కోడిగుడ్డుపై కొత్త కథ వినిపించిన మేనకా గాంధీ.. పిల్లలకు గుడ్డును అహారంగా ఇవ్వకూడదంటున్న..

Maneka Gandhi: కోడిగుడ్డుపై ఈకలు పీకడం అంటే ఇదేనేమో.

Update: 2022-06-09 15:30 GMT

కోడిగుడ్డుపై కొత్త కథ వినిపించిన మేనకా గాంధీ.. పిల్లలకు గుడ్డును అహారంగా ఇవ్వకూడదంటున్న..

Maneka Gandhi: కోడిగుడ్డుపై ఈకలు పీకడం అంటే ఇదేనేమో. రోజుకో గుడ్డు తినాలని పౌష్టికహార లోపం నుంచి బయటపడాలంటూ డాక్టర్ల నుంచి ప్రభుత్వాల వరకు అంతా కోడై కూస్తున్నా మరికొందరు మాత్రం దీనికి తప్పుడు అర్థాలు తీసుకొస్తున్నారు. సంప్రదాయాన్ని అడ్డుపెట్టి విచిత్రమైన పోలికలను తెరపైకి తీసుకొస్తున్నారు. బీజేపీ ఎంపీ, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ గుడ్డును తీసుకోవద్దంటూ ఏకంగా స్టేట్ మెంట్ ఇస్తున్నారు. అందుకు ఆమె చెబుతున్న కారణమేంటి..? అందులో ఉన్న లాజిక్ ఏంటి..?

సండే యా మండే.. రోజ్ ఖావ్ అండే. నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ చేస్తున్న ఈ ప్రచారంతో ముఖ్యంగా పౌష్టికహార అవసరాన్ని సూచిస్తుంది. రోజుకో గుడ్డును తీసుకుంటే కావాల్సిన పోషకాలు అందుతాయని నిరూపితమైంది. ఓ మనిషికి ఒకరోజుకు కావాల్సిన ప్రోటీన్లు ఓ గుడ్డు ద్వారా అందుతాయని స్పష్టమైంది. ఏ వయస్సు వారైనా గుడ్డు తినడం అలవాటు చేసుకుంటే అనారోగ్యం ధరి చేరదని చెబుతారు. అందుకే ప్రభుత్వ పాఠశాల్లో చదివే పేదలకు గుడ్డును తప్పకుండా అందజేస్తున్నారు. పిల్లల్లో పౌష్టికహార లోపం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే కోడిగుడ్డుపై బీజేపీ ఎంపీ, జంతు హక్కుల కార్యకర్త మేనకాగాంధీ కొత్త కథ వినిపించారు. గుడ్డును అసలు తినకూడదని స్టేట్ మెంట్ ఇచ్చారు. పిల్లలకు గుడ్డును అహారంగా ఇవ్వకూడదంటూ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో జరిగిన శ్రీ జైన సేవా సంఘ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె గుడ్డుపై అడిగిన ప్రశ్నకు విచిత్రమైన సమాధానం చెప్పారు. కోడి రుతుస్రావం ద్వారా వచ్చే రక్తంతో గుడ్డు తయారవుతుందని ఇది తినడానికి సరిపోదని వివరించారు. అందువల్ల పిల్లల పౌష్టికాహారం కోసం గుడ్డును ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రోత్సహించడాన్ని నిరసించాలని ఆమె సూచించారు. గుడ్డు బదులు రెండు చెంచాల పప్పులో అంతకంటే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయని అంతేకాకుండా గుడ్డు తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని తెలిపారు. ఇక నుంచి గుడ్డు తినవద్దంటూ ప్రచారానికి పూనుకోవాలని ఆమె పిలుపునిచ్చింది.

అలాగే మాంసాన్ని బహిరంగంగా విక్రయించడం, జంతు వధ, పంజరాల్లో పక్షులను ఉంచడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటన్నింటినీ ప్రశ్నించడం ద్వారానే అరికట్టవచ్చని చెప్పుకొచ్చారు. ఏదేమైనా గుడ్డుపై ఆమె చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారి తీశాయి. అందులో ఎంతవరకు వాస్తవముందో గుడ్డు తినడం వల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటో వాటిని నిరూపించేవారెవరో తనే చెప్పాలి. 

Tags:    

Similar News