జనసేనాని నిర్ణయం.. ప్రొడ్యూసర్లలో కంగారు..
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనంత బిజీగా ఉన్నారు. ఒకేసారి సినిమాలు, రాజకీయాలతో సతమతమవుతున్నారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనంత బిజీగా ఉన్నారు. ఒకేసారి సినిమాలు, రాజకీయాలతో సతమతమవుతున్నారు. ఏపీలో ఎన్నికల వేడి పుడుతుంటే.. పవన్ సైతం రాజకీయాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలకు, నిర్మాతలకు అన్యాయం చేస్తున్నారన్న వర్షన్ టాలివుడ్‌లో విన్పిస్తోంది. వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎత్తులు పన్నుతున్నారు. వరుస పర్యటనలతో ప్రజలలో మమేకమవుతున్నారు. రోడ్ షోలు, సభలు, ఉపన్యాసాలతో బిజీ అయ్యారు. జనసేన కార్యకర్తలకు ఇదీ ఆనందకరమైన విషయమే అయినప్పటికీ పవన్ చేస్తున్న రాజకీయాలు, ఆయన నిర్మాతలకు శాపంగా మారుతున్నాయ్.
భవిష్యత్తులో పవన్ కల్యాణ్ చేస్తొన్న సినిమాల మేకింగ్ పై ప్రభావాన్ని చూపెడుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ కల్యాణ్ జానపద చిత్రం హరిహర వీరమల్లు చేస్తున్నారు. చిత్రీకరణ కోసం ఎక్కువ రోజులు కేటాయించాల్సిన అవసరం వచ్చింది. పవన్ ఈ విషయంలో నిర్మాతలకు న్యాయం చేయడంలేదనిపిస్తొంది. గతం నెలలో సగం రోజులు రాజకీయాలకు, సగం రోజులు సినిమాలకు కేటాయించాలని అనుకున్నా పవన్ ఆ దిశగా మాత్రం అడుగులు వేయలేకపోతున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఎఎమ్ రత్నం నిర్మిస్తున్న హరిహర వీరమల్లు కోసం రెండు భారీ సెట్లు వేసి, మే 12 నుంచి చిత్రీకరణ ప్లాన్ చేయగా అది క్యాన్సిల్ అయినట్టు సమాచారం. పవన్ రాజకీయ కార్యక్రమాల కోసం షూటింగ్ క్యాన్సిల్ అయినా నిర్మాతకు మాత్రం బడ్జెట్ అంతకంతకూ పెరిగిపోతోంది. వేసిన రెండు సెట్ల మెంటైనెన్స్‌కు అవి వేసిన స్టూడియోకు రెంట్లుతో నిర్మాతలు తలలుపట్టుకుంటున్నారట.
దీనికి తోడు మళ్లీ చిత్రీకరణ ఉంటే పవన్ కాంబినేషన్‌కు తగ్గట్టు కాల్ షీట్లు తీసుకోవాలంటే మరింత ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం సినిమాతోనే కాదు పవన్ కల్యాణ్ డేట్స్ ఇస్తే సినిమా చిత్రీకరణ ప్రారంభిద్దామని రెండు సినిమా యూనిట్‌లు రెడీగా వున్నాయి. అందులో ఒకటి సముద్రఖని డైరక్షన్ లో చెస్తొన్న తమిళ్ రీమేక్ సినిమా కూడా ఉంది. నిజానికి ఈ సినిమా జూన్ నుంచి చిత్రీకరణ అనుకున్నా పవన్‌కున్న బిజీ షెడ్యూల్‌తో అది వెనక్కు జరుగుతోంది. ఇక ఏడాది కాలంగా వెయిట్ చేస్తొన్న హరీష్ శంకర్ సినిమా భవదీయుడు భగత్ సింగ్ చిత్రీకరణ సైతం కన్పూజన్‌లో పడింది. ఆగస్టు నుంచి షెడ్యూల్ వేసుకున్నా అది ఇప్పుడప్పుడే సాధ్యం కానట్టుగా పరిణామాలు కన్పిస్తున్నాయ్. రోజు రోజుకు రాజకీయాలు హీట్ ఎక్కుతుంటే పవన్ పాలిటిక్స్‌కు న్యాయం చేయాలన్న తలంపుతో అనూహ్యంగా నిర్మాతలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయ్.