Delhi Assembly Elections 2025 Results: ఢిల్లీలో బీజేపి ఎలా గెలిచింది?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపి తెలివిగా దెబ్బ కొట్టిందా? సామాన్యుల పార్టీ అని చెప్పుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ చివరకు సామాన్యులకే ఎలా దూరమైంది? ఆరంభంలో క్లీన్ ఇమేజ్ ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌కు ఆ తరువాత అవినీతి మరకలు ఎలా అంటుకున్నాయి?
Delhi Assembly Elections 2025 Results: ఢిల్లీలో బీజేపి ఎలా గెలిచింది?
How BJP got big victory In Delhi Assembly elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపి తెలివిగా దెబ్బ కొట్టిందా? సామాన్యుల పార్టీ అని చెప్పుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ చివరకు సామాన్యులకే ఎలా దూరమైంది? ఆరంభంలో క్లీన్ ఇమేజ్ ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌కు ఆ తరువాత అవినీతి మరకలు ఎలా అంటుకున్నాయి? బీజేపి ఏ స్ట్రాటెజీతో గెలిచింది? ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఓడిందనేదే నేటి ట్రెండింగ్ స్టోరీ.
అర్వింద్ కేజ్రీవాల్... రాజకీయాల్లో అవినీతికి వ్యతిరేకంగా సామాన్యుల గళం వినిపిస్తానని ఐఆర్ఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన వ్యక్తి. సమాజంలో, రాజకీయాల్లో అవినీతిని చీపురుతో ఉడిచేస్తానని ఆమ్ ఆద్మీ పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే మూడుసార్లు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఢిల్లీ ఓటర్లకు అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రత్యామ్నాయంగా కనిపించారు. అలా రాజకీయాల్లోకి వచ్చి రెండుసార్లు సీఎం అయ్యారు. దేశ రాజధానిలో బీజేపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగారు.
నిజాయితీపరుడు, సామాన్యుడు అనే ఇమేజ్‌తో రాజకీయాల్లోకి వచ్చిన మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్ కావడంతో మొదటిసారి వచ్చీరావడంతోనే విద్యాశాఖ, ఆరోగ్య శాఖపై ఫోకస్ చేశారు. సామాన్యుల మెప్పు పొందేలా ప్రభుత్వ పాఠశాలలను డెవలప్ చేశారు. మురికివాడల్లోనూ పార్కులు, ఓపెన్ జిమ్‌లు పెట్టి సామాన్యులను సంతోషపెట్టారు. ఢిల్లీలో మౌళిక వసతులు పెంచేందుకు కేజ్రీవాల్ చేసిన ప్రయత్నం, ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లాంటి ఉచితాలు ఆయన రెండోసారి అధికారంలోకి రావడానికి సాయపడ్డాయి.
రెండోసారి సీఎం అయ్యాకే సీన్ రివర్స్
అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి సీఎం అయ్యాక ఆయన ఇమేజ్ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. అలా జరగడంలో కొన్ని కేజ్రీవాల్ చేసుకున్న సెల్ఫ్ గోల్స్ ఉన్నాయి. ఇంకొన్ని ఢిల్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపి సాధిస్తూ వచ్చిన గోల్స్ ఉన్నాయి. రెండోసారి అధికారంలోకొచ్చాక అరవింద్ కేజ్రీవాల్‌పై, ఆయన సహచర మంత్రులపై అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌తో సౌత్ బ్లాక్‌కు చెందిన కొంతమంది పొలిటీషియన్స్‌కు, వ్యాపారవేత్తలకు మేలు చేశారన్నది ఆప్ సర్కారుపై వచ్చిన ప్రధాన ఆరోపణ. అందుకోసం ఢిల్లీ సర్కారుకు 100 కోట్ల రూపాయలు ముడుపులు కూడా ముట్టినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ కేసులోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయి విచారణ ఖైదీగా తీహార్ జైలుకు కూడా వెళ్లొచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సమాంతరంగా అరవింద్ కేజ్రీవాల్ లైఫ్ స్టైల్‌పై బీజేపి విమర్శల దాడి చేయడం మొదలుపెట్టింది. కేజ్రీవాల్ ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్, లగ్జరీ లైఫ్ స్టైల్ ఉట్టిపడేలా ఉన్న ఇంటీరియర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంకేం... బీజేపికి ఇంకో అస్త్రం దొరికింది. సామాన్యులకు ప్రతినిధిని అని చెప్పుకునే అరవింద్ కేజ్రీవాల్ జీవితం ఎంత విలాసవంతంగా ఉందో చూడండంటూ బీజేపి క్యాంపెయిన్ షురూ చేసింది.
కేజ్రీవాల్ ఇమేజ్ డ్యామేజ్ కావడానికి ఇవి చాలవన్నట్లుగా... ఆయన అధికార నివాసానికి మరమ్మతుల కోసం 34 కోట్లపైనే ప్రజా ధనం ఖర్చు చేయడం మరో పెద్ద వివాదానికి దారితీసింది. కేవలం రూ. 7.91 కోట్ల నిధుల అంచనాలతో మొదలైన రెనోవేషన్ వర్క్ ఖర్చు 2022 లో పని పూర్తయ్యేటప్పటికి రూ. 33.66 కోట్లు అయింది.
కేజ్రీవాల్‌కు ఇంటిపేరుగా మారిన శీశ్ మహల్
అరవింద్ కేజ్రీవాల్ జనం అనుకుంటున్నంత సామాన్యుడు కాదని అప్పటికే క్యాంపెయిన్ షురూ చేసిన బీజేపికి ఈ వివాదం మరో అస్ర్తంగా పనికొచ్చింది. "శీశ్ మహల్ మే అరవింద్ కేజ్రీవాల్"... అంటే "అద్దాల మేడలో అరవింద్ కేజ్రీవాల్" అనే నినాదాన్ని బీజేపి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సహా బీజేపి నేతలంతా అరవింద్ కేజ్రీవాల్ పేరెత్తిన ప్రతీసారి అంతకంటే ముందుగా శీశ్ మహల్ అనే మాటను హైలైట్ చేస్తూ వచ్చారు. క్రమక్రమంగా అరవింద్ కేజ్రీవాల్‌కు శీశ్ మహల్ అనేది ఇంటిపేరుగా మార్చేశారు. దీంతో ప్రజల్లో ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడంలో బీజేపి ఇక్కడే మొదటి విజయం సాధించిందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.
జనం మార్పు కోరుకున్నారా?
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపి గెలిచిందా లేక ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిందా అనే వాదనలు కాసేపు పక్కనపెడదాం. ఈ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న ఏ పార్టీకి అయినా మరోసారి గెలవడం అనేది కష్టమే. ఢిల్లీ ఓటర్లు కూడా ఈసారి అలాగే మార్పును కోరుకున్నారు అనే వాళ్లు కూడా లేకపోలేదు.
ఢిల్లీలో బీజేపి అధికారంలో లేక 27 ఏళ్లు అవుతోంది. గత పదేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీదే అధికారం. అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టింది. దీంతో ఈసారి ఢిల్లీ ఓటర్లకు బీజేపి మరో ప్రత్యామ్నాయంగా కనిపించిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
పంజాబ్‌లో ఆప్ విజయం ఢిల్లీ ఎన్నికలకు పనికిరాలేదా?
పంజాబ్‌లో ఆప్ గెలుపు ఢిల్లీ ఎన్నికల్లోనూ ప్రభావం చూపిస్తుందా అనే టాక్ వినిపించింది. కానీ పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి కారణం ఆప్ సక్సెస్ రేటు కాదనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. అప్పట్లో పంజాబ్ రైతుల్లో కేంద్రంపై ఉన్న కోపమే ఆప్ విజయానికి కారణమంటారు. అందుకే పంజాబ్‌లో ఆప్ గెలుపు ఢిల్లీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయిందనేది వారి అభిప్రాయం.
ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ప్రాంతీయ పార్టీలకు నష్టమా?
ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ప్రాంతీయ పార్టీల మనుగడను ప్రశ్నార్థకం చేసిందా? ప్రాంతీయ పార్టీలను జాతీయ స్థాయిలో ఎదగకుండా పక్కనపెట్టే ప్రయత్నంలో బీజేపి క్రమక్రమంగా సక్సెస్ అవుతోందా? భవిష్యత్తులో జాతీయ స్థాయిలో బీజేపి vs కాంగ్రెస్ మధ్యే రాజకీయ పోరాటం ఉంటుందా? ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత రాజకీయ పరిశీలకులు వ్యక్తంచేస్తూన్న సందేహాలివి.
మొత్తానికి ఢిల్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపి చేసిన యాంటీ కేజ్రీవాల్ క్యాంపెయిన్ స్ట్రాటెజీ పనికొచ్చింది. ఇన్నేళ్ల కల నెరవేరింది. దేశం మొత్తం అధికారంలో ఉన్నా... దేశ రాజధానిలో పవర్ లేదే అన్న లోటు తీరింది. అబద్దాల పాలనకు కాలం చెల్లిందని అమిత్ షా అన్నారు. ఇకపై ఢిల్లీలో సుపరిపాలన అంటే ఏంటో చూపిస్తాం అని ప్రధాని మోదీ చెబుతున్నారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాం కానీ పవర్ కోసం కాదని అరవింద్ కేజ్రీవాల్ బదులిచ్చారు. ప్రతిపక్షంలోనూ మా పాత్ర ఉంటుందన్నారు. ఢిల్లీ డైరీలో అక్కడి ఓటర్లు ఇకపై తిప్పేయబోయే పేజీలు ఎలా ఉంటాయనేది లెట్స్ వెయిట్ అండ్ సీ...
Delhi Polls Results 2025: ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి 5 కారణాలు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత పని చేసింది!!
Delhi Assembly Elections 2025: బీజేపీ దిల్లీలో గెలవడానికి ఐదు కారణాలు