Met Gala 2024:180 క్యారెట్ల డైమండ్ నెక్లెస్ వేసుకున్న సుధా రెడ్డి ఎవరు?
Met Gala 2024: మెట్ గాలా.. రెండు మూడు రోజుల నుంచి ఈ ఫ్యాషన్ ఈవెంట్‌పై మీడియాలో చాలా చర్చ జరుగుతోంది.
Met Gala 2024: మెట్ గాలా.. రెండు మూడు రోజుల నుంచి ఈ ఫ్యాషన్ ఈవెంట్‌పై మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. కళ్లు చెదిరే డ్రెస్సులు వేసుకొని రెడ్ కార్పెట్‌పై హొయలు ఒలికించిన సెలబ్రిటీల ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ ఆలియా భట్, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాషా పూనావాలా, వ్యాపారవేత్తలు మోనా పటేల్, సుధా రెడ్డి, భారత సంతతికి చెందిన బ్రిటిష్ నటి సిమోన్ ఆష్లీ, భారత సంతతికి చెందిన అమెరికన్ నటి మిండీ కేలింగ్, డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ తదితరులు ఈవెంట్‌కు హాజరైన ప్రముఖుల్లో ఉన్నారు.
అయితే, వీరిలో వ్యాపారవేత్త సుధా రెడ్డి కాస్ట్యూమ్, ఆభరణాలపై మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆమె ఎవరు?
180 క్యారెట్ల డైమండ్ నెక్లెస్
సుధా రెడ్డి.. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త, బిలియనీర్‌గా సుపరిచితురాలు. కళ్లు తిప్పుకోనివ్వని ఐవరీ సిల్క్ గౌన్‌లో మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై ఆమె నడిచారు. ఈ డ్రెస్సును డిజైనర్ తరుణ్ తహిలియానీ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీని కోసం 80 మంది కళాకారులు మొత్తంగా 4,500 గంటలు కష్టపడ్డారు. మొఘల్ గార్డెన్స్ నుంచి స్ఫూర్తి పొంది ఈ డెస్‌ను డిజైన్ చేసినట్లు మీడియాతో తరుణ్ చెప్పారు.
అయితే, డ్రెస్సు కంటే సుధా రెడ్డి మెడలోని నెక్లెస్ ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించింది.
అది 180 క్యారెట్ల డైమండ్ నెక్లెస్. మీరు విన్నది నిజమే అది 180 క్యారెట్లే. దాని పేరు ‘అమోరే ఎటెర్నో’. న్యూయార్క్ పోస్టు గాసిప్ కాలమ్ ‘పేజ్ సిక్స్’లో దీనిపై ఒక కథనం వచ్చింది.
‘‘ఈవెంట్‌కు ఆమె 180 క్యారెట్ల డైమండ్ నెక్లెస్ వేసుకున్నారు. దీని మధ్యలో 25 క్యారెట్ల హార్ట్-షేప్ డైమండ్ ఉంది. ఇది తన భర్తకు ప్రతిబింబమని ఆమె చెప్పారు. మరో మూడు 20 క్యారెట్ల డైమండ్లు తను, తన ఇద్దరు పిల్లలకు చిహ్నాలని ఆమె చెప్పారు. మొత్తంగా నాలుగు పెద్ద డైమండ్స్, 21 చిన్న డైమండ్స్ ఆ నెక్లెస్‌లో ఉన్నాయి ’’ అని పేజ్ సిక్స్ పేర్కొంది.
ధర ఎంత?
మరోవైపు ఈ నెక్లెస్ గురించి ‘టౌన్ అండ్ కంట్రీ’ మ్యాగజైన్‌తో సుధా రెడ్డి మాట్లాడారు. తన 25వ పెళ్లి వార్షికోత్సవం నాడు తన భర్త కృష్ణా రెడ్డి తనకు ఇది బహుమతిగా ఇచ్చారని చెప్పారు.
డిజైనర్ ఫరా ఖాన్ అలీ సాయంతో తయారుచేయించిన ఈ నెక్లెస్ విలువ పది మిలియన్ డాలర్లు (రూ.83.5 కోట్లు)కుపైనేనని ఉంటుందని ఆ మ్యాగజైన్ తెలిపింది.
ఈ నెక్లెస్‌కు అదనంగా రెండు డైమండ్ రింగ్స్ సుధా రెడ్డి పెట్టుకున్నారు. వీటిలో ఒకటి 23 క్యారెట్ల ఎల్లో డైమండ్ రింగ్. మరొకటి 20 క్యారెట్ల హార్ట్-షేప్ డైమండ్ రింగ్.
ఆమె భర్త ఎవరు?
ఇటీవల ఎలక్టోరల్ బాండ్ల వివాదంలో మేఘ ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) పేరు వార్తల్లో మార్మోగిన సంగతి గుర్తుందా? ఆ సంస్థ డైరెక్టర్ పేరు పీవీ కృష్ణా రెడ్డి. ఆయన్ను అందరూ ‘మేఘ కృష్ణా రెడ్డి’ అని పిలుస్తుంటారు. ఆయన భార్యే సుధా రెడ్డి. వీరికి మానస్, ప్రణవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సుధా రెడ్డి ఫౌండేషన్‌కు హెడ్‌గా కూడా సుధా రెడ్డి కొనసాగుతున్నారు. కంపెనీ దాతృత్వ కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటారు.
విజయవాడలో పెరిగిన సుధ 19 ఏళ్లకే కృష్ణా రెడ్డిని పెళ్లి చేసుకున్నారు.
మెట్ గాలాకు సుధా రెడ్డి హాజరుకావడం ఇదేమీ తొలిసారి కాదు. 2021లో జరిగిన ఈవెంట్‌కు కూడా ఆమె హాజరయ్యారు. ‘‘ఈ మెట్ గాలాలో భారతీయురాలిని నేను ఒక్కదాన్నే ఉన్నట్లు అనిపించింది. ఇంత ఆత్మవిశ్వాసంతో గర్వంగా ముందెప్పుడూ ఉన్నట్లు గుర్తులేదు. ఈ అనుభూతిని వర్ణించేందుకు మాటలు రావడం లేదు. ఎప్పటికీ మరచిపోలేను అని చెప్పి ఊరుకుంటే సరిపోదు. ప్రపంచ పఠంలో భారత్‌ను నిలిపే అవకాశాన్ని నేనెప్పుడూ వదులుకోను’’ అని ఆమె ఆనాడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
మెట్ గాలాకు ఎవరిని పిలుస్తారు?
మెట్ గాలా అనేది ఒక ఫ్యాషన్ కార్యక్రమం. ఏటా మే నెల మొదటి సోమవారం సాయంత్రం న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో దీన్ని నిర్వహిస్తారు.
ఈ మ్యూజియంలోని కాస్ట్యూమ్ ఇన్‌స్టిట్యూట్.. ప్రముఖుల నుంచి విరాళాలు సేకరించేందుకు ఏటా ఈ షోను నిర్వహిస్తుంది. దీనికి కొంతమంది ప్రముఖులు, కొన్ని సంస్థలు స్పాన్సర్లుగా ఉంటాయి.
భిన్న రంగాలకు చెందిన ప్రముఖులకు ఈ పార్టీకి రావాలని ఆహ్వానాలు పంపిస్తారు. ఆహ్వానం లేనిదే ప్రముఖులు లోపలకు అడుగుపెట్టడానికి వీల్లేదు.
ఇక్కడకు వచ్చే వారు వేసుకునే డ్రెస్సులకు థీమ్‌లను కూడా ముందుగానే నిర్ణయిస్తారు. ఈ ఏడాది థీమ్ ‘స్లీపింగ్ బ్యూటీస్: రీఅవేకనింగ్ ఫ్యాషన్’.
2023లో మొత్తంగా 400 మంది గెస్టులను ఈ షోకు ఆహ్వానించామని కాస్ట్యూమ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. గెస్టులను అలరించేందుకు ఇక్కడ అత్యంత ప్రముఖ సెలబ్రిటీల ప్రదర్శనలు కూడా ఉంటాయి.