Sandhya Theatre Stampede: పుష్ప 2 నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పుష్ప2 సినిమా నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్ లను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట ఘటనలో పుష్ప2 (Pushpa 2) సినిమా నిర్మాతలు యలమంచిలి రవిశంకర్(Yalamanchili Ravi Shankar), యెర్నేని నవీన్ (Naveen Yerneni )లను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఘటనలో నిర్మాతలు నవీన్, రవిశంకర్ కు ఎలాంటి సంబంధం లేదని వారి తరపు న్యాయవాదులు వాదించారు. ఎఫ్ఐఆర్ లోని అభియోగాలు వర్తించవని కోర్టు దృష్టికి తెచ్చారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వస్తున్న విషయాన్ని పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారని చెప్పారు. పోలీసులు కూడా థియేటర్ ను పరిశీలించారని వారు గుర్తు చేశారు. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
ఇదే కేసులో అల్లు అర్జున్ గత ఏడాది డిసెంబర్ 13న అరెస్ట్ చేశారు. అదే రోజున ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో 2023 డిసెంబర్ 24న అల్లు అర్జున్ (allu Arjun) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ నెల మూడో తేదీన విచారణ జరగనుంది. మరో వైపు అల్లు అర్జున్ రిమాండ్ పై అదే రోజున కోర్టు నిర్ణయం వెలువర్చనుంది.
అల్లు అర్జున్ అరెస్ట్ తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ విమర్శలకు దారితీసింది. చట్టపరంగానే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. బీఆర్ఎస్ విమర్శలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇదే విషయమై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరును సమర్ధించారు. ఇందులో తప్పు లేదన్నారు.