పూరీ రత్నభాండాగారంలో రహస్య సొరంగం ఉందా? అధికారులు, చరిత్రకారులు ఏం చెబుతున్నారు?

పూరీ జగన్నాథ ఆలయం ట్రెజరీ లోపలి గదిలో సొరంగ మార్గం ఉందని ప్రముఖ చరిత్రకారులు నరేంద్రకుమార్ మిశ్రా ఇటీవల మీడియాతో చెప్పారు.

Update: 2024-07-19 09:09 GMT

పూరీ రత్నభాండాగారంలో రహస్య సొరంగం ఉందా? అధికారులు, చరిత్రకారులు ఏం చెబుతున్నారు?

పూరీ జగన్నాథ ఆలయం రత్న భాండాగారం రెండో గదిలో రహస్య సొరంగం ఉందా? రత్నభండార్ గదుల తలుపులు తెరిసిన తరువాత అందులో ఒక రహస్య సొరంగం ఉందనే కథనాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఆ సొరంగం మరో రహస్య గదికి దారి తీస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి.

నిజంగానే, రత్నభాండాగారంలో రహస్య సొరంగ మార్గం, మరో రహస్య గది ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ గదులను లేజర్ స్కాన్ చేయడానికి పురావస్తు శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. రత్నాభాండారం లోపలి గదిని అధికారులు జూలై 18న శుక్రవారం నాడు తెరిచారు. అందులో ఉన్న సంపదను వేరే స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు.


 ‘పూరీ టెంపుల్‌లో రహస్య గది ఉంది’ - నరేంద్రకుమార్ మిశ్రా

పూరీ జగన్నాథ ఆలయం ట్రెజరీ లోపలి గదిలో సొరంగ మార్గం ఉందని ప్రముఖ చరిత్రకారులు నరేంద్రకుమార్ మిశ్రా ఇటీవల మీడియాతో చెప్పారు. 'తూర్పు, దక్షిణ ప్రాంతాలపై రాజా కపిలేంద్రదేవ్ దండెత్తి విలువైన సంపదను జగన్నాథునికి సమర్పించినట్టుగా ఆధారాలున్నాయని ఆయన అన్నారు. రత్నభాండాగారం దిగువన సొరంగమార్గం తవ్వి ఆభరణాలు భద్రపర్చేందుకు రహస్య గదిని నిర్మించారని, అందులో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, వడ్డాణాలు, దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయని కూడా ఆయన వివరించారు.

మరో చరిత్రకారులు డాక్టర్ నరేశ్ చంద్రదాస్ కూడా ఈ వాదనను సమర్థిస్తున్నారు. బ్రిటిష్ పాలకులు ఈ సొరంగ మార్గాన్ని కనిపెట్టేందుకు 1902లో ప్రయత్నించారని ఆయన అన్నారు. ఈ సొరంగం లోపలికి ఓ వ్యక్తిని పంపితే అతని ఆచూకీ లభ్యం కాలేదని ఆయన చెప్పుకొచ్చారు. అలా అప్పట్లో రహస్య గది అన్వేషణ ప్రయత్నాలు ఆగిపోయాయని అన్నారు. ఆయన చెప్పినట్లు ఆ రహస్య గదిని గుర్తించాలంటే అక్కడికి దారి తీసే సొరంగాన్ని ముందుగా కనిపెట్టాలి.


 రత్న భాండాగారంలో రహస్య సొరంగం ఉందా?

ఈ ఆలయం రత్న భాండాగారంలో రెండు గదులున్నాయి. ఈ గదులను లోపలి గది, బయటి గది అని పిలుస్తున్నారు. బయటి గదిని అధికారులు ఈ నెల 14న తెరిచారు. నాలుగు రోజుల తర్వాత అంటే ఈ నెల 18న లోపలి గదిని తెరిచారు. ఈ గదిలో సొరంగం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇది నిజమో కాదో తెలుసుకునేందుకు ఆర్కియాలజీ శాఖ అధికారులు అధునాత లేజర్ స్కానింగ్ ఉపయోగిస్తారని పూరీ ఆలయ మేనేజింగ్ కమిటి చైర్మన్, గజపతి రాజవంశానికి చెందిన దివ్య సింగ్ దేవ్ చెప్పారు. ఖజానా లోపలి గదిలో విలువైన వస్తువులను తనిఖీ చేయడానికి వెళ్లిన 11 మంది సభ్యుల కమిటీలో దివ్య సింగ్ కూడా ఉన్నారు. ఈ రెండు గదులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మరమ్మతుల కోసం పురావస్తు శాఖకు ఈ రెండు గదులను అప్పగించనున్నారు.


 సొరంగం ఉందనేందుకు ఆధారాలున్నాయా?

పూరీ ఆలయం ఖజానా రెండో గదిలో సీక్రెట్ టన్నెల్ ఉందనేందుకు ఆధారాలు లేవని ఓ వర్గం వాదిస్తోంది. మరో వర్గం కచ్చితంగా సొరంగం ఉందని నమ్ముతున్నారు. ఏడు గంటలకు పైగా రెండో గదిలో ఉన్న తమకు సొరంగ మార్గం ఉన్నట్టుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ బిశ్వనాథ్ రథ్ చెప్పారు. గది గోడలను పరిశీలించినా కూడా తమకు సొరంగం ఉన్నట్టుగా కన్పించలేదని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము పనిచేస్తామన్నారు.


పూరీ జగన్నాథ ఆలయం ఖజానా గోడకు పగుళ్లు

పూరీ జగన్నాథ ఆలయం ట్రెజరీ గదిలో పైకప్పు నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి. గోడలకు పగుళ్లు ఉన్నాయని దుర్గ దాస్మోపాత్ర చెప్పారు.

ఏమైనా, 48 ఏళ్ల తర్వాత తెరుచుకున్న ఆలయ ఖజానా నుంచి తీసిన సంపదను ఇప్పుడు లెక్కించాల్సి ఉంది. అదే సమయంలో, ఈ రహస్య సొరంగ మార్గం గురించి నిజానిజాలు కూడా తేల్చాల్సి ఉంది.

Tags:    

Similar News