TOP 6 News @ 6PM: అధికారులపై గీత పడినా పరిస్థితి వేరేలా ఉంటుంది.. పవన్ కళ్యాణ్ హెచ్చరికలు
1) అధికారులను టచ్ చేస్తే చూస్తూ ఊరుకోం - పవన్ కళ్యాణ్
గత ప్రభుత్వం 20 ఏళ్లు అధికారంలో ఉంటామని చెప్పి అధికారులను బెదిరించి, వారి చేత కూడా తప్పులు చేయించారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పుడు అధికారులు బాధ్యతతో తమ విధులు నిర్వర్తిస్తున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా మీరు ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులను బెదిరించాలని చూస్తే ఎవరూ బెదిరిపోరు అని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. ఒకవేళ అధికారులకు ఏదైనా హాని కలిగించాలని చూస్తే వారికి చిన్న గీత పడినా చూస్తూ ఊరుకోం అని తేల్చిచెప్పారు. అంతేకాదు.. అధికారులను బెదిరించే వారిపై సుమొటోగా కేసులు పెట్టాల్సి వస్తుందని సదరు నాయకులను పవన్ హెచ్చరించారు. గుంటూరులో ఆదివారం నిర్వహించిన అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలకు భద్రత కల్పించే అంశంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ షర్మిల కోరితే ప్రభుత్వం వైపు నుండి ఆమె భద్రతను అందిస్తామని ఆయన స్పష్టంచేశారు.
2) అమరావతి అభివృద్ధి ప్రతిపాదనలను కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలకమైన ముందడుగు పడింది. అమరావతి అభివృద్ధిలో భాగంగా ఏపీ సీఆర్డిఏ పంపించిన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇవే ప్రతిపాదనలను పరిశీలించిన వరల్డ్ బ్యాంక్, ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్ కూడా ఆమోదించాయి. దీంతో ఆ రెండు సంస్థలు రాజధాని మౌలిక వసతుల కల్పన కోసం చెరో 800 మిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసేందుకు ముందుకొచ్చాయని ఏపీ సర్కారు తెలిపింది. వరల్్ బ్యాంక్, ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్ అందించనున్న రూ. 15వేల కోట్ల రుణం అమరావతి అభివృద్ధి కోసం వినియోగించనున్నట్లు ఏపీ సర్కారు స్పష్టంచేసింది. ఈ క్రమంలో అవసరమయ్యే మిగతా నిధులను కేంద్రం సహాయంతో రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోనున్నట్లు ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది.
3) TGPSC గ్రూప్ 3 హాల్ టికెట్స్ డైరెక్ట్ లింక్
TGSPSC Group 3 Hall Ticket 2024: టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి. ఈ పరీక్షను సక్రమంగా నిర్వహించేందుకు ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. తెలంగాణ గ్రూప్ 3 పరీక్షలు నవంబర్ 17,18 తేదీల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఏర్పాట్లు కూడా పూర్తి చేసే పనిలో ఉంది. పరీక్ష తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
4) కురుమూర్తి దయతో సీఎం అయ్యాను.. ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా చింతకుంట మండలం అమ్మాపూర్ లో కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, కురుమూర్తి స్వామి దయవల్లే ఈ పాలమూరు గడ్డపై పుట్టిన బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందన్నారు. కురుమూర్తి స్వామి దేవాలయం అంటే పేదల తిరుపతిగా పేరుందని అన్నారు. అమ్మాపూర్ వచ్చి కురుమూర్తిని దర్శనం చేసుకుంటే తిరుపతి వెంకన్నను దర్శనం చేసుకోవడంతో సమానం అని భక్తుల నమ్మకం అని గుర్తుచేశారు.
పాలమూరు గడ్డ అభివృద్ధిని కొంతమంది అడ్డుకోవాలని చూస్తున్నారు. కానీ ఇదే పాలమూరు గడ్డ ప్రజలు రెండుసార్లు ఓటేస్తే సీఎం అయిన కేసీఆర్ ఈ గడ్డకు ఏమీ చేయలేదన్నారు. 1 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక ముఖ్యమంత్రిని ఇచ్చిన ఈ పాలమూరు గడ్డను అభివృద్ధి చేయకపోతే జనం క్షమించరు అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతానని ఆయన మరోసారి ధీమా వ్యక్తంచేశారు.
5) కెనడా హై కమిషనర్ ఆఫీస్ ఎదుట భారత సిక్కుల ధర్నా
కెనడాలో ఖలిస్తానీ ఉద్యమం పేరుతో కొంతమంది సిక్కులు అక్కడి హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడుతుండటాన్ని భారత్‌లో ఉన్న సిక్కులు ఖండించారు. ఆదివారం ఢిల్లీలోని కెనడా హై కమిషనర్ ఆఫీస్ ఎదుట హిందూ సిక్ గ్లోబల్ ఫోరం అనే సిక్కు సంస్థ ప్రతినిధులు ఆందోళనకు దిగారు. వందల సంఖ్యలో సిక్కులు రోడ్లపైకి ఈ ధర్నాలో పాల్గొన్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఢిల్లీలో కెనడా హై కమిషనర్ ఆఫీస్ ఎదుట సిక్కు ఆందోళనకారుల ధర్నాతో చాణక్యపురి నుండి తీన్ మూర్తి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
హిందూ సిక్ గ్లోబల్ ఫోరం అధ్యక్షుడు తార్విందర్ సింగ్ మార్వ మీడియాతో మాట్లాడారు. ఒక నిజమైన సిక్కు ఎన్నటికీ ఖలిస్తానీ కాలేడని అన్నారు. ఇండియాలో ఉన్న సిక్కులు ఎప్పటికీ భారత్ వెంటే ఉంటారని, వారు దేశానికి ద్రోహం చేయరని ఆయన స్పష్టంచేశారు. కెనడాలో ఖలిస్తానీలు హిందూ దేవాలయాలపై చేస్తోన్న దాడులను భారతీయ సిక్కు సమాజం ముక్త కంఠంతో ఖండిస్తోందని తార్విందర్ తేల్చిచెప్పారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) తాజా ఫలితాలతో మొ త్తం 7 స్వింగ్ స్టేట్స్ క్లీన్ స్వీప్ చేసిన డోనల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ మొత్తం 7 స్వింగ్ స్టేట్స్ క్లీన్ స్వీప్ చేశారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అప్పటి డెమొక్రటిక్ అభ్యర్థిగా నిలిచిన జో బైడెన్ ఆరిజోనా మొత్తాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. కానీ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆ ఫలితాన్ని తారుమారుచేసి మరోసారి ఆరిజోనా తన వైపు తిప్పుకోవడంలో డోనల్డ్ ట్రంప్ సక్సెస్ అయ్యారు. ఆరిజోనా రాష్ట్రం నుండి 11 మంది ఎలక్టార్స్ ఉంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజ్ దశలో అభ్యర్థులకు అత్యధిక ఓట్లను అందించే రాష్ట్రాల్లో ఇది కూడా ఒకటి. అలా రిపబ్లికన్ పార్టీ నుండి బరిలో దిగిన 11 మందిని గెలిపించుకోవడం ద్వారా డోనల్డ్ ట్రంప్ మొత్తం మద్దతు 312 కు పెరిగింది. మరోవైపు డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు లభించిన మద్దతు 226 గా మాత్రమే ఉంది.
జో బైడెన్ గత ఎన్నికల్లో ఆరిజోనాను గెలుచుకున్న తరువాత ఇక్కడ డెమొక్రాట్స్‌కి భారీ మద్దతు కనిపించింది. కానీ ఈ ఎన్నికల ఫలితాలు మాత్రం ఆ ట్రెండ్‌ని రివర్స్ ట్రెండ్ చేశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా ఉండే ఏడు రాష్ట్రాల్లో జార్జియా, మిచిగాన్, నెవడా, పెన్సిల్వేనియా, విస్ కన్సిన్, నార్త్ కరోలినా, ఆరిజోనా ఉన్నాయి. ఈ అన్ని రాష్ట్రాల్లోని ఓటర్లు 2020 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్‌ను ఆదరించలేదు. కానీ ఓడిన చోటే గెలిచారన్న చందంగా డోనల్డ్ ట్రంప్ ఈసారి ఆ ఏడు రాష్ట్రాలను క్లీన్ స్వీప్ చేసి అక్కడి ఓటర్లను డెమొక్రాట్స్ నుండి రిపబ్లికన్స్ వైపు తిప్పుకోగలిగారు.