Healthy Diet: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టే ఆహార పదార్థాలు

Healthy Diet: వర్షాకాలంలో ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారపదార్ధాల గురించి తెలుసుకుందాం.

Update: 2021-06-27 04:32 GMT

Healthy Diet:(File Image) 

Healthy Diet: చినుకులు పడుతుంటే మనకు బాగా ఎనర్జీ వచ్చేస్తుంది. హుషారు పెరిగిపోతుంది. అంతే హుషారుగా ఇన్ ఫెక్షన్స్ అటాక్ చేసేస్తాయి. వర్షం పడిందంటే.. బ్యాక్టీరియా, వైరస్ లకు పండగే. అవి క్యాంపులు వేసుకోవడానికి బోలెడన్ని ప్లేసులు దొరుకుతాయి. దాంతో అవి బలపడి.. మన బలాన్ని హరించడానికి దూసుకొచ్చేస్తాయి. అందుకే వర్షంలో తడవకుండా గొడుగు ఎలా పెట్టుకుంటామో.. అలాగే ఇన్ ఫెక్షన్లు రాకుండా కూడా అలాంటి గొడుగులు మన ఆహారంలోనే ఉంటాయి. అవేంటో మన 'లైఫ్ స్టైల్' లోచూద్దాం.

వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఆహారంలో కూడా మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. వాతావరణ పరిస్థితులలో విపరీతమైన మార్పు మన జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అందుకని ఈ వర్షాకాలంలో ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారపదార్ధాల గురించి తెలుసుకుందాం.

మొక్కజొన్న ఆరోగ్యకరమైన రుతుపవనాల ఆహారం. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో లుటిన్ మరియు ఫైటోకెమికల్స్ ఉంటాయి. అంతేకాదు కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో మొక్కజొన్న చినుకులు పడుతున్నప్పుడు ఇష్టంగా తినే చిరుతిండి. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మొక్కజొన్నను ఉడికించుకుని లేదా కాల్చుకుని తినవచ్చు.

వర్షాకాలంలో తినదగిన మరో ఆరోగ్యకరమైన పండు బొప్పాయి. దీనిలో యాంటీపైరెటిక్ చర్య వర్షాకాలంలో జ్వరం, దగ్గు మరియు జలుబు వంటి చిన్న తరహా సమస్యలను నివారిస్తుంది.

ఆపిల్‌, దానిమ్మలను ఎక్కువగా తినాలి. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి.అల్లం, మిరియాలు, తేనె, పుదీనాతో తయారు చేసిన హెర్బల్‌ టీలు తీసుకోండి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలుంటాయి. తాజా ముల్లంగి రసాన్ని తాగితే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

మొక్కజొన్న, శనగపిండి, శనగలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. బ్రౌన్‌రైస్‌, ఓట్స్‌, బార్లీలకు ప్రాధాన్యం ఇవ్వాలి.వెల్లుల్లిని సూప్‌లలో, కూరలలో విధిగా వేయండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది.

జీర్ణాశయ సమస్యలకు చెక్ పెట్టగలిగే శక్తి అరటిపండుకు ఉంది. ఇందులో పుష్కలంగా వుండే విటమిన్లు, మినరల్స్ శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అరటిపండ్లు తక్కువ కేలరీలను కలిగి ఉండి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండటానికి సహాయపడతాయి. వర్షాకాలంలో వచ్చే లిచీ, బొప్పాయి, దానిమ్మ, జామవంటి పండ్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి త్వరగా జీర్ణమవడమే కాకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రిస్తాయి. అలాగే జామలో ఉండే ఐరన్‌, ఫొలేట్‌, పొటాషియం నిత్యం మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

ఈ నియమాలు పాటిస్తూ సాధ్యమైనంత వరకు వేడి వేడి పదార్థాలు తీసుకుంటూ...ఎక్కువ శాతం ఇంట్లో చేసే ఆహార పదార్థాలను తీసుకుంటూ బయట ఆహార పదార్థాలకు దూరంగా వుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Tags:    

Similar News