తెలుగు రాష్ట్రాల్లో చిరు చేయబోతున్న రాజకీయమేంటి?

Update: 2020-02-06 11:00 GMT

మెగాస్టార్‌ చిరంజీవి, రాజకీయాలకైతే దూరమైనట్టు కనిపిస్తున్నారు. కానీ రాజకీయాలకు అతీతంగా రాజకీయమేదో చేస్తున్నారన్న మాటలు మాత్రం బాగానే వినపడ్తున్నాయి. మొన్న ఏపీ సీఎం జగన్‌ను కలిశారు. మూడు రాజధానులకు మద్దతు పలికారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రితోనూ మెరుగైన సంబంధాలకు ప్రయత్నిస్తున్నారా? తాజాగా తలసానితో భేటిలో పరిశ్రమ అభివృద్దే కాకుండా, మరిన్ని విషయాలపై చర్చలు జరిగాయా? రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి చేస్తున్న రాజకీయమేంటి? మెగాస్టార్‌ మదిలో ఏముంది?

రాజకీయాలకు గుడ్‌ బై చెప్పానంటున్న మెగాస్టార్‌ చిరంజీవి, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం, కొత్త రాజకీయం మొదలుపెట్టారన్న చర్చ జరుగుతోంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి క్లోజ్‌ అవుతున్న చిరంజీవి, ఇటు తెలంగాణలోనూ కేసీఆర్‌ సర్కారుతో అదే బంధం పటిష్టం చేసుకోవాలన్నట్టుగా ముందుకు సాగుతున్నారన్న మాటలు వినపడ్తున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో మంతనాలే అందుకు నిదర్శనమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు చిరంజీవి నాగార్జునతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయ్యారని తెలుస్తోంది. సినిమా రంగం అభివృద్ధి, సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. శంషాబాద్‌లో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు చేయాలని చిరంజీవి కోరినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి, సానుకూల నిర్ణయం వచ్చేలా చూస్తానని తలసాని చిరుకు హామినిచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఈ భేటిలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చర్చలే ప్రస్తావనకు వచ్చాయని తెలుస్తున్నా, తెలుగు రాష్ట్రాల తాజా రాజకీయాలపై సమాలోచనలు జరిగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, రాజకీయాలకు అతీతంగా చిరంజీవి పోషించబోతున్న పాత్రపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఇటీవలె అమరావతికి వెళ్లి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో సమావేశమయ్యారు చిరంజీవి. ఆ తర్వాత, మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రకటన విడుదల చేశారు. సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. టీడీపీతో పాటు సొంత తమ్ముడు పవన్‌ వ్యతిరేకిస్తున్నా, చిరంజీవి మాత్రం, జగన్‌కే సపోర్ట్ ఇచ్చారు. అంతకముందు సైరా విడుదల, అదనపు షోల విషయంలోనూ, చిరంజీవికి హెల్ప్ చేసింది వైసీపీ ప్రభుత్వం. ఇలా జగన్‌ ప్రభుత్వంతో ఎలాంటి గొడవలకు పోకుండా, మరింత సన్నిహితంగా మెలిగేందుకు చిరంజీవి ప్రయత్నిస్తున్నారన్నడానికి ఈ పరిణామాలే నిదర్శనమంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్‌-జగన్‌లు ఆల్రెడీ చాలా స్నేహపూర్వకంగా వుంటున్నారు. ఈ నేపథ్యంలో, కేసీఆర్‌తోనూ మెరుగైన సంబంధాలకు చిరంజీవి ఆకాంక్షిస్తున్నారని, దానిలో భాగమే తలసానితో చర్చలని, కొందరు ఇండస్ట్రీ పెద్దలు కూడా మాట్లాడుకుంటున్నారట.

అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలతో చిరంజీవి స్నేహపూరిత సంబంధాలను కోరుకోవడం వెనక, ఆయనకంటూ ఒక వ్యూహముందన్న చర్చ నడుస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి పెద్దన్నగా వ్యవహరించాలని చిరంజీవి ప్రయత్నిస్తున్నారట. అందుకే ఎప్పుడూ లేనిది ఈమధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశాల్లో పాల్గొంటున్నారు చిరు. పరిశ్రమ సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడు ముందుంటానని అనేక సమావేశాల్లో చెబుతున్నారు. మొన్న హీరో రాజశేఖర్‌తో గొడవ సందర్భంలోనూ, ఇండస్ట్రీ బాగోగోలకు తాను ముందుంటానని అభయమిచ్చారు. ఇంతకుముందెప్పుడూ చిరంజీవి ఇండస్ట్రీ వ్యాపకాలు పెద్దగా పట్టించుకోలేదు. ఈమధ్య మాత్రం, అదేపనిగా మా వివాదాలు, సమస్యలపై స్పందిస్తున్నారు. మా ఎన్నికలను పరోక్షంగా శాసిస్తున్నారు. ఇండస్ట్రీకి దాసరి నారాయణలేని లోటును చిరు పూడ్చాలనుకుంటున్నారని ఈ పరిణామాలను బట్టి అర్థమవుతోందన్న చర్చ నడుస్తోంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించాలంటే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సఖ్యత అవసరమని గ్రహించిన చిరు, వరుసగా రెండు పార్టీల నాయకులతోనూ మాట్లాడుతున్నారని తెలుస్తోంది. చిరు ఎలాగూ రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు కాబట్టి, ఆయన పరోక్ష సహకారం ఎన్నికల్లో ప్రయోజనమని పార్టీల అధినేతలు ఆలోచిస్తున్నారన్న మాటలు వినపడ్తున్నాయి. కాపు వర్గంలో కీలకమైన లీడర్‌గా వున్న చిరుతో, లాభమే కానీ నష్టంలేదని భావిస్తున్నారు. ఇలాంటి సమీకరణలతోనే తనకు మరింత ప్రాధాన్యం లభిస్తోంది కాబట్టి, ఇండస్ట్రీలో కీలకమైన వ్యక్తిగా మారాలని చిరంజీవి కూడా తపిస్తున్నారని తెలుస్తోంది. చూడాలి, రాజకీయాలకు అతీతంగా చిరంజీవి తనదైన శైలిలో మున్ముందు ఎలాంటి రాజకీయాలు నడిపిస్తారో.

Tags:    

Similar News