Rajya Sabha: ఖర్గే వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ.. క్షమాపణలకు ఖర్గే ససేమిరా..
Rajya Sabha: AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో దుమారం రేపాయి.
Rajya Sabha: AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో దుమారం రేపాయి. దేశం కోసం భారతీయ జనతా పార్టీ కనీసం ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదంటూ మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు పెద్దల సభను కుదిపేశాయి. ఖర్గే క్షమాపణ చెప్పా్ల్సిందేనని అధికారపక్షం రాజ్యసభలో పట్టుపట్టింది. రాజ్యసభా పక్షనేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఖర్గే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే చైనా... భారత సరిహద్దుల్లో ఆక్రమణలకు పాల్పడిందని మండిపడ్డారు. క్షమాపణ చెప్పేందుకు ఖర్గే నిరాకరించారు.
నిన్న రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో భారత్ జోడో యాత్రలో భాగంగా జరిగిన ర్యాలీలో బీజేపీ సర్కార్‌పై ఖర్గే విరుచుకుపడ్డారు. సింహంలా మాట్లాడుతూ చిట్టెలుక లాగ ప్రవర్తిస్తారని ఫైరయ్యారు. సరిహద్దుల వెంబడి దురాక్రమణలకు దిగుతున్న చైనాపై ఎలాంటి చర్యలూ తీసుకోదని ఆరోపించారు. పార్లమెంటులో చర్చ జరపకుండా పలాయనం చిత్తగిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం కాంగ్రెస్ నిలబడిందని, స్వాతంత్ర్య సముపార్జనకు పాటుపడిందన్నారు. ఎందరో కాంగ్రెస్ నాయకులు ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. ఈ క్రమంలోనే బీజేపీ దేశం కోసం కనీసం ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే రాజ్యసభలో దుమారానికి కారణమయ్యాయి. ఖర్గే వ్యాఖ్యలను బీజేపీ నేతలు ప్రస్తావిస్తూ ఆందోళనకు దిగారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఖర్గే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో డిమాండ్ చేశారు.
ఖర్గే మాత్రం క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. తాను బయట అన్న వ్యాఖ్యలపై సభలో ఎలా వివరణ అడుగుతారని ప్రశ్నించారు. మరోసారి ఆ కామెంట్స్ ను సభలో చేస్తే తట్టుకోలేరని స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు ఖర్గే. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యా్గం చేసిన కాంగ్రెస్ నేతలను క్షమాపణ చెప్పమనడం విడ్డూరంగా ఉందన్నారు. స్వాత్యంత్ర్య పోరాటంలో ఎలాంటి పాత్రలేని బీజేపీనే క్షమాపణ చెప్పాలని ఫైరయ్యారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ వంటి ఎందరో కాంగ్రెస్ నాయకులు ప్రాణ త్యాగాలు చేశారని, దేశ ఐక్యత కోసం బీజేపీలో ఎవరైనా ప్రాణత్యాగం చేశారో చెప్పాలని ఖర్గే నిలదీశారు.
ఖర్గే తీరుపై మరోసారి ఫైరయ్యారు పీయూష్ గోయల్.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మాగాంధీ చెప్పారని గుర్తుచేశారు. ఖర్గే తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకుంటే సభలో కూర్చునే అర్హత ఉండదన్నారు.
వాగ్వాదం మధ్య స్పీకర్ జగ్‌దీప్ ధన్‌ఖర్ సభ్యులను వారించే ప్రయత్నం చేశారు. సభలో ఇలాంటి ప్రవర్తన సరికాదన్నారు. సభాతీరును 135 కోట్ల మంది ప్రజలు గమనిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. సభ బయట మాట్లాడిన మాటలపై ఆందోళన సరికాదన్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుంటే అడ్డుకోవడానికి మనమేమీ చిన్నపిల్లలం కాదంటూ మందలించారు. చివరకు ఇరు పక్షాలు శాంతిచగా సభా కార్యకలాపాలు జరిగాయి.