Kolkata rape-murder case: కోల్‌కతా డాక్టర్ కేసులో విచారణ ప్రత్యక్ష ప్రసారం నిలిపేయాల్సిందిగా కోరిన కపిల్ సిబల్

Update: 2024-09-17 07:02 GMT

Kolkata Rape-murder Case Live Streaming: కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసు దర్యాప్తును సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు నేడు మరోసారి ఆ ఘటనపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సుమోటోగా తీసుకున్న కేసు కావడంతో కేసు విచారణను సుప్రీం కోర్టు లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. అయితే, ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని నిలిపేయాల్సిందిగా పశ్చిమ బెంగాల్ సర్కార్ తరపున వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్ కపిల్ సిబల్ కోర్టును కోరారు. ఈ కేసులో వాదనలు వినిపిస్తున్న తమ న్యాయవాదులపై యాసిడ్ దాడులు చేస్తామని, మహిళా న్యాయవాదులపై అత్యాచారం చేస్తామని బెదిరింపులు వస్తున్నాయని కపిల్ సిబల్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందువల్లే తమ న్యాయవాదుల ఐడెంటిటీని బహిర్గతం చేస్తోన్న ఈ కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపేయాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు.

అయితే, కపిల్ సిబల్ విజ్ఞప్తిపై స్పందించిన సుప్రీం కోర్టు.. కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపేయడం కుదరదు అని స్పష్టంచేసింది. ఇది ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న కేసు కావడం వల్లే తాము మీ విజ్ఞప్తిని తోసిపుచ్చుతున్నామని కోర్టు స్పష్టంచేసింది. ఒకవేళ న్యాయవాదులకు అలాంటి బెదిరింపులు వస్తే, తాము ఆ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తామని వారికి కోర్టు భరోసా ఇచ్చింది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జేబి పరిడ్వాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ చేపడుతోంది. 

Tags:    

Similar News