డయాబెటీస్‌కి వాడే ఔషధం కిడ్నీ రోగుల మరణాలను తగ్గిస్తుంది..! ఎలాగంటే..?
*నేషనల్ హెల్త్ సర్వీసెస్ (NHS) లండన్ ఈ ఔషధ వినియోగాన్ని ఆమోదించింది.
Dapagliflozin Tablets Uses: వైద్య శాస్త్రంలో ఒక్కోసారి వింత సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా డయాబెటీస్ రోగులు వాడే ఓ ఔషధం కిడ్నీ రోగులకు పనిచేస్తుంది. మరణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఔషధం కిడ్నీ రోగులలో డయాలసిస్, అవయవ మార్పిడి జరగకుండా నిరోధిస్తుంది. నేషనల్ హెల్త్ సర్వీసెస్ (NHS) లండన్ ఈ ఔషధ వినియోగాన్ని ఆమోదించింది.
NHS ప్రకారం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న 91,000 మంది రోగులకు డపాగ్లిఫ్లోజిన్ అనే మధుమేహ ఔషధం ఉపయోగిస్తున్నారు. ఈ ఔషధాన్ని ఫోర్క్సిగా బ్రాండ్ పేరుతో మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇది టైప్-2 మధుమేహం చికిత్సలో ఉపయోగిస్తారు. డయాబెటిక్ రోగులలో ఈ ఔషధం శరీరంలో ఉన్న అదనపు గ్లూకోజ్‌ను తొలగిస్తుంది. అయితే ఈ ఔషధం కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. అతిగా వాడకూడదు. దయచేసి ఈ ఔషధాన్ని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డపాగ్లిఫ్లోజిన్ అనే డయాబెటిస్ డ్రగ్ ఎలా ఉపశమనం ఇస్తుందో అర్థం చేసుకోవడానికి 5 వేల మందిపై పరిశోధనలు చేశారు. డపాగ్లిఫ్లోజిన్‌ను రోజువారీ మోతాదులో తీసుకునే రోగులకు డయాలసిస్ అవసరం తక్కువగా ఉంటుందని ఈ పరిశోధనలలో గుర్తించారు. ఇది కాకుండా ఇటువంటి రోగులలో కిడ్నీ మార్పిడి, మరణాల ప్రమాదం కూడా 39 శాతం తక్కువగా ఉంటుంది.
NHS నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి సంవత్సరం కనీసం 30,000 మంది కిడ్నీ డయాలసిస్ ప్రక్రియను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా మంది రోగులు డయాలసిస్ కోసం వారానికి 3 రోజులు ఆసుపత్రికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాదు UK లో ప్రతి సంవత్సరం 1500 కిడ్నీ మార్పిడి జరుగుతుంది. సగటున ఒక రోగి కిడ్నీ మార్పిడి కోసం 2 నుంచి 3 సంవత్సరాలు వేచి ఉండాలి. అటువంటి సందర్భాలలో ఈ ఔషధం చాలా మేలు చేస్తుంది.