PM Modi: నేడు వాయనాడ్‌లో ప్రధాని మోదీ పర్యటన..బాధిత కుటుంబాలను పరామర్శించనున్న ప్రధాని
PM Modi:కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొండచరియలు విరిగినపడిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం బాధిత కుటుంబాలను కూడా పరామర్శించనున్నారు.
PM MODI Wayanad: కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని సమీక్షించనున్నారు. సహాయక శిబిరాలను సందర్శించడం, బాధిత ప్రజలను కలవడంతోపాటు ఆసుపత్రుల్లో ఉన్న క్షతగాత్రులు, బాధితుల కుటుంబాలను కూడా ఆయన కలుసుకుంటారు.ప్రధాని మోదీ ఉదయం 11 గంటలకు కన్నూర్ చేరుకుని, వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 12.15 గంటలకు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడ సహాయక బృందాలు నిర్వహిస్తున్న ఆపరేషన్ గురించి ఆయనకు తెలియజేస్తారు. కొండచరియలు విరిగిపడిన బాధితులను పరామర్శించే సహాయ శిబిరాలు, ఆసుపత్రులను కూడా ప్రధాని సందర్శించనున్నారు. ఆ తర్వాత మోడీ సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అందులో సంఘటన, కొనసాగుతున్న సహాయక చర్యల గురించి వివరంగా తెలియజేస్తారు.
కాగా వాయనాడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు, కేరళ ప్రభుత్వ క్యాబినెట్ సబ్‌కమిటీ ఆ ప్రాంతాన్ని సందర్శించిన కేంద్ర బృందంతో సమావేశమైంది విపత్తు దెబ్బతిన్న ప్రాంతంలో పునరావాసం, సహాయక చర్యల కోసం రూ. 2,000 కోట్ల సహాయం కోరింది.
హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రాజీవ్ కుమార్ నేతృత్వంలోని కేంద్ర బృందం విపత్తు ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించి, బాధిత ప్రజలతో సంభాషించింది. వాయనాడ్ కొండచరియల ప్రభావం భారీగా ఉందని, దీనిపై సమగ్ర అధ్యయనం అవసరమని అంతర్ మంత్రిత్వ శాఖ కేంద్ర బృందం తెలిపింది.
కేరళ క్యాబినెట్ సబ్‌కమిటీతో బృందం సమావేశమై వివిధ రెస్క్యూ ఆపరేషన్‌లు, రిలీఫ్ క్యాంపులు, శవపరీక్షలు, బంధువులకు మృతదేహాలను అప్పగించడం, అంత్యక్రియలు, DNA నమూనాల సేకరణ, తప్పిపోయిన వ్యక్తుల వివరాలపై చర్చించారు.
వాయనాడ్‌లోని చురలమల, ముండక్కై, పుంఛిరి మట్టం ప్రాంతాల్లో నివాస ప్రాంతాలు, వ్యవసాయ ప్రాంతాలు రెండింటికి పెద్ద నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి తెలియజేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. కేవలం పునరావాసం కోసం రూ.2000 కోట్లు అవసరమని ప్రకటనలో పేర్కొంది.
వాయనాడ్ కొండచరియలు విధ్వంసం చూసిన తర్వాత ప్రధాని మోదీ దానిని జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ X లో పోస్ట్ చేసారు, “భయకరమైన విషాదాన్ని వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి వయనాడ్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు మోదీ జీ. ఇది మంచి నిర్ణయం” అని అన్నారు.
"ప్రధాన మంత్రి విధ్వంసం స్థాయిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత, దానిని జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని నేను విశ్వసిస్తున్నాను" అని ఆయన అన్నారు. జూలై 30న కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో 226 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇంకా 100 మందికి పైగా గల్లంతయ్యారు.