Heart Problems: ఈ లక్షణాలు కనిపిస్తే మీ గుండె వీక్‌గా ఉన్నట్లే...
Heart Weak Symptoms: గుండె సమస్యలు ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయాయి.
Heart Weak Symptoms: గుండె సమస్యలు ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం పెద్దలకు మాత్రమే పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు యువతను కూడా వెంటాడుతోంది. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు గుండెపోటుతో మరణిస్తుండడం అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. భారత్‌లో ఇటీవల ఈ సమస్య మరింత ఎక్కువైంది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు కారణం ఏదైనా.. గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
అయితే గుండె సమస్యలను సరైన సమయంలో గుర్తించి, జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ముందస్తు లక్షణాల ఆధారంగా గుండె సమస్యలు ఇట్టే కనిపెట్టవచ్చు. గుండ్ బలహీనంగా మారుతున్న సమయంలో శరీరం మనకు కొన్ని ముందస్తు సంకేతాలను అందిస్తుంది. అలాంటి కొన్ని లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* ఊపిరి తీసుకోవడంలో తలెత్తే సమస్యలు గుండె అనారోగ్యానికి ప్రధాన సమస్యగా భావించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా శ్వాస తీసుకునే సమయంలో పిల్లికూతలు దీర్ఘకాలంగా వస్తుంటే వైద్యులను సంప్రదించాలి. సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
* గుండె బలహీనంగా గుండె వారిలో కాస్త దూరం నడవగానే ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా శ్వాసతీసుకోవడంలో సమస్యలు ఎదురవుతాయి. మరీ ముఖ్యంగా నడుస్తున్న సమయంలో లోతుగా ఊపిరి పీల్చుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమస్య దీర్ఘకాలంగా ఎదుర్కొంటుంటే అది కచ్చితంగా గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యగా భావించాలి.
* వీక్ హార్ట్‌కు ప్రధాన లక్షణాల్లో కాళ్లలో వాపు కనిపించడం ఒకటని నిపుణులు చెబుతున్నారు. కాలిలోని రక్తనాళాల్లో రక్తం నిలిచిపోవడం వల్ల ఈ లక్షణం కనిపిస్తుంది. ఇది గుండె బలహీనతను తెలియజేస్తుంది. గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయని సమయంలో ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే ఈ లక్షణం కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని అంటున్నారు.
* దగ్గు కూడా గుండె బలహీనతను తెలియజేస్తుందని నిపుణులు అంటున్నారు. దీనికి కార్డియాక్ కఫ్‌గా వైద్యులు అభివర్నిస్తుంటారు. గుండె పనితీరు మందగించి, ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్ల ఇలాంటి దగ్గు వస్తుందని చెబుతున్నారు. దగ్గుతున్న సమయంలో ముక్కులో నుంచి నీరు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
* ఇక చిన్న చిన్న పనులకే అలసిపోతుంటే గుండె ఆరోగ్యం బలహీనపడుతోందని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తేలికైన ఇంటి పనులు చేస్తున్నా త్వరగా అలసిపోతుంటే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.
* తరచూ తల తిరుగుతున్నట్లు అనిపించడం కూడా గుండె సమస్యలకు ప్రధాన సంకేతంగా భావించాలని నిపుణులు అంటున్నారు. మెదడుకు రక్త ప్రవాహం తగ్గడం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. గుండె సరిగ్గా పనిచేయని సమయంలోనే ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా ఉన్న సమాచారం ఆధారంగా అందించినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.