World No-Tobacco Day: ఎలక్ట్రానిక్ సిగరెట్స్‌తో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు
World No-Tobacco Day: ఈ-సిగరెట్లను ఏ రూపంలోనైనా కలిగి ఉన్నా ఎలక్ట్రానిక్ సిగరెట్ నిషేధ చట్టం (పిఇసిఎ) 2019 ను ఉల్లంఘించడమే. అయినా కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా ఈ- సిగరెట్లు పట్టుబడుతున్నాయి.
World No-Tobacco Day: ఈ-సిగరెట్లతో శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె జబ్బుల వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నికోటిన్, హెవీ లోహాలతో పాటు హానికరమైన టాక్సిన్స్ ఉండే ఎలక్ట్రానికి సిగరెట్స్ నేటి యువతరానికి ప్రమాదకరంగా మారాయని వారు హెచ్చరిస్తున్నారు.
ఈ - సిగరెట్లపై నిషేధం
ఈ-సిగరెట్లను ఏ రూపంలోనైనా కలిగి ఉన్నా ఎలక్ట్రానిక్ సిగరెట్ నిషేధ చట్టం (పిఇసిఎ) 2019 ను ఉల్లంఘించడమే. అయినా కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా ఈ- సిగరెట్లు పట్టుబడుతున్నాయి. ముంబైలో గత ఏడాది యాంటీ నార్కోటిక్స్ సెల్ (ఎఎన్సీ) ఆఫ్ ముంబై పోలీసులు పాన్ షాపులపై దాడులు నిర్వహించి ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. 12 మందిపై కేసులు నమోదు చేశారు. హైద్రాబాద్ లో కూడా ఈ -సిగరెట్లు విక్రయిస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ- సిగరెట్లపై నిషేధం విధించినా కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా వీటిని విక్రయిస్తున్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని వీటి విక్రయాలు సాగుతున్నాయి.
ఈ-సిగరెట్ తో నష్టాలు ఏంటి?
పొగతాగే అలవాటున్నవారిని ఈ అలవాటు మాన్పించడం కోసం మార్కెట్లోకి ఈ- సిగరెట్లు ప్రవేశపెట్టినట్టుగా ఈ- సిగరెట్ తయారీ సంస్థలు ప్రకటించాయి. అయితే సాధారణ సిగరెట్, బీడీల కంటే ఈ- సిగరెట్లతోనే ఆరోగ్యానికి ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. ఈ -సిగరెట్లలో ఒక రకమైన ద్రవపదార్ధం ఉంటుంది. దీన్ని ఆవిరిగా మార్చేందుకు బ్యాటరీ పనిచేస్తుంది. బ్యాటరీ సహాయంతో ఈ-సిగరెట్లను వెలిగించి ఆవిరిని పీలుస్తారు. ఈ-సిగరెట్లు రకరకాల రుచుల్లో లభిస్తాయి. పెన్నులు, ఫెర్ఫ్యూమ్ , ఫ్లాష్ లైట్లు తదితర రూపాల్లో ఈ -సిగరెట్లు లభిస్తాయి. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో సంబంధం ఉన్న డయాసెటిల్ అనే రసాయనం ఈ-సిగరెట్లలో వాడుతున్నట్టుగా గుర్తించారు. చెర్రీ ఫ్లేవర్ ఈ-సిగరెట్లలో బెంజల్డిహైడ్ అనే రసాయన సమ్మేళనం లభించింది. ఈ రసాయన పదార్ధాలు శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
క్యాన్సర్ కేసుల పెరుగుదల
ఈ- సిగరెట్లు దీర్ఘకాలిక శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి. ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపుతుంది. రక్తపోటు, గుండె జబ్బులకు దారి తీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ- సిగరెట్లలో విషపూరిత రసాయనాలు, హెవీ మెటల్స్, కార్సినోజెన్లు కూడా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కు దారి తీస్తాయి. రుచిగల ఈ-ద్రవాలు కూడా ప్రమాదకరమైనవని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచంలో ఇప్పటికే 30 దేశాల్లో ఈ-సిగరెట్లను బ్యాన్ చేశారు. పొగతాగడం మాన్పించే పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ -సిగరెట్లు సాధారణ సిగరెట్ల కంటే ప్రమాదకరమైనవిగా వైద్యులు చెబుతున్నారు. ప్రపంచంలో ప్రతి ఏటా 8 మిలియన్ల మంది పొగాకు ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది.