PM Modi: మోదీని ఆహ్వానించిన జో బైడెన్
PM Modi: పర్యావరణ సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీతో పాటు 40 దేశాల నేతలను జో బైడెన్ ఆహ్వానించారు.
PM Modi: అగ్ర రాజ్యం అమెరికా నుండి ప్రధాని మోదీకి ఆహ్వానం వచ్చింది. ఈ మేరకు శనివారం శ్వేత సౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 22, 23వ తేదీల్లో నిర్వహించే పర్యావరణ సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం పంపారు. ప్రధాని మోదీతో పాటు 40 దేశాల నేతలను ఆహ్వానించారు. అమెరికా నిత్యం విమర్శలు గుప్పిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లను సైతం ఆహ్వానించింది. రెండు రోజుల పాటు జరిగే సదస్సును వర్చువల్ గా నిర్వహించనున్నట్టు తెలిపింది. రష్యా, చైనాలు ఈ ఆహ్వానంపై ఇంకా స్పందించలేదు. కాలుష్య ఉద్గారాల్లో చైనా ప్రథమ స్థానంలో ఉండగా.. అమెరికా రెండు, రష్యా నాలుగో స్థానంలో ఉంది.
గ్లాస్గో వేదికగా...
పర్యావరణ మార్పులపై గ్లాస్గో వేదికగా ఈ ఏడాది నవంబర్ లో ఐక్యరాజ్యసమితి నిర్వహించతలపెట్టిన 'కాప్ 26' సదస్సుకు ఇది రీహార్సల్ గా ఉంటుందని, ముఖ్యమైన విషయాలపై చర్చించవచ్చని తెలిపింది. మోదీతో పాటు చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జపాన్ ప్రధాని యోషిహిదే సూగా, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, సౌదీ రాజు సల్మాన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ లను ఆహ్వానించారు. దక్షిణాసియా నుంచి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ లనూ సదస్సుకు పిలిచారు.
ఉద్గారాలను తగ్గించే లక్ష్యంగా...
జార్జిబుష్, బరాక్ ఒబామా హయాంలో 'లీడర్స్ సమ్మిట్'లను నిర్వహించగా డొనాల్డ్ ట్రంప్ కాలంలో ఈ సమావేశాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. అయితే ప్రస్తుతం జో బైడెన్.. వాతావరణ సమ్మిట్‌ను పునరుద్ధరించనున్నారు. బైడెన్ నాయకత్వం వహించే ఈ సమావేశంలో దేశఆర్థిక పురోగతిని సాధిస్తూనే ఎంతమేరకు ఉద్గారాలను తగ్గిస్తామనే లక్ష్యాన్ని అమెరికా ప్రకటించనుంది.