US Election 2024 Results Live Updates: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్.. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్

US Election Results 2024 Live Updates in Telugu: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

Update: 2024-11-06 07:28 GMT

US Elections 2024 Live Updates in Telugu

US Election Results 2024 Live Updates in Telugu: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం అమెరికాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు లెక్కిస్తున్నారు. ఇప్పటికే రిపబ్లికన్ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ 270 స్థానాలతో భారీ ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్ 224  స్థానాలతో వెనుకంజలో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ స్పందించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడు తానే, అలాగే 47వ అధ్యక్షుడు కూడా తానేనన్నారు. తన క్యాంపెయిన్ పార్ట్‌నర్ జేడి వాన్స్‌ను ఇకపై వైస్ ప్రెసిడెంట్ అని పిలవొచ్చు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

బంగారు భవిష్యత్‌కు తనది పూచీ అని రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనల్డ్ ట్రంప్ చెప్పారు. పోలింగ్ తర్వాత తన మద్దతుదారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని ఆయన అన్నారు. అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతోందన్నారు. అమెరికా ప్రజల కోసం నిత్యం పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు చెప్పారు.

Live Updates
2024-11-06 16:22 GMT

US Elections 2024 Results: అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ ఎన్నిక ఖరారైపోయింది. డెమాక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై ఆయన స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. ఎలక్టోరల్ వోట్లలో 270 మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన ట్రంప్.. అమెరికాకు ఇది స్వర్ణయుగం అని వ్యాఖ్యానించారు. అయితే, ఆయన విజయాన్ని భారత్ ఎలా చూస్తోంది? ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడం వల్ల భారత్‌కు నష్టమా.. లాభమా?

అమెరికా ఓటర్లు ట్రంప్ వైపే ఎందుకు నిలబడ్డారు? ఎన్నికల ప్రచారంలో ట్రంప్, కమలా హారిస్ మధ్య పోటా పోటీ అన్నట్టుగా ప్రచారం సాగింది. ట్రంప్ కంటే కమలా హారిస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని తొలినాళ్లలో సర్వేలు వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన ఫలితాలు ట్రంప్, హారిస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. ప్రచారంలో ట్రంప్ ఇచ్చిన హామీలు ఆయన విజయంలో కీలకభూమిక పోషించాయి.

అమెరికా ఆర్ధిక వ్యవస్థను గాడినపెడతారని ట్రంప్ ఇచ్చిన హామీలను ఓటర్లు నమ్మారు. పాపులర్ ఓట్లలో 51 శాతం ఆయనకు దక్కాయి. కమలా హారిస్ కు 47 శాతం ఓట్లు వచ్చాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం, వేతనాలు, అక్రమ చొరబాట్లు, వేతనాల వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయి. 

గాజా యుద్దం విషయంలో డెమోక్రాట్ల వైఖరిపై జార్జియాలో మెజారిటీగా ఉండే అరబ్బులు, ముస్లింలు అసంతృప్తితో ఉన్నారని ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. అక్రమ వలసల విషయాన్ని ట్రంప్ ప్రచార అస్త్రంగా వాడుకున్నారు. 1798 నాటి ఎలియన్ ఎనిమీస్ యాక్ట్ ను మళ్లీ తెరమీదికి తెస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ హామీ ఆ పార్టీకి కలిసి వచ్చింది. బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు ద్రవ్యోల్బణంతో ధరలు పెరిగాయి. ఇవన్నీ కూడా కమలా హారిస్ కంటే ట్రంపే బెటర్ అనే అభిప్రాయం ఓటర్లకు కలిగిందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

భారత్ – అమెరికా వాణిజ్యం

వాణిజ్యపరంగా భారత్ కు అమెరికా చాలా కీలకం. అమెరికా నుంచి చేసుకుంటున్న దిగుమతుల కంటే అమెరికాకు చేస్తున్నఎగుమతులే ఎక్కువ. విదేశాల నుంచి దిగుమతులపై భారత్ ఎక్కువగా పన్నులు వేస్తోందని ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆరోపించారు. తాను గెలిస్తే ఈ పరిస్థితిని మారుస్తానని హామీ ఇచ్చారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశం అమెరికాకు 78.54 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అమెరికా నుంచి 50.24 బిలియన్ల డాలర్ల ఉత్పత్తులను ఇండియా దిగుమతి చేసుకుంది. దీంతో అమెరికాతో వాణిజ్యంలో భారత్ లాభదాయకంగా ఉందని స్పష్టమవుతోంది.

భారత ఎగుమతులపై ట్రంప్ భారీగా ట్యాక్స్ విధిస్తే భారతీయ ఉత్పత్తుల ధరను పెంచుతుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అధిక సుంకాలు విధించే దేశాలపై అదనపు పన్నులు విధించనున్నారు. అదే జరిగితే అమెరికాలో భారతీయ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ ఉత్పత్తి రంగంపై ప్రభావం పడుతుంది. భారతీయ వస్త్రాలు, నగలు, తోలు ఉత్పత్తులకు డిమాండ్ తగ్గవచ్చు. అమెరికాకు భారత్ నుంచి 16 బిలియన్ డాలర్ల వస్త్రాల ఎగుమతి అవుతాయి. అమెరికా మార్కెట్ లో డిమాండ్ తగ్గితే భారతీయ తయారీదారులు ఉత్పత్తిని తగ్గించాల్సి ఉంటుంది.

భారత ఐటీ పరిశ్రమపై ఏ మేరకు ప్రభావం ఉంటుంది?

వలసలపై కఠినంగా ఉంటానని ట్రంప్ ప్రకటించారు. గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హెచ్‌1 బీ వీసాలపై ఆయన కఠినంగా వ్యవహరించారు. అది భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం చూపించిందనే విమర్శలు వచ్చాయి. ఈసారి కూడా అదే బాట పడతారా, మారతారా అన్నది చూడాల్సి ఉంది.

సైనిక సహకారం

వాణిజ్యపరంగా భారత్ కు అమెరికా ప్రధాన వ్యూహాత్మక భాగస్వామి. రెండు దేశాల మధ్య కీలకమైన రక్షణ ఒప్పందాలున్నాయి. ఫైటర్ జెట్ ఇంజన్లను దేశీయంగా తయారు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను ఎదుర్కొనేందుకు రెండు దేశాల మధ్య సహకారం తప్పనిసరి అనే విశ్లేషణలున్నాయి.

చైనాకు చెక్

భారత్ లో సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ కేంద్రం, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, అంతరిక్ష, 6 జీ మొబైల్ టెక్నాలజీపై భారత్, అమెరికాలు కలిసి పనిచేయాలని ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. టెక్నాలజీలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు బైడెన్ సర్కార్ ప్రయత్నించింది. ఇదే విధానాలను ట్రంప్ కొనసాగిస్తే, అది పరోక్షంగా భారత్ కు మేలు చేస్తుంది.

తొలి టర్మ్ లో ట్రంప్ అమెరికాకు ప్రయోజనం కలిగే అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ దఫా కూడా అదే కొనసాగిస్తే దాని ప్రభావం ఇండియాతో పాటు ఇతర దేశాలపై కూడా ఉండే అవకాశం ఉంది. అయితే రానున్న రోజుల్లో ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

Full View


2024-11-06 16:16 GMT

Donald Trump: డొనల్డ్ ట్రంప్ 132 ఏళ్ల రికార్డ్ ను బ్రేక్ చేశారు. గతంలో గ్రోవర్ క్లీవ్ ల్యాండ్ సాధించిన రికార్డ్ ను ఆయన బద్దలు కొట్టారు. 1885-1889, 1893-1897 మధ్య క్లీవ్ ల్యాండ్ అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. తాజా ఎన్నికల ఫలితాలతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను సాధించారు. 2017-2021 వరకు ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. 20ఏళ్లలో పాపులర్ ఓట్లను పొందిన మొదటి రిపబ్లికన్ అభ్యర్ధి ట్రంప్. 2016 అధ్యక్ష ఎన్నికల్లో 538 ఎలక్టోరల్ ఓట్లలో 304 గెలుచుకున్నారు. కానీ, పాపులర్ ఓట్లను మాత్రం ఆయన దక్కించుకోలేదు.

1888 ఎన్నికల్లో క్లీవ్ ల్యాండ్ రిపబ్లికన్ అభ్యర్ధి బెంజిమెన్ హారిసన్ చేతిలో ఓటమిపాలయ్యారు. కానీ, అప్పట్లో ఆయనకు 90 వేల పాపులర్ ఓట్లు దక్కాయి. 444 ఎలక్టోరల్ ఓట్లలో 277 కైవసం చేసుకున్నారు. క్లీవ్ ల్యాండ్ ది కూడా న్యూయార్క్. ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు వీరిద్దరూ కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నవారే. 2016లో ట్రంప్ హిల్లరీ క్లింటన్ ను ఓడించారు. 2024లో ట్రంప్ కమలా హారిస్ ను ఓడించారు.

2024-11-06 10:57 GMT

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమాక్రాట్ ప్రత్యర్థి కమలా హారిస్‌పై స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్‌కు వివిధ దేశాల అధినేతలు శుభాకాంక్షాలు తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ‘గతంలో మీరు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్‌తో కొనసాగించిన సత్సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

2024 అధ్యక్ష ఎన్నికల్లో చరిత్రాత్మక విజయంతో పాటు ట్రంప్ సృష్టించిన రికార్డులు ఇంకా చాలానే ఉన్నాయి. మొన్నటి వరకూ అమెరికా చరిత్రలోనే ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలిన ఏకైక మాజీ అధ్యక్షుడిగా రికార్డు సృష్టించిన ట్రంప్, ఇప్పుడు క్రిమినల్ కేసులో కన్విక్ట్ అయిన తొలి అమెరికా ప్రెసిడెంట్‌గా కొత్త రికార్డు సృష్టించారు. 78 ఏళ్ళ ట్రంప్ బిజినెస్ రికార్డులను తప్పుగా చూపించారని అమెరికా కోర్టు ఆయనను దోషిగా తేల్చింది.

ఇప్పుడు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మీద నాలుగు క్రిమినల్ కేసులున్నాయి. ఇకపై ఆ కేసుల పరిస్థితి ఏంటి?

క్రిమినల్ కేస్ నంబర్ - 1

అమెరికాలో 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు. అయితే, ఆ ఎన్నికల సమయంలో అబద్ధాలు ప్రచారం చేశారని, ఫలితాలను తారుమారు చేసి చూపించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అలాగే, 2021 జనవరి 6న అమెరికా కాంగ్రెస్ భవనంపై జరిగిన దాడిని సాకుగా చూపించి జో బైడెన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రం రాకుండా అడ్డుపడ్డారని, ఆ విధంగా మరికొంత కాలం అధికారంలో కొనసాగేందుకు ప్రయత్నించారని ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి.

అమెరికాకు, ఆ దేశ ప్రజల హక్కులకు వ్యతిరేకంగా కుట్ర పన్నారంటూ ట్రంప్‌పై నాలుగు రకాల అభియోగాలు నమోదయ్యాయి. అయితే, అవన్నీ నిరాధారమైన ఆరోపణలని, బైడెన్ ప్రభుత్వం తనపై వేధింపులకు పాల్పడుతోందని ఆయన ప్రత్యారోపణలు చేశారు. అంతేకాదు, అధ్యక్షుడిగా తనకు విచారణకు సంబంధించిన మినహాయింపులు ఉంటాయని ఆయన వాదించారు. ఆయనకు పరిమిత మినహాయింపు వర్తిస్తుందని అమెరికా సుప్రీం కోర్టు కూడా అభిప్రాయపడింది. అయితే, ఈ కేసులో చాలా ఆరోపణలు కోర్టులో నిలబడే అవకాశాలు లేవు.

ఇప్పుడు ట్రంప్ గెలిచారు కాబట్టి, ఆయన తనకు తాను క్షమాభిక్ష ఇచ్చుకోవచ్చు. లేదా ఈ ఆరోపణలన్నింటినీ కొట్టివేయించవచ్చు.

క్రిమినల్ కేస్ నంబర్ -2

పోర్న్ చిత్రాల నటి స్టోర్మీ డేనియల్స్‌కు సరిగ్గా 2016 ఎన్నికలకు ముందు 1,30,000 డాలర్లు అంటే వంద కోట్ల రూపాయల కన్నా ఎక్కువ మొత్తాన్ని ఇచ్చారన్నది ట్రంప్ మీదున్న మరో క్రిమినల్ కేసు. ట్రంప్‌ తనతో సెక్స్ చేశారని చెప్పకుండా ఆమె నోరు మూయించేందుకే ఈ డబ్బు ఇచ్చారనే ఈ కేసు కూడా ఇంకా విచారణలో ఉంది. ఈ ఆరోపణలను కూడా ట్రంప్ తోసిపుచ్చారు. స్టోర్మీకి ఇచ్చినట్లు చెబుతున్న డబ్బు ట్రంప్ అకౌంట్లలో లీగల్ ఫీజు కింద ఎంటర్ చేసి ఉండడంతో కేసును సంక్లిష్టంగా మార్చింది.

అయితే, జ్యూరీ మాత్రం ట్రంప్ ఫైనాన్స్ చట్టాలను ట్రంప్ ఉల్లంఘించినట్లుగా నిర్ధారించింది. ట్రంప్ ఎప్పట్లానే ఇది రాజకీయ కుట్ర అని అన్నారు. ఇక్కడ కూడా సుప్రీం కోర్టు గతంలో అధ్యక్షులకు ఇచ్చిన మినహాయింపులనే వర్తింప చేస్తూ ట్రంప్‌ను దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని ఆయన తరఫు లాయర్లు వాదిస్తున్నారు.

ఈ కేసులో కూడా నాలుగేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కానీ, ట్రంప్ ఫైన్ కట్టి గట్టెక్కే అవకాశాలే ఎక్కువ అని న్యాయనిపుణులు చెబుతున్నారు.

క్రిమినల్ కేస్ నంబర్ – 3

డోనల్డ్ ట్రంప్ 2020 ఎన్నికల్లో జార్జియాలో కొద్దిపాటి తేడాతో ఓడిపోయారు. ఆ ఓటమిని గెలుపుగా మార్చేందుకు కుట్ర పన్నారంటూ ట్రంప్‌తో పాటు మరో 18 మంది మీద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. జార్జియా రాష్ట్రంలోని అత్యున్నత ఎన్నికల అధికారిని ‘11,780 ఓట్లు వచ్చేలా చూడు’ అని ట్రంప్ చేసిన ఫోన్ కాల్ లీక్ అవడం ఈ కేసులో కీలకంగా మారింది.

ఈ కేసులో కూడా తాను ఏ తప్పూ చేయలేదని ట్రంప్ వాదించారు. ఈ కేసు విచారణకు ఇప్పటికి తేదీలు ఖరారు కాలేదు. అయితే, ఓట్ల లెక్కింపులో అవకవతకలకు పాల్పడిన కేసులో ఆరోపణలు రుజువైతే 20 ఏళ్ళ వరకూ జైలు శిక్ష విధించవచ్చని చట్టం చెబుతోంది.

క్రిమినల్ కేస్ నంబర్ -4

ఇది ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తరువాత వైట్ హౌస్ నుంచి క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్‌ను తన మారా లాగో నివాసానికి తీసుకువెళ్ళారనే ఆరోపణలకు సంబంధించిన కేసు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ – ఎఫ్.బీ.ఐకి ఆ పైల్స్ దొరక్కుండా చేశారని, ఆ డాక్యుమెంట్స్ విషయంలో చేసిన అక్రమాలపై క్రిమినల్ విచారణకు కూడా అడ్డుపడ్డారని ట్రంప్ మీద అభియోగాలున్నాయి.

ఈ ఆరోపణల్లో అత్యంత తీవ్రమైనది, దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని కావాలనే తన వద్ద ఉంచుకున్నారన్నది. ఇది గూఢచర్యానికి పాల్పడడమనే నేరం కిందకు వస్తుంది. దీని చుట్టూ ఎనిమిది రకాల అభియోగాలు నమోదైనా, ట్రంప్ మాత్రం తనకే పాపం తెలియదనే చెబుతూ వచ్చారు.

అయితే, ఈ కేసును ఫ్లోరిడా కోర్టు జూలై 15న కొట్టేసింది. పెన్సిల్వేనియాలో హత్యా ప్రయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న తరువాత ట్రంప్‌కు లభించిన పెద్ద విజయమిది. స్పెషల్ ప్రాసిక్యూటర్ నియామకం అమెరికా రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిందనే వాదనతో ట్రంఫ్ తరఫు లాయర్ ఈ కేసును కొట్టేయించారు. కానీ, ఆ స్పెషల్ ప్రాసిక్యూటర్ దీని మీద అపీలుకు వెళ్ళారు. అయితే, ట్రంప్ లాయర్లు ఈ కేసు విచారణను అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ విచారణకు రాకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు.

గూఢచర్యానికి పాల్పడినట్లు రుజువైతే పదేళ్ళు, అధికారిక పత్రాలు తరలించే కుట్రకు పాల్పడినట్లు తేలితే 20 ఏళ్ళ వరకూ ట్రంప్‌కు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కానీ, ఇప్పుడు ఆయనే అధ్యక్షుడిగా మరోసారి గెలిచారు. మళ్ళీ వైట్ హౌస్‌లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ కేసుల కంచికి చేరినట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

2024-11-06 10:52 GMT

Usha Chilukuri Vance: అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా తెలుగమ్మాయి ఉష భర్త.. ఎవరీ ఉష చిలుకూరి వాన్స్?

Who is Usha Chilukuri Vance?: అమెరికా అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. రిపబ్లిక్ వర్సెస్ డెమోక్రటిన్ల మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈసారి తెలుగు మూలాలున్న మహిళ భర్త అమెరికా వైస్ ప్రెసిడెంట్ కానున్నారు. వారు ఎవరో కాదు.. అమెరికాకు వైస్ ప్రెసిడెంట్ అనిపించుకోబోతున్న జేడి వాన్స్, ఆయన భార్య ఉషా చిలుకూరి వాన్స్. దీంతో ప్రస్తుతం ఉషా చిలుకూరి వాన్స్ పేరు ఇప్పుడు భారత్‌లో మార్మోగిపోతోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లకు గానూ.. సాధారణ మెజార్టీకి అవసరమైన 270 మార్క్‌ను ట్రంప్ సాధించారు. దీంతో అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. ఇక అమెరికా అధ్యక్షుడిగా గెలిచానన్న ఆనందంలో డోనల్డ్ ట్రంప్ మునిగిపోయారు. ఆ ఆనందంలో ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్ వద్ద భారీ సంఖ్యలో గూడిగూడిన తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికా మనకు భారీ మద్దతును ఇచ్చిందన్నారు. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఆ క్రమంలోనే రిపబ్లికన్స్ పార్టీ తరపున వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్న జేడి వాన్స్‌ని కూడా ఆయన ప్రశంసించారు. ఇకపై మిమ్మల్ని వైస్ ప్రెసిడెంట్ అని పిలవొచ్చు అంటూ గట్టిగా అరిచి చెప్పారు. జేడీవాన్స్, ఆయన భార్య ఉష చిలుకూరి వాన్స్‌ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దీంతో ప్రస్తుతం ఉషా చిలుకూరి పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జేడీ వాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక కానుండడంతో ఆయన భార్య ఉష చిలుకూరి గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇంతకీ ఎవరీ ఉషా చిలుకూరి. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామం ఉషా చిలుకూరి పూర్వీకుల స్వగ్రామం. ఉషకు తాత వరుస అయిన రామ్మోహన రావు కుటుంబం ప్రస్తుతం ఇక్కడే నివాసం ఉంటోంది. ఉష పూర్వీకులు దశాబ్దాల కిందటే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. సాయిపురంలో 18వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన సంతానమే శాఖోపశాఖలుగా ఉష వరకు విస్తరించింది. ఆమె ముత్తాత వీరావధాన్లకు ఐదుగురు సంతానం. రామశాస్త్రి, సూర్యనారాయణ శాస్త్రి, సుబ్రహ్మణ్య శాస్త్రి, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణ మూర్తి అందరూ ఉన్నత విద్యావంతులే.

రామశాస్త్రి మద్రాసు వలస వెళ్లిపోయి మద్రాసు ఐఐటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన భార్య బాలాత్రిపుర సుందరి . వీరికి అవధాని, నారాయణ శాస్త్రి, రాధాకృష్ణ, శారద అని నలుగురు సంతానం ఉన్నారు. ముగ్గురు కుమారులు అమెరికాలో స్థిరపడగా శారద మాత్రం చెన్నైలో నివాసం ఉంటూ వైద్యురాలిగా స్థిరపడ్డారు. ఏరో నాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన రాధాకృష్ణ శాన్‌డియాగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. పామర్రుకు చెందిన లక్ష్మితో ఆయనకు వివాహం కాగా వారి సంతానమే ఉష.

వైజాగ్‌కు చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్ శాంతమ్మకు ఉష మనవరాలు వరుస అవుతారు. శాంతమ్మ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 96 ఏళ్ల వయస్సులో ఇప్పటికీ పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి ద్వారా ఉషతో తనకు బంధుత్వం ఉందని.. ఆమె తనకు మనవరాలు అవుతుందని శాంతమ్మ తెలిపారు. శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి కొన్నేళ్ల కిందట మృతిచెందారు. సుబ్రహ్మణ్య శాస్త్రి సోదరుడు రామశాస్త్రి కుమారుడైన రాధాకృష్ణ కుమార్తె ఉష.

2024-11-06 09:49 GMT

US Elections 224 Results Live Updates: అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ ఎన్నిక దాదాపు ఖాయమైపోయింది. ఇక మిగిలిందల్లా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అమెరికా కాంగ్రెస్‌లో మొత్తం 538 సభ్యులు ఉన్నారు. అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలంటే అందులో 270 మంది మద్దతు అవసరం. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల్లో 267 మంది విజయం సాధించారు. మరోవైపు కమలా హారీస్‌కు ఓటు వేయాల్సిన డెమొక్రాట్స్ 224 స్థానాల్లోనే గెలుపొందారు. డోనల్డ్ ట్రంప్ సొంతం చేసుకున్న మెజారిటీకి ఆమె దరిదాపుల్లో కూడా లేరు. దీంతో ఇక ట్రంప్ విజయం సాధించినట్లేనని అమెరికన్స్ ఒక నిర్ణయానికొచ్చేశారు.

డోనల్డ్ ట్రంప్ సైతం తనని తాను అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్ లో తన మద్దతుదారులు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ట్రంప్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు 45 అధ్యక్షుడిని తానే.. అలాగే 47వ అధ్యక్షుడు కూడా తానేనని అన్నారు. అమెరికా ఫెడరల్ చట్టాల ప్రకారం డోనల్డ్ ట్రంప్ విజయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు ఇక మిగిలిందల్లా ఎలక్టోరల్ కాలేజ్ ప్రక్రియ మాత్రమే.

ఇదిలావుంటే డోనల్డ్ ట్రంప్ ను అభినందిస్తూ ప్రపంచ దేశాల అధినేతలు ఆయనకు కంగ్రాట్స్ చెబుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా "హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్ మై ఫ్రెండ్" అంటూ శుభాకాంక్షలు తెలిపారు.


2024-11-06 09:05 GMT

Donald Trump Shoutouts To JD Vance After US Election 2024 Results: అమెరికా అధ్యక్షుడిగా గెలిచానన్న ఆనందంలో డోనల్డ్ ట్రంప్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అదే ఆనందంలో ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్ వద్ద భారీ సంఖ్యలో గుడిగూడిన తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికా మనకు భారీ మద్దతును ఇచ్చిందన్నారు. తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ఆయన ధన్యావాదాలు చెప్పారు. ఆ క్రమంలోనే రిపబ్లికన్స్ పార్టీ తరపున వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్న జేడి వాన్స్‌ని కూడా ఆయన ప్రశంసించారు. ఇకపై మిమ్మల్ని వైస్ ప్రెసిడెంట్ అని పిలవొచ్చు అని వ్యాఖ్యానించారు.

రిపబ్లికన్స్ విజయం కోసం జేడి వాన్స్ పనిచేసిన తీరును అభినందించారు. జెడి వాన్స్, ఆయన భార్య ఉష చిలుకూరి వాన్స్ ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉష చిలుకూరి వాన్స్ భారత సంతతి మహిళ అనే విషయం తెలిసిందే. జేడి వాన్స్‌ని వైస్ ప్రెసిడెంట్ అని పిలిచిన అనంతరం, అదే వేదికపై ఆయన అభిప్రాయం చెప్పాల్సిందిగా మైక్ వద్దకు ఆహ్వానించారు. ఈ వార్త ప్రచురించేటప్పటి వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం డోనల్డ్ ట్రంప్ 270 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్ 214 స్థానాల వద్ద ఉన్నారు.

2024-11-06 07:59 GMT

Donald Trump after US Elections 2024 Results: అమెరికా బంగారు భవిష్యత్ కు తనది పూచీ అని రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనల్డ్ ట్రంప్ చెప్పారు. పోలింగ్ తర్వాత తన మద్దతుదారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని ఆయన అన్నారు. అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతోందన్నారు. అమెరికా ప్రజల కోసం నిత్యం పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. కొత్త చట్టాలు తెచ్చేందుకు ఇబ్బందులు రావన్నారు. తన విజయంలో మెలానియా కీలకపాత్ర పోషించారని ట్రంప్ చెప్పారు. వేదికపైనే ప్రసంగించారు. అమెరికా ప్రజలు ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు.

2024-11-06 07:56 GMT

US Election Results 2024: అమెరికా కాంగ్రెస్ కు ట్రాన్స్ జెండర్ తొలిసారి ఎన్నికయ్యారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా డెలవేర్ లోని ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి సారా మెక్ బ్రైడ్ గెలిచారు. రిపబ్లిక్ పార్టీ తరపున జాన్ వేలెన్ 3 తో ఆమె పోటీ పడ్డారు. సారాకు 95 శాతం ఓట్లు పోలయ్యాయి. వేలేన్ కు 57.9 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. డెలవేర్ లో మార్పు కోసం తాను కృషి చేస్తానని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ, పిల్లల సంరక్షణ, పునరుత్పత్తికి సంబంధించిన పాలసీలపై ఫోకస్ చేస్తానని తెలిపారు.

ఎల్ జీ బీ టీ క్యూ జాతీయ కార్యకర్తగా సారా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు 3 మిలియన్లకు పైగా విరాళాలు సేకరించారు. 2016లో డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో ఓ ప్రధాన పార్టీ నిర్వహించిన సమావేశంలో ట్రాన్స్ జెండర్ గా ఆమె గుర్తింపు పొందారు. 2020లో డెలవేర్ లో తొలి ట్రాన్స్ స్టేట్ సెనెటర్ గా వ్యవహరించారు. 2010 నుంచి డెలవేరియన్ ఓటర్లు డెమోక్రట్లకే మద్దతిస్తున్నవారు.

ఎవరీ సారా? 1990 ఆగస్టు 9న సారా విల్మింగ్టన్ లో పుట్టారు. తండ్రి డేవిడ్, తల్లి సాల్లే మెక్ బ్రైడ్. తండ్రి లాయర్. క్యాబ్ కల్లోవే స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్ కు ఫౌండర్. 2009లో ఆమె గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. 2013లో అమెరికన్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. 2011లో అమెరికన్ యూనివర్శిటీ స్టూడెంట్ గవర్నమెంట్ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. చిన్నతనం నుంచి ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉండేది. డెలవేర్ లో పలు రాజకీయ ప్రచారాల్లో ఆమె పాల్గొన్నారు.

2024-11-06 07:53 GMT

Why Joe Biden Dropped From US Presidential Election 2024: ప్రస్తుతం ప్రపంచం అంతా అమెరికా ఎన్నికల చుట్టే తిరుగుతోంది. అమెరికాలో ఎన్నికల ప్రక్రియ ఎంత వరకు వచ్చింది? ఓట్ల లెక్కింపు ఎంత వరకు వచ్చింది? అమెరికా అధ్యక్షుడిగా గెలిచేది ఎవరు? అనే అంశాలపైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. అదే సమయంలో కొంతమందికి ఇంకో డౌట్ కూడా వస్తోంది. అదేంటంటే.. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఈసారి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని? వారికి అలా సందేహం రావడానికి కారణం కూడా లేకపోలేదు.

భారత్‌లో ఎన్నికల సరళి, ఇక్కడి రాజకీయాల్లో ఒకసారి ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా గెలిచిన వాళ్లు వీలైనంత వరకు ఆ స్థానాన్ని అలాగే పదిలం చేసుకోవాలనే ధోరణిలో ఉంటారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఏదైనా బలమైన కారణం ఉంటేనో లేక పార్టీ అధిష్టానం వారిని పక్కకు పెడితేనో తప్ప ఒకసారి ఆ స్థాయికి వచ్చిన నాయకులు ఎవ్వరూ రెండోసారి ఆ పదవివి దూరంగా ఉండాలని అనుకోరు. అలాంటప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎందుకు రెండోసారి పోటీ చేయడం లేదు? గతంలో జార్జి డబ్లూ బుష్, బరాక్ ఒబామా సహా పది మందికిపైగా అధ్యక్షులు రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన వాళ్లు ఉన్నారు. మరి జో బైడెన్ ఎందుకు పోటీ చేయడం లేదనేది వారి సందేహం.

ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం విషయానికొద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో తాను నిలబడటం లేదని జో బైడెన్ ఈ ఏడాది జులై 21వ తేదీనే పబ్లిక్గా ప్రకటించారు. అందుకు కారణం కూడా చెప్పారు. తమ సొంత పార్టీ అయిన డెమొక్రటికా పార్టీలోనే తన అభ్యర్థిత్వంపై కొన్ని బిన్నాభిప్రాయాలున్నాయి. పార్టీలో అంతర్గతంగా విభేదాలు ఉన్నప్పుడు పోటీ చేస్తే అది ప్రత్యర్థికి ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ తన లక్ష్యం తాను మరోసారి అమెరికా అధ్యక్షుడు అవడం కాదు. డోనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడు అవకుండా చూడటమే తన ప్రధాన కర్తవ్యం అని జో బైడెన్ చెప్పారు. అందుకే తాను పోటీ చేయకుండా తమ పార్టీ తరపున కమలా హారీస్ ని అమెరికా ప్రెసిడెంట్‌గా గెలిపించేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టంచేశారు.

అది తప్పుడు ప్రచారమన్న బైడెన్

జో బైడెన్ ఎందుకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే విషయంలో రకరకాల కామెంట్స్ వినిపించాయి. ఆయనకు వయసైపోయిందని, ఆరోగ్యం సహకరించడం లేదని రకరకాలుగా ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారంలో నిజం లేదని జో బైడెన్ తేల్చిచెప్పారు. తన ఆరోగ్యం, మానసిక పరిస్థితి అంతా బాగానే ఉందని బైడెన్ వివరించారు. పోటీ చేయకపోవడానికి గల కారణాలను చెప్పే క్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

2024-11-06 07:39 GMT

US Elections 2024 results: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో 23 రాష్ట్రాల్లో జయకేతం ఎగురవేసిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రపం, మరో 7 రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. డెమోక్రటిక్ పార్టీ కమలా హారిస్ 13 రాష్ట్రాలో విజయం సాధించారు. మరో 5 రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. 7 స్వింగ్ రాష్ట్రాలకు గాను ఆరింటిలోనూ ట్రంప్ ముందంజలో ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లో ఈ రాష్ట్రాలు ప్రభావితం కానున్నాయి. పాపులర్ ఓట్లలోనూ ట్రంపే ముందున్నారు. ట్రంప్ నుకు 52శాతం, కమలా హారిస్ కు 46.2 శాతం పాపులర్ ఓట్లు వచ్చాయి.

ఇప్పటి వరకు 23 రాష్ట్రాల్లో ట్రంప్, మరో 13 రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ విజయఢాంకా మోగిస్తున్నారు. మిస్సిసిపి, సౌత్ కరోలినా, టెన్నెసీ, వర్జీనియా, ఇండియానా , ఫ్లోరిడా, ఆర్కాన్సస్, ఒహియో, వ్యోమింగ్,నార్త్ డకోట, సౌత్ డకోట, నెబ్రాస్కా, ఒక్లహామా, లుసియానా, వెస్ట్ వర్జీనియా, అలబామా, టెక్సాస్, మిస్సోరీ, మోంటానా, కాన్సస్, ఒక్లాహామా, అయోవా, ఐడా హో రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించారు.

డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ ఇల్లినాయిస్, మేరీలాండ్, వెర్ మౌంట్, న్యూయార్స్, మస్సాచుసెట్స్, కన్నెటిక్టికట్, రోడ్ ఐలాండ్ లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. శ్వేతసౌధంలో అడుగుపెట్టాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం. ఇంతవరకు 393 ఎలక్టోరల్ ఓట్ల ఫలితాలు వెలువడగా..అందులో 214 ఓట్లు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, 179 ఎలక్ట్రోరల్ ఓట్లు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారీస్ కు వచ్చాయి. 

Tags:    

Similar News