Rain Alert: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. రానున్న 10 రోజులు భారీ వర్షాలు..ఐఎండీ కీలక సమాచారం
Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో రానున్న 10 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Rain Alert: ఈఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి సరిపడా వర్షాలు కురవలేదు. దీంతో భారీ వర్షాల కోసం రైతన్నలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారీ వర్షాలు కురువాల్సి ఉండగా..ఈ సారి వరణుడు కాస్త ఆలస్యంగా వస్తున్నాడు. ప్రతి ఏడాది జూన్ మొదటివారంలో నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకుతాయి. ఆ తర్వాత 15 రోజులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయి. కానీ జులై 13వ తేదీ వచ్చినా కానీ ఇప్పటి వరకు ఆశించినంత వర్షాలు కురవలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ,ఏపీ రాష్ట్రాల్లో రానున్న 10 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడింది. ఉప్పల్, మల్కాజ్ గిరి, కాప్రా, అల్వాల్, నిజాంపేట ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు కూడా మధ్యాహ్నం, సాయంత్రం వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక జులై 15 నుంచి 22 వరకు బంగాళాఖాతంలో వరుసగా రెండు అల్పపీడనాలు చోటుచేసుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో రానున్న 10 రోజుల్లో తెలంగాణ, ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటోంది.రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, మహారాష్ట్ర , గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాలు, ములుగు తదితర జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది.