ఒకరు మెగాస్టార్. మరొకరు పవర్ స్టార్. ఇద్దరూ అన్నదమ్ములే. ఇద్దరూ రాజకీయాల్లో అడుగులేసినవారే. కానీ ఒక విలీనం వారి మధ్య అగాథం పెంచింది. ఇప్పడు కాలంతో పాటు ఆ అగాథం కూడా కనుమరుగు అవుతోందన్న చర్చ జరుగుతోంది. సైరా టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వడం, బర్త్ డే వేడులకు హాజరు కావడం, తాజాగా సైరా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు కూడా అటెండ్ కావడంతో, మరోసారి మెగా పాలిటిక్స్‌పై చర్చ మొదలైంది. నాడు ప్రజారాజ్యానికి తమ్ముడు తోడుగా వుంటే, నేడు జనసేనకు అన్నయ్య అండగా వుంటారన్న చర్చ ఊపందుకుంటోంది. పదేపదే ఇలాంటి ప్రచారం ఎందుకు జరుగుతోంది?
మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఇద్దరూ ఏ వేదిక మీదా కనపడ్డ అభిమానులకే పండుగే. ఒకరి నోట నుంచి, మరొకరి పేరు వినిపిస్తేనే, ఈలలతో హోరెత్తించే ఫ్యాన్స్, ఇక ఒకే చోట పక్కపక్కనే కనిపిస్తే ఊరుకుంటారా, అన్ని పండగలూ ఒకేసారి వచ్చినట్టుగా సంబరంలో మునిగిపోతారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి, నటించిన సైరా, వచ్చే నెల రెండున ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు చిరు తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అతిథిగా హాజరయ్యారు. అన్నయ్య జీవితం తనకు స్ఫూర్తి అని, ఆయనకు తాను వీరాభిమానిని అని ప్రసంగించారు జనసేన అధినేత.
అంతా బానే వుంది. సైరా ప్రిరిలీజ్ ఫంక్షన్‌కు పవన్ వచ్చారు. అయితే మరోసారి వీరిద్దరూ, ఒకే వేదిక మీద కనపడ్డంతో సహజంగానే, రాజకీయ వ్యాఖ్యానాలు, ఊహాగానాలు మొదలయ్యాయి. వపన్‌తో కలిసి, చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి వస్తారా తమ్ముడికి అండగా వుంటాడా అన్న చర్చ, అభిమానుల్లోనే కాదు, రాజకీయవర్గాల్లోనూ జోరుగా సాగుతోంది.
చిరంజీవి, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో నొచ్చుకున్నారు పవన్ కల్యాణ్. ఆ పరిణామంతో సోదరుల మధ్య అగాథం ఏర్పడిందన్న చర్చ జరిగింది. మెగా కుటుంబాల మధ్య విభేదాలు పెరిగాయన్న డిస్కషన్ సైతం సాగింది. పీఆర్పీ విలీనం తర్వాత, చిరు-పవన్‌లు కూడా పెద్దగా కలుసుకోలేదు. 2019 ఎన్నికల వరకు కూడా, పెద్దగా మాటల్లేవు, మాట్లాడుకోవడాల్లేవు. ఎన్నికల్లో సైతం చిరంజీవి ప్రస్తావన ఎక్కువగా తీసురాకుండా, జాగ్రత్తపడినట్టు కనిపించారు పవన్. రాంచరణ్ ప్రచారం చేయడానికి ఉత్సాహం చూపినా, అంతగా ఆసక్తి చూపలేదాయన. చిరు ప్రస్తావన వస్తే, జనసేనకు ఏమాత్రం మంచిదికాదని సైలెంట్‌గా వుండిపోయారు. అయితే ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత, పూర్తిగా తన ఆలోచనను మార్చుకుంటున్నట్టు అర్థమవుతోంది. ఎన్నికల తర్వాత చిరుకు, తిరిగి దగ్గరయ్యేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. తరచుగా ఒకే వేదికను పంచుకుంటుండటమే ఇందుకు నిదర్శనమన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
సైరా టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారు పవన్ కల్యాణ్. స్వయంగా అన్నయ్య సమక్షంలో వాయిస్ ఇచ్చారు. దీంతో అప్పుడే, ఇద్దరూ మళ్లీ ఏకమవుతున్నారు, రాజకీయాల్లోనూ ఏకమవుతున్నారన్న చర్చ జరిగింది. ఆ తర్వాత చిరంజీవి బర్త్ డే వేడుకలకు సైతం హాజరయ్యారు పవన్ కల్యాణ్. ఇప్పుడు ప్రి రిలీజ్ ఫంక్షన్ కూడా వెళ్లారు. దీంతో మరోసారి చిరంజీవి రాజకీయ పున:ప్రవేశం చేస్తారా, పవన్ చేయిస్తారా అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. నాడు ప్రజారాజ్యం టైంలో అన్నయ్యకు తమ్ముడు తోడుగా వుంటే, ఇప్పుడు జనసేనకు అన్నయ్య అండగా వుంటారా అన్న కోణంలో అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో మరీ దారుణమైన ఫలితాలు రావడానికి చిరంజీవితో అంతగా కలవకపోవడం కూడా కారణమన్న వాదన కూడా వుంది. చిరు అభిమానులు, ఒకవర్గం ప్రజలు కూడా జనసేనకు ఓట్లేయలేదన్న విశ్లేషణలు జరిగాయి. అందుకే తన బలానికి మెగా బలం కూడా తోడైతైనే, అనుకున్న గమ్యం చేరడం సాధ్యమని పవన్ తపిస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది. అయితే, తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించడం, చిరంజీవికి ఏమాత్రం ఇష్టంలేదన్న వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. అయితే, వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ హవా తగ్గిపోయి, వైసీపీకి ప్రత్యామ్నాయంగా తామే కనిపిస్తామన్న ఆలోచనలో వున్న పవన్, అప్పటికి అన్నయ్యను ఎలాగైనా ఒప్పిస్తారేమో, కాలమే సమాధానం చెప్పాలి. అప్పటి వరకు ప్రిరిలీజ్ ఈవెంట్లతో పాటు ఏ ఫంక్షన్‌లో, ఏ సందర్భంలోనూ ఇద్దరూ పక్కపక్కనే కనిపించినా, ఇలాంటి రాజకీయ ఊహాగానాలు రేగుతూనే వుంటాయి.