Nipah Virus: నిఫా వైరస్‌తో మరో యువకుడి మృతి, మాస్కులు తప్పనిసరి, విద్యాసంస్థలకు సెలవులు

Update: 2024-09-16 11:11 GMT

Nipah Virus Cases in Kerala: కేరళను మరోసారి నిఫా వైరస్ వణికిస్తోంది. తాజాగా మలప్పురం జిల్లాలో ఒక 23 ఏళ్ల యువకుడు నిఫా వైరస్‌తో మృతి చెందారు. జులై నుండి కేరళలో నిఫా వైరస్ కారణంగా చోటుచేసుకున్న రెండో మరణం ఇది. దీంతో ఆ యువకుడి స్వగ్రామమైన తిరువలి గ్రామ పంచాయత్‌తో పాటు ఆ పక్కనే ఉన్న మాంపత్ గామ పంచాయతీలో అధికారులు కఠిన నిబంధనలు విధించారు. నిఫా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే మాస్కులు తప్పనిసరి చేయడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడటం వంటివి చేయకూడదు అని ఆదేశాలు జారీచేశారు.

వైరస్ వ్యాపించకుండా ఆంక్షలు

మెడికల్ స్టోర్స్ మినహాయించి మరే ఇతర వ్యాపారాలైనా కేవలం ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల మధ్య మాత్రమే నడిచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తాత్కాలికంగా సినిమా థియేటర్లను మూసేశారు. స్కూల్స్, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఫంక్షన్స్, వెడ్డింగ్స్ లాంటి పబ్లిక్ ఈవెంట్స్ నిర్వహించాల్సి వస్తే.. అందుకు అనుమతి తీసుకోవడంతోపాటు తక్కువ మంది అతిథులు, సోషల్ డిస్టన్సింగ్ తప్పనిసరి చేశారు. జ్వరం లక్షణాలు కనిపిస్తే ఎప్పటి తరహాలో సొంత వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు.

పండ్లు, కూరగాయలు తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పండ్లు, కూరగాయలు తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని కేరళ ఆరోగ్య శాఖ సూచించింది. వాటిని శుభ్రంగా కడిగిన తరువాత మాత్రమే వాటిని ఉపయోగించాలి. అంతేకాకుండా చెట్టు నుండి రాలిపడిన వాటిని, జంతువులు, పక్షులు కొరికేసినవి తినకూడదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జంతువులు, గబ్బిలాల నుండి ఈ వైరస్ సోకుతుండటమే అందుకు ఒక కారణం.

బెంగళూరు నుండి వచ్చిన యువకుడి మృతి

బెంగళూరు నుండి స్వగ్రామానికి వచ్చిన యువకుడు సెప్టెంబర్ 9న నిఫా లక్షణాలతో మృతి చెందారు. అతడి శాంపిల్స్ ని కొయికోడ్ మెడికల్ కాలేజ్ ల్యాబోరేటరి, పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించాం. వైరాలజీ ఇనిస్టిట్యూట్ రిపోర్ట్ ప్రకారం అతడు నిఫాతో చనిపోయినట్లుగా నిర్ధారణ అయింది. అందుకే నిఫా వైరస్ మరింత వ్యాపించకుండా ఈ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లుగా కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

నిఫా వైరస్ అంటే ఎందుకంత భయం

2018 నుండి ఇప్పటివరకు ఈ నిఫా వైరస్ కారణంగా మొత్తం 22 మంది చనిపోయారు. నిఫా వైరస్ అంటే అంత భయానకమైన పరిస్థితి ఎందుకు నెలకొందంటే.. ఇప్పటివరకు ఈ వైరస్ సోకిన వారిలో కేవలం ఆరుగురు మాత్రమే బతికి బట్టకట్టారు. సంఖ్యాపరంగా నిఫా వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య తక్కువగానే కనిపిస్తున్నప్పటికీ, వైరస్ సోకిన వారిలో బతికిన వారి సంఖ్య కూడా తక్కువ కావడమే ఈ వైరస్ తీవ్రత ఏంటో చెబుతోంది.

Tags:    

Similar News