Cowin Registration Portal: తెరుచుకున్న కోవిన్ పోర్టల్
Cowin Registration Portal: వ్యాక్సినేషన్‌లో భాగంగా 18ఏళ్ల దాటిన వారందరికీ టీకా నమోదు ప్రక్రియ ప్రారంభమైంది.
Cowin Registration Portal: కోవిడ్ కట్టడి చేసే బృహత్తర వ్యాక్సినేషన్‌లో భాగంగా 18ఏళ్ల దాటిన వారందరికీ టీకా నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. ఎక్కువమంది ఒక్కసారిగా యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించడంతో సర్వర్ కొన్ని టెక్నికల్ సమస్యలు ఎదుర్కొంది.
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తాండవం చేస్తోంది. చెప్పాలంటే.. వైరస్ బారిన పడుతున్న వారిలో యువత, మధ్య వయసు గలవారే ఎక్కువగా ఉన్నారు. దీంతో 18 నుండి 45 ఏళ్ల మధ‌్య ఉన్న వారికి టీకా రిజిస్ట్రేషన్ కోసం కేంద్రం అవకాశం కల్పించింది. అయితే.. రిజిస్ట్రేషన్ కోసం పెద్ద ఎత్తున యువత కొవిన్ పోర్టల్‌లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించడంతో వెబ్‌సైట్ క్రాష్ అయ్యింది. దీంతో కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న యువతకు నిరాశ ఎదురైంది.
ఇక సర్వర్లో సమస్య తలెత్తడంతో రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో వారంతా సోషల్‌మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. లాగిన్ కావడానికి అవసరమైన వన్ టైమ్ పాస్వర్డ్ కూడా రావడం లేదని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు. అటు నమోదు ప్రక్రియ అందుబాటులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లో ఈ సమస్య తలెత్తడమేంటని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే.. కొద్దిమంది మాత్రం తమకు ఎలాంటి సమస్యలు రాలేదంటున్నారు. మొదట తమకు కూడా సర్వర్ ఎర్రర్ మెసేజ్ వచ్చిందని.. కానీ తర్వాత ఓటీపీలు ఆలస్యంగా వచ్చాయంటున్నారు. ఇక ఒకేసారిగా చాలామంది రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించడంతోనే సమస్య వచ్చిందంటున్నారు అధికారులు. అయితే ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు.