Women Health : నెలసరి ఆగిపోయిందా? గుండెపోటు ముప్పు ఎక్కువే..!
Women Health : మెనోపాజ్ తర్వాత ఆడవారి గుండె ఆరోగ్యం ఊహించినదాని కంటే వేగంగా క్షీణిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా మగవారితో పోలిస్తే ఆడవారికి చిన్నవయస్సులో గుండెపోటు వచ్చే ముప్పు తక్కువగా ఉంటుంది.
Women Health : నెలసరి నిలిచిన తర్వాత ఆడవారిలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యం క్రమంగా క్షిణిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా మగవారితో పోలిస్తే ఆడవారికి చిన్న వయసులో గుండెపోటు ముప్పు తక్కువగా ఉంటుంది. కానీ నెలసరి నిలిచిన తర్వాత మగవారితో సమానంగా ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే దీని కన్నా చాలా ఎక్కువగా ముప్పు పెరుగుతున్నట్లు తాజాగా బయటపడింది. గుండెజబ్పు ముప్పు కారకాలు గల మగవారిని, రుతుక్రమం ఆగిపోయిన మహిళలను ఎంచుకుని పరిశోధనకులు అధ్యయనం నిర్వహించారు.
వీరంతా కొలెస్ట్రాల్ ను తగ్గించే స్టాటిన్స్ వాడుతున్నావారు. గుండె రక్తనాళాల్లో ఎంత కాల్షియం ఉందో తెలిపే స్కోరును పరిశీలిస్తే..మగవారిలో కన్నా నెలసరి నిలిచిన మహిళల్లో సగటున రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని రుజువైంది. నెలసరి నిలిచిన తర్వాత ఆడవారిలో గుండె ఆరోగ్యం వేగంగా క్షీణిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. తీవ్ర గుండె సమస్యల విషయంలో వీరికి స్టాటిన్స్ తగినంత రక్షణ కల్పించడం లేదన ఫలితాలు చెబుతున్నాయి. ఇంతకు నెలసరి నిలిచిన తర్వాత ఆడవారిలో గుండె సమస్యలు ఎందుకు వేగంగా పెరుగుతున్నాయి. తెలుసుకుందాం.
చాలా వరకు ఈస్ట్రోజెన్ మోతాదులు వేగంగా తగ్గడమే దీనికి కారణం. స్త్రీ హార్మోన్ గా భావించే ఈస్ట్రోజెన్ లైంగిక పరమైన అంశాల్లోనే కాకుండా ఇతరత్రా పనుల్లోనూ భాగస్వామ్యం అవుతుంది. రక్తనాళాలు విప్పారేలా చూడటంలో ఇది ఒకటి. ఇలా అధిక రక్తపోటు ముప్పును అది తగ్గిస్తుంది. అంతేకాదు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పోగు పడకుండా, గట్టిపడకుండా కూడా కాపాడుతుంది. కణాలను నిర్వీర్యం చేసి వాపు ప్రక్రియ తలెత్తకుండా చూస్తుంది. నెలసరి నిలిచిన తర్వాత ఈస్ట్రోజన్ లెవల్స్ తగ్గటం వల్ల ఇలాంటి రక్షణలన్నీ కొరవడుతాయి. కొవ్వు కణజాలం, బరువు పెరగడం, జీవక్రియల వేగం తగ్గడం, నిద్ర అస్తవ్యస్తం కావడం వంటివి కారణం అవుతాయి.
నిజానికి ఈ విషయం చాలాక్రితమే తెలిసినప్పటికీ ఎంతో మంది మహిళలకు ఈ విషయం తెలియదనే చెప్పాలి. పూడికలు ఏర్పడే వేగం రెట్టింపు అవుతుందన్న సంగతి ఇప్పుడు తేలియడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అందుకే గుండెజబ్బు కారకాలు గల పెద్ద వయసు మహిళలు తగ్గించుకోవడం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.