Gujarat Election Result: ఇవాళ వెలువడనున్న గుజరాత్ ఎన్నికల ఫలితాలు

Gujarat Election Result: ప్రధాని నరేంద్రమోడీ పాలన తీరుకు అద్దంపట్టనున్న ఫలితాలు

Update: 2022-12-08 01:11 GMT

Gujarat Election Result: ఇవాళ వెలువడనున్న గుజరాత్ ఎన్నికల ఫలితాలు

Gujarat Election Result: దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడి కాబోతున్నాయి. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ పాలన తీరుకు ఈ ఫలితాలు అద్ధంపట్టబోతున్నాయి. ఇవాళ గుజరాత్‌తోపాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. అలాగే 5 రాష్ట్రాల్లో ఒక లోక్ సభకు, ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.

గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. డిసెంబరు 1న తొలిదశలో 89 నియోజకవర్గాలకు, డిసెంబరు 5న రెండో దశలో 93 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. గుజరాత్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 92 సీట్లు అవసరమవుతాయి. గుజరాత్‌ను బీజేపీ 27 ఏళ్లుగా పాలిస్తోంది. ఈసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మాత్రం.. పశ్చిమ బెంగాల్‌లో వరుసగా గెలిచిన సీపీఎం రికార్డును ఆ పార్టీ సమం చేస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని అంచనా వేశాయి. గతం కంటే ఎక్కువ సీట్లు వస్తాయని మెజారిటీ సర్వేలు తెలిపాయి. గుజరాత్‌లో గతంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండేది... ఈసారి ఆమ్ఆద్మీ పార్టీ కొత్తగా బరిలో దిగింది. ఆపార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ గుజరాత్‌లో సత్తా చాటాలని ప్రయత్నించారు. పంజాబ్‌లో గెలిచినట్లుగానే ఇక్కడ కూడా మ్యాజిక్ చేస్తామని కేజ్రీవాల్ భావిస్తున్నారు. కానీ ఆ పార్టీ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

మరోవైపు హిమాచల్‌‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. నవంబరు 12న ఒకే దశలో అక్కడ పోలింగ్ జరిగింది. 74శాతం ఓటింగ్ నమోదయింది. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సీట్ల సంఖ్య 35. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. 35 ఏళ్ల హిమాచల్ ఎన్నికల చరిత్ర చూస్తే ఇక్కడ ఏ పార్టీ కూడా వరుసగా రెండు సార్లు గెలవలేదు. ఒకసారి బీజేపీ గెలిస్తే.. ఒకసారి కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. ఈసారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అందువల్ల ఎవరు గెలుస్తారో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే మాత్రం.. చరిత్రను తిరగరాసినట్లే..అవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లో 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. గుజరాత్‌లోని 33 జిల్లాల్లో 37 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు.. 5 రాష్ట్రాల్లోని 1 లోక్‌సభ, 6 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది. ఈ ఫలితాలు కూడా దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశముంది.

Tags:    

Similar News