Manish Sisodia: నా కుమారుడి కాలేజ్ ఫీజు కోసం అడుక్కోవాల్సి వచ్చిందన్న మాజీ డిప్యూటీ సీఎం

Update: 2024-09-22 09:56 GMT

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో జైలుకి వెళ్లి, ఇటీవలే బెయిల్‌పై విడుదలైన ఆప్ అగ్రనేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆ తరువాత తనకు ఎదురైన చేదు అనుభవాలను ఒక్కొక్కటిగా మీడియా ముందు వెల్లడించారు. తనని ఆప్ కన్వినర్ అయిన అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా మార్చేందుకు చాలా కుట్రలు జరిగాయన్నారు. అరవింద్ కేజ్రీవాల్ మీ పేరు చెప్పి ఇరికించారని, మీరు కూడా కేజ్రీవాల్ పేరు చెప్పాలని బలవంతం చేశారు. అలాంటి టెక్నిక్స్ ఉపయోగించి మా ఇద్దరి మధ్య వైరం పెంచడంతో పాటు నన్ను కేజ్రీవాల్‌కి వ్యతిరేక సాక్ష్యంగా మార్చేందుకు కుట్ర చేశారన్నారు. ఈ కేసులో కేజ్రీవాల్‌కి వ్యతిరేక వాంగ్మూలం ఇస్తే, మిమ్మల్ని వదిలేస్తాం అని నమ్మించేందుకు ప్లాన్ చేశారని మనీష్ సిసోడియా తెలిపారు. జనతా కా అదాలత్ పేరుతో తాజాగా జరిగిన పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో మనీష్ సిసోడియా ఈ వ్యాఖ్యలు చేశారు. 

అరెస్ట్ అయిన తరువాత ఎదురైన ఆర్థిక ఇబ్బందులు

తాను అరెస్ట్ అయిన తరువాత ఎదురైన ఆర్ధిక ఇబ్బందుల గురించి కూడా మనీష్ సిసోడియా గుర్తుచేసుకున్నారు. 2002 లో తాను జర్నలిస్టుగా ఉన్నప్పుడు రూ. 5 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. అది లాగేసుకున్నారు. అలాగే నా బ్యాంక్ ఎకౌంట్లో రూ. 10 లక్షలు ఉంటే ఆ మొత్తాన్ని కూడా స్తంభింపజేశారు. అదే సమయంలో తన కుమారుడి కాలేజ్ ఫీజు చెల్లించడం కోసం తాను వాళ్లను, వీళ్లను అడుక్కోవాల్సి వచ్చింది. అలా మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టారు అని మనీష్ సిసోడియా తెలిపారు.

ఇదిలావుంటే, మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ సైతం గతంలో మీడియాతో మాట్లాడుతూ ఇదేరకమైన వ్యాఖ్యలు చేశారు. మనీష్ సిసోడియా తప్పు చేశారని తాను చెప్పినట్లుగా వార్తలొచ్చాయి. కానీ తాను ఎవ్వరికీ వ్యతిరేకంగా ఏదీ చెప్పలేదు. మనీష్ సిసోడియా, తాను, ఆమ్ ఆద్మీ పార్టీ ఏ తప్పూ చేయలేదని చెప్పాను అని అరవింద్ కేజ్రీవాల్ గుర్తుచేసుకున్నారు.

Tags:    

Similar News