Heart Attack: ఈ 3 కారణాల వల్లే గుండెపోటు ప్రమాదం ఎక్కువ..!
Heart Attack: ఈ 3 కారణాల వల్లే గుండెపోటు ప్రమాదం ఎక్కువ..!
Heart Attack: ఆధునిక జీవితంలో బిజీ లైఫ్ షెడ్యూల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా గుండెపోటు వేగంగా విస్తరిస్తోంది. గతంలో గుండె జబ్బులు వృద్ధాప్య సమస్యగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా యువకులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. గత సంవత్సరం నటుడు సిద్ధార్థ్ శుక్లా, ప్రముఖ కన్నడ చిత్రాల నటుడు పునీత్ రాజ్‌కుమార్ కూడా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
గుండెపోటు ఎందుకు వస్తుంది?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుండెకు రక్త ప్రసరణ ఆగినప్పుడు గుండెపోటు వస్తుంది. సాధారణంగా గుండె నాళాలలో కొవ్వు, కొలెస్ట్రాల్, ఇతర పదార్థాలు పేరుకుపోవడం వల్ల ఒక రకమైన అడ్డంకులు ఏర్పడతాయి. మనం ప్రతిరోజూ తెలిసి తెలియక కొన్ని పనులు చేస్తుంటాం. దాని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీని గురించి ప్రజలందరూ తెలుసుకోవడం, నివారించడం ముఖ్యం. మన అలవాట్లను మెరుగుపరచుకోవడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
బరువును అదుపులో ఉంచుకోకపోవడం
ప్రస్తుత జీవితంలో చాలామంది ప్రజలు ఊబకాయం లేదా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. గుండెపోటుకు ఇది ప్రమాద కారకాల్లో ఒకటిగా ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ఊబకాయం వల్ల అధిక కొలెస్ట్రాల్, అధిక ట్రైగ్లిజరైడ్, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నాయి. బరువును సకాలంలో అదుపులో ఉంచుకుంటే ఈ సమస్యలన్నింటిని పరిష్కరించవచ్చు.
ధూమపానం, ఒత్తిడి
ధూమపానం చేసేవారు, అధిక ఒత్తిడికి లోనయ్యే వ్యక్తులకు గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. నిజానికి, ధూమపానం వల్ల ధమనులలో ఒక రకమైన పదార్థం అడ్డుగా ఏర్పడుతుంది. దీని వల్ల ధమనులు సంకుచితమై గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అదేవిధంగా ఎక్కువ ఒత్తిడిని తీసుకోవడం వల్ల కూడా రక్తపోటు సమస్య పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు ప్రధాన కారకంగా కనిపిస్తుంది. అందుకే ఒత్తిడికి లోనుకాకుండా, పొగతాగడం మానెయ్యాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
శ్రమ తగ్గడం
సుఖవంతమైన జీవితాన్ని ఇష్టపడితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శ్రమలేకపోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం అనేక రెట్లు పెరుగుతుంది. ఏ పనిచేయకుండా ఉన్నప్పుడు ధమనులలో కొవ్వు పదార్థాలు పేరుకుపోతాయి. మీ గుండెకు రక్తాన్ని చేరవేసే ధమనులు దెబ్బతిన్నట్లయితే అది గుండెపోటుకు దారి తీస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ రోజూ వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.