Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే
Maharashtra: ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ప్రమాణ స్వీకారాలు చేయించిన గవర్నర్
Maharashtra: భారీ ట్విస్టులు, నాటకీయ పరిణామాల మధ్య సీఎం పదవిని దక్కించుకున్నారు ఏక్‌నాథ్ షిండే. పది రోజులుగా క్షణక్షణం మారుతున్న పరిణామాలతో ఉత్కంఠను రేపిన రాజకీయ కల్లోలానికి తెరపడింది. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ప్రభుత్వం కుప్పకూలేలా చేసిన ఆయన.. బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేశారు. మరోవైపు తాను ప్రభుత్వంలో భాగం కాబోనని తొలుత ఫడ్నవీస్ ప్రకటించగా.. బీజేపీ హైకమాండ్ కోరిక మేరకు ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. శివసేన రెబెల్ నేత ఏక్‌నాథ్ శంబాజీ షిండే ముఖ్యమంత్రిగా.. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.
సీఎం హోదాలో షిండే తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో జూలై 2, 3 తేదీల్లో అసెంబ్లీని సమావేశపరచాలని తీర్మానించారు. తొలిరోజు సభలో స్పీకర్ ఎన్నిక, బలపరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోల్ గత ఏడాది ఫిబ్రవరిలో స్పీకర్ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. ముఖ్యమంత్రి షిండే, ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌లను ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందించారు.
షిండే తన వర్గంతో కలిసి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు ప్రకటించినప్పటి నుంచి.. బీజేపీ సహకారంతో రెబెల్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అంతా ఊహించారు. గురువారం మధ్యాహ్నం వరకు కూడా.. దేవేంద్ర ఫడణవీస్ సీఎం అవుతారని, షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. మధ్యాహ్నం గవర్నర్‌ను కలిసిన ఫడణవీస్.. శివసేన తిరుగుబాటు నేత షిండేకు బీజేపీ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ఆయనకు 170 మంది ఎమ్మెల్యేల బలం ఉందని వివరించారు. ఆ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్.. అనూహ్యంగా మహారాష్ట్ర తదుపరి సీఎం ఏక్‌నాథ్ షిండే అని ప్రకటన చేశారు.
మరోవైపు సీఎం పదవికి రాజీనామా చేసిన ఉద్ధవ్ ఠాక్రేను ఆయన నివాస గృహం మాతోశ్రీలో మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు కలిశారు. వీరిలో మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోల్, సీనియర్ నేతలు నితిన్ రౌత్, పృథ్విరాజ్ చవాన్, బాలాసాహెబ్ ఠోరాట్, అమిత్ దేశ్‌ముఖ్ ఉన్నారు. తమ ప్రభుత్వం పడిపోయినా.. కలిసికట్టుగా ఉంటామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోరాడుతామని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా ప్రకటించారు.