ఇకపై టూవీలర్‌తో పాటు 2 హెల్మెట్స్.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరి సంచలన నిర్ణయం

ఇకపై బైక్‌తో పాటు 2 హెల్మెట్స్.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరి సంచలన నిర్ణయం
Nitin Gadkari about two helmets mandatory rule: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి టూవీలర్స్ ఉపయోగించే వారి భద్రత కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎవరైనా ద్విచక్రవాహనం కొనుగోలు చేస్తే వారికి ఆ వాహనంతో పాటు కచ్చితంగా ఐఎస్ఐ ముద్ర ఉన్న 2 హెల్మెట్స్ అమ్మాల్సిందేనని ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఆటోఎక్స్‌పోలో గడ్కరి ఈ ప్రకటన చేశారు.
ఇప్పటికే ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ఇద్దరు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనే నిబంధన ( Helmet mandatory for Pillion rider ) ఉంది. ఆ నిబంధన పాటించని వారికి ట్రాఫిక్ పోలీసులు ఛలాన్లు కూడా విధిస్తున్నారు. అయితే, టూవీలర్ కొనే సందర్భంలో మాత్రం రెండు హెల్మెట్స్ తప్పనిసరిగా విక్రయించాల్సిందే అనే నిబంధన లేదు. ప్రస్తుతం టూవీలర్ కొనేటప్పుడు రైడర్ సేఫ్టీ కోసం ఒక హెల్మెట్ తప్పనిసరి అనే నిబంధన అమలవుతోంది.
అనేక రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులు తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి పరిస్థితిని నివారించడానికి కేంద్రమంత్రి గడ్కరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కేంద్రమంత్రి నిర్ణయాన్ని టూవీలర్ హెల్మెట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (THMA) స్వాగతించింది. ఇది ఒక నిబంధన మాత్రమే కాదని, ద్విచక్రవాహనదారుల భద్రత కోసం తీసుకోవాల్సిన అత్యవసరమైన చర్యగా టూవీలర్ హెల్మెట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది.
అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ కపూర్ స్పందిస్తూ ఇప్పటికే ఇలాంటి భద్రత చర్యలు పాటించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది తమ ఆత్మీయులను, అయినవారిని కోల్పోయారని అన్నారు. కేంద్రమంత్రి ప్రకటించిన ఈ నిబంధన ఆ దుస్థితిని దూరం చేస్తుందని రాజీవ్ చెప్పారు. కేంద్రమంత్రి చెప్పినట్లుగా దేశంలో ద్విచక్రవాహనాల విక్రయాలు, వినియోగారుల అవసరాలకు అనుగుణంగా ఐఎస్ఐ హెల్మెట్స్ ఉత్పత్తిని కూడా పెంచి భారీ సంఖ్యలో హెల్మెట్స్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
2 హెల్మెట్స్ ఎందుకు తప్పనిసరి అంటే...
ఇండియాలో ప్రతీ సంవత్సరం సగటున 4,80,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆయా ప్రమాదాల కారణంగా 1,80,000 మంది చనిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మృతుల్లో 66 శాతం మంది 18 ఏళ్ల నుండి 45 ఏళ్ల వయస్సులోపు వారే ఉన్నారు. ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్యే 69,000 వరకు ఉంది. అందులో 50 శాతం మంది హెల్మెట్స్ లేని కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ నివేదికలను విశ్లేషిస్తే... హెల్మెట్స్ ధరించకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్య ప్రతీ సంవత్సరం 30 వేలకు పైనే ఉందని అర్థం అవుతోంది.