Kerala: వయనాడ్ లో కొండచరియలు కూలి 84 మంది మృతి… ఈ విషాదాలు ఎందుకు రిపీట్ అవుతున్నాయి?

మల్లప్పురం చలియార్ నదిలో కొన్ని మృతదేహలు బయటపడ్డాయి. ఈ గ్రామాలకు వెళ్లే రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి. వాగులు, నదులను తాళ్ల సహాయంతో ఆర్మీ సిబ్బంది దాటి రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభించారు.

Update: 2024-07-30 13:50 GMT

వయనాడ్ జిల్లా మెప్పాడిలో మంగళవారం ఉదయం కొండచరియలు విరిగిపడిన ఘటనలో 84 మంది మృతి చెందారు. మరో 250 మంది ఆచూకీ లభించలేదు. భారీ వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.


 వయనాడ్ ప్రమాదానికి భారీ వర్షమే కారణమా?

వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, మండకై, చురల్మల, అత్తమాల గ్రామాలు కొండలకు ఆనుకుని ఉంటాయి. ఈ గ్రామాల్లో 24 గంటల వ్యవధిలో 373 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదం నుంచి 250 మందిని రక్షించారు. 84 మంది చనిపోయారు. మరో 250 మంది ఆచూకీ లభ్యం కాలేదు.

మల్లప్పురం చలియార్ నదిలో కొన్ని మృతదేహలు బయటపడ్డాయి. ఈ గ్రామాలకు వెళ్లే రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి. వాగులు, నదులను తాళ్ల సహాయంతో ఆర్మీ సిబ్బంది దాటి రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభించారు.


 కేరళ సీఎం విజయన్ కు మోదీ ఫోన్

వయనాడ్ ప్రమాదంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

ఈ ఘటనపై లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. బాధితులను ఆదుకోవాలని ఆయన లోక్ సభలో కోరారు. తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ కూడా విజయన్ తో మాట్లాడారు. రెస్క్యూ ఆపరేషన్స్ కోసం తమ రాష్ట్రం నుంచి ఓ బృందాన్ని పంపుతామన్నారు. అదేవిధంగా రూ. 5 కోట్లను కూడా కేరళకు తక్షణసహాయంగా అందిస్తున్నట్టుగా ప్రకటించారు.


 రంగంలోకి ఆర్మీ

కొండచరియలు విరిగిన ప్రాంతంలో కేరళ విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, ఎన్ డీ ఆర్ ఎఫ్ తో పాటు ఆర్మీ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. సూలూరు ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి?

కొండప్రాంతాల నుంచి రాళ్లు, మట్టి కిందకు జారిపడడాన్ని ప్రకృతి వైపరీత్యంగా పిలుస్తారు. భారీ వర్షాలతో వరద పోటెత్తిన సమయంలో ఈ ప్రమాదాలు ఎక్కువగా వస్తుంటాయి. అగ్ని పర్వతాలు, భూగర్భజలాల్లో మార్పులు, భూకంపాలతో కూడా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది. అడవులు అంతరించిపోవడం, గనుల తవ్వకం వంటివి కూడా ఈ ప్రమాదాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.


 ఇండియాలో ఈ ప్రమాదాలు జరిగే ప్రాంతాలివే…

ఇండియాలో నీలగిరి కొండలు, పశ్చిమ కనుమలు, హిమాలయ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుంటాయి. దేశంలోని 15 శాతం భూమి కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతంగా గుర్తించారు. 22 రాష్ట్రాల్లో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని భూగర్భశాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కౌమాన్, ఘర్వాల్, కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో తరుచుగా ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. 1970లో పాతాళగంగానదిని కొండచరియలు విరిగి అడ్డగించడంతో అలకనందా ప్రమాదం జరిగింది. 2005 లో పరెచ్చు నదికి అడ్డంకి తో హిమాచల్ లో వరదలు వచ్చాయి. 2006 ఆగస్టులో అరకులోయలో కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి చెందారు.

ఉత్తరాఖండ్ లో వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడుతుంటాయి. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడుతుంటారు. ఈ ప్రమాదాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

Tags:    

Similar News