'సినిమా చూపిస్తా మామ', 'కుమారి 21' లాంటి హిట్ సినిమాలతో హీరోగా మంచి క్రేజ్ సంపాదించిన యువ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం ఒక్క హిట్టు కూడా లేక డీలా పడిపోయాడు. రెండేళ్లలో 5 పరాజయాలను చూసిన రాజ్ తరుణ్ మార్కెట్ దారుణంగా పడిపోయిందని తెలిసిన విషయమే. అందుకే ఈసారి కథ విషయంలో మరింత జాగ్రత్త వహిస్తున్నాడు రాజ్ తరుణ్. కొత్త దర్శకుడు వేణు రాజ్ తరుణ్ కు ఒక కథను వినిపించాడట. పిచ్చి పాలనకు మారుపేరైన మహమ్మద్ బిన్ తుగ్లక్ మళ్లీ బతికి వచ్చి ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడమే కథ.
బాగా నవ్వు తెప్పించే విధంగా దర్శకుడు కథను రాసుకున్నాడు. అయితే ఇలాంటి కథ తనకు సెట్ అవుతుందో లేదో అన్న భయంతో ఈ సినిమాను కాస్త పక్కన పెట్టాడు రాజ్ తరుణ్. కొంచెం రిస్క్ ఉన్న మాట వాస్తవమే కానీ ఇలాంటి పరిస్థితుల్లో రొటీన్ ప్రేమ కథతో ముందుకు వచ్చి మళ్లీ దెబ్బతినే కంటే ఇలాంటి కొత్త తరహా కథలతో రావడం మంచిది. తన అభిప్రాయాన్ని తుది నిర్ణయాన్ని ఒక నెలలో చెప్పాల్సి ఉంది. రాజ్ తరుణ్ ఈ సినిమాలో నటిస్తాడో లేక వేరే కథల వైపు మొగ్గు చూపుతాడో చూడాలి.