిన వెంటనే కోటి మంది సభ్యులు చేరేలా ఆయన ప్రణాళికలు సిద్దం చేశారు.కులాల వారీగా చీలిన బిహార్ ను ఏకం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టుగా ప్రశాంత్ కిశోర్ చెప్పారు.


జన్ సురాజ్ పాదయాత్ర… ఆ తరువాత పార్టీ

పశ్చిమ చంపారన్ జిల్లాలోని బితిహర్వా ఆశ్రమం నుంచి 2022 అక్టోబర్ 2న ప్రశాంత్ కిశోర్ పాదయాత్ర ప్రారంభించారు. బిహార్ లో మార్పు కోసం 'జన్ సురాజ్' క్యాంపెయిన్ పేరుతో పాదయాత్ర చేశారు. విద్య, ఆరోగ్యం, ఉపాధిపై అవగాహన కల్గించేందుకు అట్టడుగుస్థాయి ప్రజానీకం వరకూ ఈ ప్రచారాన్ని తీసుకెళ్లారు.ఆరుగురు రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు అజయ్ కుమార్ ద్వివేది, అజయ్ కుమార్ సింగ్, లల్లన్ యాదవ్, తులసి హజారీ, సురేష్ శర్మ, గోపాల్ నారాయణ్ సింగ్ లు పాదయాత్రలో పాల్గొన్నారు.

ఈబీసీలకు 75 శాతం టికెట్లు

బిహార్ అసెంబ్లీకి 2025 లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో 13 కోట్ల జనాభా ఉంది. ఇందులో 36 శాతం ఈబీసీలున్నారు. మరో వైపు ఓబీసీలతో కలుపుకుంటే ఈ జనాభా 63 శాతానికి చేరుతోంది. ఈ రెండు వర్గాల ఓట్లు రాష్ట్రంలో అధికారం దక్కించుకొనేందుకు దోహదం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఈ వర్గాలపై ఆయన ఫోకస్ పెట్టారు.

ఈబీసీలు తమ జీవితాలను మార్చుకోవడానికి రిజర్వేషన్లు సహాయపడవని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. ఈ వర్గానికి చెందిన 500 మంది పిల్లలకు తగిన ఉద్యోగాలు పొందేందుకు ప్రతి ఏటా ఉచిత కోచింగ్ సౌకర్యాలను జన్ సురాజ్ భరిస్తుందని ప్రకటించారు.


 గవర్నమెంటు స్కూల్ నుంచి యూఎన్ఓ దాకా…

ప్రశాంత్ కిశోర్ 1977లో బిహార్ లోని రోహ్ తక్ జిల్లాలోని కోరాన్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీకాంత్ పాండే డాక్టర్. స్థానిక ప్రభుత్వ స్కూల్లోనే ఆయన చదువుకున్నారు. ఆ తర్వాత పట్నా సైన్స్ కాలేజీలో చదివారు. ఉన్నత విద్య పూర్తైన తర్వాత ఎనిమిదేళ్ల పాటు ఐక్యరాజ్యసమితిలో హెల్త్ ఎక్స్ పర్ట్ గా పనిచేశారు.

మోదీకి ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా…

ప్రశాంత్ కిశోర్ 2011లో ఎన్నికల వ్యూహకర్తగా తన కెరీర్ ను ప్రారంభించారు. గుజరాత్ లో నరేంద్రమోదీకి మద్దతుగా ఎన్నికల క్యాంపెయిన్ ను ప్రారంభించారు. 2012లో మోదీ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ పేరుతో బీజేపీ కోసం పనిచేశారు.

చాయ్ పే చర్చ, త్రీడీ ర్యాలీలు, రన్ ఫర్ యూనిటీ వంటి కార్యక్రమాలతో సోషల్ మీడియా యూజర్లను మోదీ, బీజేపీ క్యాంపెయిన్ వైపు ఆకర్షించడంలో కీలకంగా వ్యవహరించారు. 2014లో కేంద్రంలో ఎన్ డీ ఏ ప్రభుత్వం ఏర్పాటైంది. మోదీ ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయన బీజేపీకి దూరమయ్యారు.

ఐ ప్యాక్ ఎలా పుట్టింది?

సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ సంస్థ పేరును 2015 లో ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటి అంటే ఐ- ప్యాక్ గా మార్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 2015లో ఐప్యాక్ నితీష్ కుమార్ పార్టీ జెడి(యు) కోసం పనిచేసింది. ఈ ఎన్నికల్లో జెడి(యు) అధికారంలోకి వచ్చింది. ప్రశాంత్ కిశోర్ ను నితీష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని 2016లో కాంగ్రెస్ కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది. అదే సమయంలో యూపీలో కాంగ్రెస్ తరపున ఆయన పనిచేశారు. 2017 లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.

2017లో వైఎస్ఆర్సీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ 151 అసెంబ్లీ సీట్లను గెలుచుకోవడంలో ఆయనదే కీలకభూమిక. 2020లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 62 సీట్లలో గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆప్ నకు ఆయన వ్యూహకర్తగా పనిచేశారు.

2020 ఫిబ్రవరి 3న డిఎంకెకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. 2021లో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డిఎంకె పార్టీ ఘన విజయం సాధించింది. 2021 లో టిఎంసికి వ్యూహకర్తగా పనిచేసి ఆ పార్టీ ఘన విజయానికి దోహదపడ్డారు. బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోనని ఆయన ప్రకటించారు.


 జెడి(యు) నేతగా రెండేళ్ళు…

నితీష్ కుమార్ పార్టీ జనతాదళ్ (యు)లో ఆయన ప్రశాంత కిశోర్ 2018 సెప్టెంబర్ 16 లో చేరారు. జెడి(యు) ఉపాధ్యక్ష పదవిలో కొనసాగారు. 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు జెడి(యు) మద్దతు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ప్రశాంత్ కిషోర్ తప్పుబట్టారు. పార్టీ నిర్ణయంపై బహిరంగంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిశోర్ కు పవన్ వర్మ అనే నాయకులు మద్దతుగా నిలిచారు. దీంతో 2020 జనవరి 29న జెడి(యు) నుంచి ప్రశాంత్ కిషోర్, పవన్ వర్మలను బహిష్కరించారు.

ఎన్నికల వ్యూహకర్తగా చాలా రాష్ట్రాల్లో, వివిధ రాజకీయ పార్టీలను గెలిపించిన ఘనత సొంతం చేసుకున్న ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు సొంత జెండాతో, అజెండాతో ముందుకు వస్తున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సొంతంగా పార్టీ పెట్టి ప్రజల ముందుకు నేరుగా వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ వ్యూహకర్త.. ఇప్పుడు పక్కా పొలిటికల్ లీడర్ గా కూడా రాణిస్తారా.? వెయిట్ అండ్ సీ!

Tags:    

Similar News