Nayab singh Saini Cabinet: హర్యానా కొత్త కేబినెట్‌లో ఇద్దరు మహిళలు.. ఒకరు ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే

Update: 2024-10-17 13:59 GMT

Nayab singh Saini Cabinet: హర్యానాలో బీజేపి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న నాయబ్ సింగ్ షైనీనే మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 13 మంది మంత్రులతో హర్యానా కొత్త కేబినెట్ ఏర్పడింది. హర్యానా కొత్త కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు అవకాశం లభించింది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ షైనీతో అలాగే 13 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. పంచ్‌కులాలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు హాజరయ్యారు. ఎన్డీఏ మిత్రపక్షాల్లో ఒకరైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా నాయబ్ సింగ్ షైనీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు.

నాయబ్ సింగ్ షైనీ హర్యానాలోని అన్ని సామాజిక వర్గాలను కవర్ చేస్తూ కొత్త కేబినెట్‌ని రూపొందించారు.

1) అనిల్ విజ్- అంబాలా కాంటోన్మెంట్ నియోజకవర్గం నుండి గెలిచారు. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడిన వారిలో అనిల్ విజ్ కూడా ఒకరు. ఈయన పంజాబీ-ఖాత్రీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే.

2) క్రిషన్ లాల్ పన్వార్ - పానిపట్ జిల్లాలోని ఇస్రానా నుండి గెలిచిన షెడ్యూల్డ్ కులాల ఎమ్మెల్యే.

3) రావ్ నర్బీర్ సింగ్ - గురుగ్రామ్ జిల్లాలోని బాద్షాపూర్ నుండి విజయం సాధించారు. ఈయన అహిర్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే (బీసీ).

4) మహిపాల్ ధండా - పానిపట్ రూరల్ నియోజకవర్గం నుండి గెలిచిన జాట్ ఎమ్మెల్యే.

5) విపుల్ గోయెల్ - ఫరీదాబాద్ నుండి గెలిచిన వైష్ కమ్యూనిటీ ఎమ్మెల్యే.

6) అరవింద్ కుమార్ శర్మ - సోనిపట్‌లోని గోహనా నుండి విజయం సాధించిన బ్రాహ్మణ ఎమ్మెల్యే

7) రణబీర్ గాంగ్వా - హిస్సార్ జిల్లాలోని బర్వాలా నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. గాంగ్వాకు బీసీ ఏ వర్గానికి చెందిన నేతగా పేరుంది.

8) క్రిషన్ బేడీ - జింద్‌లోని నర్వానా నుండి షెడ్యూల్డ్ కులాల (బాల్మీకి) ఎమ్మెల్యే

9) శ్యామ్ సింగ్ రాణా - రాదౌర్ బీజేపీ ఎమ్మెల్యే

10) ఆర్తి సింగ్ రావు - మహేందర్‌గఢ్ జిల్లాలోని అటెలి నుండి విజయం సాధించారు. ఈమె అసెంబ్లీలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. మొదటిసారే మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఆర్తి సింగ్ రావు నేపథ్యం విషయానికొస్తే.. ఈమె వెనుకబడిన తరగతిలో అహిర్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే.

11) భివానీ జిల్లాలోని తోషమ్‌ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తోన్న శృతి చౌదరికి కూడా కేబినెట్లో అవకాశం దక్కింది. ఈమె జాట్ వర్గానికి చెందిన వారు.

12) రాజేష్ నగర్ - ఫరీదాబాద్ జిల్లాలోని తిగావ్ నుండి గెలిచిన గుజ్జర్ కమ్యూనిటీ ఎమ్మెల్యే(బీసీ)

13) గౌరవ్ గౌతమ్, పల్వల్ నుండి విజయం సాధించిన ఎమ్మెల్యే

Tags:    

Similar News