టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు, నటుడు అయిన దర్శకరత్న దాసరి నారాయణ రావు జయంతి సందర్బంగా దర్శకుల దినోత్సవంను జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో దాసరి పేరు మీద టాలెంట్ అకాడమీని కూడా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఫార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ను నిర్వహిస్తారు. విజేతలకు ప్రసాద్ ల్యాబ్స్ లో బహుమతి కూడా ఇవ్వబడుతుంది. తాజాగా ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, జయసుధ, ఆర్ నారాయణ మూర్తి, సి కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మోహన్ బాబు మాట్లాడుతూ, "గతంలో చాలాసార్లు నేను గురువు గారితో మీ నీడలోనే మేము ఉండాలి, మీ కంటే ముందు మేము పోవాలి అని అంటుండేవాడిని. ఆ సమయంలో ఆయన నేను వెళ్తే అన్ని నువ్వే చూసుకోవాలని అనేవారు. ఆయన వీలునామాలో కూడా నాది మరియు మురళి మోహన్ పేర్లను రాశారు. మేమిద్దరం ఆస్తుల పంపకాలు చేయాలనేది ఆయన ఆలోచన. కాని ఆయన కోరుకున్నట్లుగా మేము చేయలేక పోయాం. దానికి కారణం మా అసమర్ధత" అని షాకింగ్ కామెంట్స్ చేశారు మోహన్ బాబు. "దాసరి పేరుతో నడుస్తున్న ట్యాలెంట్ అకాడమీ వారి సూచన మేరకు ఎవరో ఒకరికి మా విద్యా సంస్థలో ఎల్ కేజీ నుండి ప్లస్ టు వరకు ఉచిత విద్యను అందిస్తాం" అని మోహన్ బాబు హామీ ఇచ్చారు.