Arunachal Pradesh: ఎన్నికల సిబ్బంది అడ్వెంచర్లు.. కొండలు, లోయలు దాటుతూ డ్యూటీకి వెళ్లిన ఎలక్షన్ టీమ్
Arunachal Pradesh: సౌకర్యాలు లేకపోవడంతో విధులకు హాజరయ్యేందుకు ట్రెక్కింగ్
Arunachal Pradesh: ఎన్నికల విధులంటేనే ఓ సవాల్. పై అధికారులు ఎక్కడ డ్యూటీ వేస్తే అక్కడ వెళ్లి పనిచేయాలి. ఆడ మగా తేడా లేదు.. పల్లెల్లో వేసినా అడవుల్లో వేసినా అటెండ్ అవ్వాల్సిందే.. అక్కడి రాజకీయ పరిస్థితులూ... అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఓటు వేయించేందుకు ఆ పరిస్థితులన్నింటికీ సన్నద్ధంగా ఉండాలి. ఇన్ని సవాళ్ల మధ్య డ్యూటీలు చేసే ఎలక్షన్ సిబ్బందికి.. కొన్నిచోట్ల ఇంతకంటే పెద్ద సమస్యలే ఎదురవుతున్నాయి. అక్కడ ఎన్నికల విధులకు హాజరవ్వాలంటే ప్రాణాలకు కూడా తెగించాలి. మెంటల్‌గానే కాదు ఫిజికల్‌గానూ సిద్ధమవ్వాలి.
ఎన్నికలు అంటే ప్రతీ ఓటూ ముఖ్యమే. అందుకే ఎన్నికల కమిషన్... ఎలక్షన్ అంటే అంత ఆషామాషీగా తీసుకోవడం లేదు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నారు. దేశంలో ఏ మూలన ఉన్నా.. అక్కడ ఒక్క ఓటు ఉన్నా.. పోలింగ్ జరపాలనే పట్టుదలతో పనిచేస్తోంది. అయితే ఈసీ లక్ష్యం.. కింద పనిచేసే సిబ్బందికి చుక్కలు చూపెడుతోంది. తగిన సౌకర్యాలు లేకపోయినా ఓటు వేయించేందుకు ఫీట్లు చేస్తున్నారు అధికారులు.
ఇక్కడ కనిపిస్తున్న అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లా రుంగాంగ్ నియోజకవర్గంలోనిది. ఈ వీడియో చూస్తే ఓట్ల కోసం సిబ్బంది ఎన్ని పాట్లు పడాల్సి వస్తుందో అర్థం చేసుకోవచ్చు. అక్కడి ఓ గ్రామంలో పోలింగ్ నిర్వహించాలంటే అడ్వెంచరస్ జర్నీ చేయాల్సిందే. అక్కడ కూడా వెనకాడకుండా పోలింగ్ కోసం సిబ్బంది లైఫ్ రిస్క్ చేసి మరీ వెళ్లారు. ఎత్తైన కొండలపైకి చేరుకునేందుకు ట్రెక్కింగ్ చేశారు. సామాగ్రి మోస్తూనే తాళ్ల సాయంతో కొండలెక్కారు. ఇలా కొండలు, లోయలు దాటుతూ.. సాహస యాత్ర చేస్తూ సిబ్బంది విధులకు వెళ్తున్నారు.
ఈ ఒక్క ఘటనే కాదు.. ఇటీవలే ఒక్క ఓటు కోసం ఈటా నగర్ పరిధిలో పోలింగ్ సిబ్బంది 40 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేశారు. ఇలా సౌకర్యాలు లేని చోట ఎన్నికల విధులు నిర్వర్తించాలంటే ఒక్క పోలింగ్ మీదే కాదు.. అడ్వెంచర్ల కోసమూ సిబ్బంది ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉంటే అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల సిబ్బంది చేసిన అడ్వెంచర్స్ చూసి నెటిజన్లు ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉండటంపై మండిపడుతున్నారు.