పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై కరోనా ఎఫెక్ట్.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు
Covid 19 Effects Male Fertility: కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి.
Covid 19 Effects Male Fertility: కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు నాశనమయ్యాయి. వైరస్‌బారిన పడి లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ కరోనా సోకి కోలుకున్న వారిలో తరచూ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాదు.. కరోనా సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని తాజాగా ఓ అధ్యయనం కలకలం రేపుతోంది. స్వల్ప లక్షణాలతో అనారోగ్యానికి గురైనవారిలోనూ సంతానోత్పత్తికి సంబంధించిన ప్రొటీన్లు దెబ్బతింటాయని ఐఐటీ బొంబాయి, జస్లోక్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనల్లో తేలింది.
కరోనా సోకి కోలుకున్న వారిలో శరీరంలోని పలు అవయవాలకు హాని కలిగిస్తోంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను వైరస్ పెంచుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందులో భాగంగా అలసట, శ్వాస ఆడకపోవడం, దగ్గు, ఒంటి నొప్పులు, గుండె సంబంధిత దీర్ఘకాలిక లక్షణాలతో బాధపడుతున్నారు. కోవిడ్ సోకిన వారిపై ఐఐటీ బొంబాయి, జస్లోక్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు పరిశోధనలు నిర్వహించారు. అయితే వారి పరిశోధనల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. స్వల్ప లక్షణాలతో కరోనా బారిన పడిన పురుషుల్లో సంతానోత్పత్తికి సంబంధించిన ప్రొటీన్ల స్థాయిలను మారుస్తున్నట్టు గుర్తించారు. పురుషుల పునరుత్పత్తి అవయవాల్లో వైరస్ నమూనాలను కనుగొన్నట్టు వివరించారు. పురుషుల వీర్య నమూనాలపై జరిపిన ఈ పరిశోధన వివరాలను ఏసీఎస్ ఒమెగా జర్నల్ ప్రచురించింది.
పురుషుల వీర్య నమూనాలపై అధ్యయనం కోసం 10 మంది ఆరోగ్యవంతమైన పురుషులు, ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్న 17 మంది పురుషుల నుంచి వీర్య నమూనాలను పరిశోధకులు సేకరించి.. విశ్లేషించారు. అధ్యయనానికి ఎంచుకున్న వారి వయస్సు 20 నుంచి 45 ఏళ్లు. అయితే వారిలో ఎవరికీ వంధ్యత్వానికి సంబంధించిన సమస్యలు లేవు. ఆరోగ్యవంతమైన పురుషులతో పోలిస్తే.. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో వీర్య కణాలు గణనీయంగా తగ్గినట్టు ఈ అధ్యయనంలో తేలింది. అంతేకాదు.. పునరుత్పత్తి పనితీరుకు సంబంధించిన ప్రొటీన్ల స్థాయిల్లోనూ మార్పులను పరిశోధకులు గుర్తించారు. కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో 27 ప్రొటీన్లు అధికస్థాయిలో, 21 ప్రొటీన్లు తక్కువ స్థాయిలో ఉన్నట్టు నిర్ధారించారు. ప్రత్యేకించి సంతానోత్పత్తికి సంబంధించిన సెమెనోజెలిన్1, ప్రోసాపోసిన్ ప్రొటీన్లు కోలుకున్నవారిలో తక్కువగా ఉన్నట్టు తేల్చారు.
గతేడాది బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగం పరిశోధకులు కూడా ఓ అధ్యయనం చేశారు. కరోనా సోకిన పురుషుల్లో సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుందని వెల్లడించారు. అయితే కరోనా సోకిన స్త్రీలలో సంతానోత్ప్తిపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం విశేషం. ఇక కరోనాను అడ్డుకునే టీకాలతో సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపదని అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీలో ప్రచురించిన అధ్యయనం తెలిపింది. ఇవే కాకుండా కోవిడ్ నుంచి కోలుకున్న వారిపై ప్రపంచ వ్యాప్తంగా పలు అధ్యయనాలు వెలువడ్డాయి. అయితే అన్ని పరిశోధనల్లోనూ పురుషులపైనే ఎక్కువ ప్రభావం చూపుతున్నట్టు వెల్లడయింది. అంతేకాకుండా ఊబకాయం, ఒత్తిడి, మానసిక సమస్యలు, మధుమేహం, గుండె జబ్బులు సోకుతాయని స్పష్టం చేస్తున్నాయి.
అయితే తాజాగా వెలువడిన ఐఐటీ బొంబాయి, జస్లోక్ ఆసుపత్రి పరిశోధనలను నిర్థరించడానికి మరిన్ని అధ్యయనాలు జరగాలని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఏదేమైనా కోవిడ్ నుంచి కోలుకున్న పురుషుల్లో మాత్రం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మాత్రం తలెత్తుతున్నాయి. తాజా పరిశోధనలతో పురుషుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.