Jammu and Kashmir Encounter: తీవ్రవాదుల కాల్పుల్లో అమరుడైన ఆర్మీ ఆఫీసర్ రాకేష్ కుమార్

Update: 2024-11-10 16:00 GMT

Jammu and Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్‌వార్‌లో ఆర్మీ బలగాలకు, తీవ్రవాదులకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక ఆర్మీ ఆఫీసర్ అమరుడయ్యారు. మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) నాయబ్ సుబేదార్ రాకేష్ కుమార్ అమరుడైనట్లు ఇండియన్ ఆర్మీకి చెందిన 16 కార్ప్స్ విభాగం ఎక్స్ ద్వారా వెల్లడించింది. రాకేష్ కుమార్ 2 పేరా స్పెషల్ ఫోర్సెస్ విభాగానికి చెందిన ఆర్మీ అధికారి. దేశ రక్షణలో భాగంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులతో పోరాడుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. 

ఇండియన్ ఆర్మీలో పేరా స్పెషల్ ఫోర్సెస్ విభాగం 1966 లో ప్రారంభమైంది. ఇది ఆర్మీలో అత్యున్నత పారాషూట్ రెజిమెంట్. శత్రువులను దెబ్బ కొట్టడంలో సుశిక్షితులైన కమాండోలకే ఇందులో స్థానం ఉంటుంది.

విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌ను కాల్చిచంపిన తీవ్రవాదులు

గురువారం నజీర్ అహ్మెద్, కుల్దీప్ కుమార్ అనే ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ (VDGs) లను తీవ్రవాదులు కాల్చిచంపారు. కుంట్వారా, కేశ్వన్ అటవీ ప్రాంతానికి సమీపంలో రక్తపు మడుగులో బుల్లెట్లు చీల్చిన స్థితిలో వారి మృతదేహాలు లభించాయి. అప్పటి నుండే ఇండియన్ ఆర్మీ, స్థానిక పోలీసులతో కలిసి తీవ్రవాదుల జాడ కోసం కుంట్వారా, కేశ్వన్ అటవీ ప్రాంతంలో జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం 11 గంటలకు ఆర్మీ బలగాలకు, తీవ్రవాదులు తారసపడ్డారు. దాంతో అది ఇరువర్గాల మధ్య ఎన్‌కౌంటర్‌కు దారితీసింది. నలుగురు ఉగ్రవాదులు ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్పంచుకున్నట్లు సమాచారం అందుతోంది. కడపటి వార్తలు అందే సమయానికి కూడా ఈ ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. 

Tags:    

Similar News