Insulin - Nazolin Spray: మధుమేహనికి నొప్పి లేకుండా ఇన్సులిన్!
Insulin - Nazolin Spray: ప్రపంచంలోనే తొలి 'నాజులిన్ స్ప్రే' అభివృద్ధి చేసిన హైదరాబాద్ కంపెనీ...
Insulin - Nazolin Spray: మధుమేహం చికిత్సలో సరికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు మధుమేహం వ్యాధికి ఇంజక్షన్ ద్వారా ఇన్సులిన్ తీసుకుంటున్నారు. బయటకు వెళ్లినప్పుడు, ఫంక్షన్లలో ఇన్సులిన్ తీసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ఇక నుంచి ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు ట్రాన్స్‌జెన్ బయోటెక్ సారథి కోటేశ్వరరావు. ఈ సమస్యను నివారించి తేలిగ్గా ఇన్సులిన్ తీసుకునేందుకు వీలుగా 'నాజులిన్ స్ప్రే' ను అభివృద్ధి చేశామని ఆయన తెలిపారు. రెండు దశాబ్దాల సుదీర్ఘ పరిశోధనల ఫలితంగా ప్రపంచంలో మొట్టమొదటి సారిగా ఈ నాజల్ స్ప్రే రూపుదిద్దుకుందని వివరించారు. త్వరలోనే 5, 10, 20 యూనిట్లలో ఈ స్ప్రే అందుబాటులోకి రానుందని డాక్టర్ కోటేశ్వరరావు తెలిపారు.
ఇప్పటివరకు నోటి ద్వారా ఇన్సులిన్ ఇచ్చే విషయంలో చేసిన పరిశోధనలు సత్ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ఇంజక్షన్ ద్వారానే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముక్కు ద్వారా ఇన్సులిన్ అందించే 'నాజులిన్ స్ప్రే' మధేమేహ చికిత్సలో సమూల మార్పులు తెస్తుందని నిపుణులు చెబుతున్నారు. కండరానికి ఇన్సులిన్ ఇంజక్షన్ చేసుకున్నప్పుడు అది రక్తంలో కలిసి, ప్రభావం చూపేందుకు కొద్దిగా సమయం పడుతుంది. నాజులిన్ స్ప్రే వేగంగా రక్తంలో కలుస్తుంది కాబట్టి తక్షణమే ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక 2022 చివరి నాటికి నాజులిన్ స్ప్రే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని డాక్టర్ కోటేశ్వరరావు తెలిపారు.