Vice Presidential Election: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఊహించని పేరు..
Vice Presidential Election: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఊహించని పేరును ప్రకటించారు.
Vice Presidential Election: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఊహించని పేరును ప్రకటించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున ఎవరిని బరిలోకి దింపుతారన్న ఉత్కంఠకు తెరపడింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న జగదీప్ ధన్‌కర్ పేరును ఎన్డీయే ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం అభ్యర్థి పేరును ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేర్లలో జగదీప్ ధన్‌కర్ పేరు ఎక్కడా ప్రస్తావన రానప్పటికీ అనూహ్యంగా ఆయన పేరును బీజేపీ ప్రకటించడం గమనార్హం.
అంతకుముందు ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడినే మరోసారి కొనసాగిస్తారని వార్తలు వచ్చాయి. ఆయనతో పాటు కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌లలో ఒకరికి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. వీరెవరినీ కాకుండా జగదీప్ పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేయడం కొసమెరుపు. ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు మంగళవారంతో ముగియనుంది. అదే రోజు ఎన్డీయే అభ్యర్థి నామినేషన్ వేస్తారని తెలుస్తోంది.